కేంద్రంలో రాజ్యమేలుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి ధీటుగా.. ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిని పెట్టి .. అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి సత్తా చూపించాలని మమతా బెనర్జీ తెగ యత్నాల్లో ఉన్నారు పాపం! బీజేపీకి లోక్ సభలో బలం ఉంది. రాజ్యసభలోనూ ఉంది. అయితే రాష్ట్రాల అసెంబ్లీ బలాబలాలు, ఇంకా అనేక రకాల ఓటింగ్ లెక్కలతో ముడిపడి ఉన్న రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి ప్రతిపక్షాలన్నీ కలిసి ధీటైన పోటీ ఇచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి.
అయితే వాటిల్లో ఐక్యత ఏమిటనేది కొశ్చన్ మార్క్. మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పరమ బీజేపీ వ్యతిరేక పార్టీనే హాజరు కాలేదు. అలాగే శిరోమణి అకాళీదల్, టీఆర్ఎస్ లు కూడా ఈ సమావేశానికి మొహం చాటేశాయి.
ఇక్కడ ఏపీకి సంబంధించిన విషయం ఏమిటంటే.. గత లోక్ సభ ఎన్నికలప్పుడు ఈ కూటమితో కలిసి ఊరేగిన చంద్రబాబుకు ఈ సమావేశానికే ఆహ్వానం దక్కకపోవడం! గత పర్యాయం ఎన్నికలప్పుడు ఈ కూటమిలో కీలకంగా వ్యవహరించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
కాంగ్రెస్ తో చేతులు కలిపారు. జేడీఎస్ వాళ్లకు రాజకీయ పాఠాలు నేర్పారు. మమతను ముందు పెట్టి… వెనుక తను ఉండి అంతా నడిపించారు చంద్రబాబు. అయితే ఎన్నికల్లో ఎదురైన ఘోరమైన ఓటమితో .. బీజేపీ ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు మూడేళ్లుగా పాకులాడుతూనే ఉన్నారు!
దీంతో చంద్రబాబు నాయుడును మమత కూడా నమ్మడం మానేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల మీటింగుకు కూడా చంద్రబాబును ఆహ్వానించనట్టుగా ఉన్నారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం లేదు. అయితే చంద్రబాబులా వైఎస్ జగన్ గత ఎన్నికల సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఈ కూటమి వైపు వెళ్లలేదు.
నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్ లు కేంద్రంలోని ఏ కూటమి సమావేశాల వైపు కూడా చూడటం లేదు. గత ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తెగ ఉబలాటపడ్డ చంద్రబాబుకు మాత్రం ఇప్పుడు ఢిల్లీలో ఈ విలువ దక్కుతోంది!