టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి.. అథ్లెటిక్స్ లో ఇండియాకు స్వర్ణాన్ని అందించిన అద్భుతాన్ని చేసిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో చరిత్రను లిఖించాడు.
వరల్డ్ అథ్లెటిక్స్ చాంఫియన్షిప్ లో తొలిసారి భారతదేశం తరఫున సిల్వర్ మెడల్ ను గెలిచి మరో ఘనతను సాధించాడు. ఒలింపిక్స్ లో పతకం నెగ్గిన తర్వాత ఇక తన లక్ష్యాలేవీ లేకుండా పోలేదని ఇది వరకే ప్రకటించిన నీరజ్, ఆ మేరకు తన సత్తా చూపించాడు.
ఒలింపిక్స్ లో ఈ అథ్లెట్ స్వర్ణాన్ని సాధించగానే.. చాలా మంది రకరకాల మాటలు చెప్పారు. నీరజ్ బయోపిక్ రూపొందించాలని, ఇంకా ఏవేవో చెప్పారు. అయితే వాటిపై తన దృష్టి లేదని.. ఇంకా పతకాలు సాధించడం మీదే ఉందని అప్పట్లోనే ఈ 24 యేళ్ల కుర్రాడు స్పష్టం చేశాడు. ఆ మేరకు తన కృషిని కొనసాగించాడు. ఈ క్రమంలో తొలి సారి వరల్డ్ అథ్లెటిక్స్ చాంఫియన్షిప్ లో భారతదేశానికి రజతాన్ని సాధించి పెట్టాడు.
విశేషం ఏమిటంటే.. అంతర్జాతీయ వేదికపై ఒలింపిక్స్ లో కన్నా తన బెస్ట్ ను నమోదు చేశాడు నీరజ్. టోక్యో ఒలింపిక్స్ లో 87.58 మీటర్ల దూరం బల్లేన్ని విసిరి స్వర్ణపతాక ధారి అయ్యాడు నీరజ్. ఇప్పుడు వరల్డ్ అథ్లెటిక్స్ మీట్ లో ఏకంగా 88.13 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. అయితే.. ఈ సారి మరో త్రోయర్ 90 మీటర్ల దూరాన్ని సునాయాసంగా అధిగమించాడు. దీంతో.. నీరజ్ రెండో స్థానంలో నిలిచినట్టుగా అయ్యింది. నాలుగో అవకాశంలో నీరజ్ తన బెస్ట్ నంబర్ ను నమోదు చేశాడు.
ఇది వరకూ భారతదేశం తరఫున ఒకసారి ఒలింపిక్స్ పతకం సాధించిన వారు కూడా మళ్లీ ఆ స్థాయి ప్రదర్శనను ఇచ్చింది పెద్దగా లేదు. పతకం గెలిచాకా.. వారి ప్రదర్శనలో కూడా చాలా మార్పు కనిపించేది. పాశ్చాత్య దేశాల అథ్లెట్ల తరహా అలా ఉండదు. డజన్ల కొద్దీ పతకాల సాధనలో వారు యమ బిజీగా ఉంటారు. ఇప్పుడు నీరజ్ అదే దిశగా సాగుతున్నట్టుగా ఉన్నాడు!