నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మించిపోయారు. వెండితెరపై మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా కామెడీ పండించడంలో నిర్మాత బండ్ల గణేష్ దిట్ట. కొంత కాలం ఆయన రాజకీయ తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షకు పెట్టారు. అయితే రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదని ఆయనకు త్వరగానే తత్వం బోధపడింది. దీంతో రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. అప్పుడప్పుడు సినిమా వేడుకలు, సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ బండ్ల తన ఉనికి చాటుకుంటున్నారు.
ఎందుకోగానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు వింటే బండ్ల గణేష్ గుర్తొచ్చారు. కామెడీ పండించడంలో రాజగోపాల్‌రెడ్డి తగ్గేదే లేదంటున్నారు. ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆయన నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. మనసులో మాటను ధైర్యంగా చెప్పడానికి ఇబ్బంది ఏంటో అర్థం కాదు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారుతానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తన కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. కార్యకర్తలతో చర్చించకుండా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనని సినిమా డైలాగ్ కొట్టారు. టీఆర్ఎస్ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు కోమటిరెడ్డి పిలుపునివ్వడం విశేషం.
మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న రాజగోపాల్‌రెడ్డి రెండు రోజుల క్రితం అమిత్‌షాను కలవాల్సిన పనేంటి? తనపై దుష్ప్రచారం జరగడానికి కారణం ఎవరు? తన నిలకడలేని విధానాలే ఆరోపణలకు బీజం వేస్తున్నాయి. ఒకవైపు కేసీఆర్‌ను ఓడించే శక్తి ఒక్క బీజేపీకే ఉందని, టీఆర్ఎస్ను గద్దె దింపే పార్టీలో చేరుతానని ప్రకటించి, మళ్లీ తానే దుష్ప్రచారం అంటూ అరవడం విమర్శలకు తావిస్తోంది.
కాంగ్రెస్‌పై విధేయతను చాటుకుంటూనే, బీజేపీతో చెలిమి చేయడం రాజగోపాల్‌రెడ్డికే చెల్లుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాస్త కామెడీని తగ్గిస్తే, గౌరవం మిగులుతుందని గ్రహిస్తే మంచిది.