పెద్ద నోట్ల ఉపసంహరణ గుర్తుందా..? 2వేల నోటును రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకుంటున్నట్టు కొన్ని నెలల కిందట ప్రకటించింది. ఇప్పుడు ఆ గడువు కౌంట్ డౌన్ దశకు చేరింది. మరో 4 రోజుల్లో పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగియనుంది. ఈలోగా ఎవ్వరి వద్దనైనా పెద్ద నోటు ఉంటే మార్చుకోవడమో లేదా డిపాజిట్ చేయడమో చేయాలి.
30వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఆర్బీఐ గడువు పెంచనంటోంది. కొంతమంది మాత్రం పెంచే అవకాశం ఉందంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే, అసలు ఇప్పటివరకు ఎన్ని నోట్లు వెనక్కు వచ్చాయి?
మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీచేసింది. అప్పట్నుంచి లెక్కేసుకుంటే, సెప్టెంబర్ 1 నాటికి 93 శాతం పెద్ద నోట్లు బ్యాంకులకు చేరాయి. ఎక్కువమంది తమ ఖాతాల్లో డిపాజిట్లు చేసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ సంగతి పక్కనపెడితే.. మిగతా 7 శాతం పెద్ద నోట్ల సంగతేంటి?
సెప్టెంబర్ 1 నాటికి బ్యాంకులకు చేరని 2 వేల నోట్లు 7 శాతం ఉండగా.. వాటి విలువ అక్షరాలా 24వేల కోట్ల రూపాయలు. ఈ నెలలో ఆ 7 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్టేనా? మిగిలిన ఈ 4 రోజుల్లో ఇంకా ఎన్ని నోట్లు రావాల్సి ఉంది?
తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 30 తర్వాత 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణకు గడువు పెంచే ఆస్కారం లేదు. అక్టోబర్ 1 నుంచి ప్రజా వాణిజ్య లావాదేవీల్లో 2వేల రూపాయల నోటు చెల్లదు. అయితే ఆ నోటును నిర్దేశిత బ్యాంకుల్లో జమ చేసుకునే విధంగా ఆర్బీఐ కొన్ని శాఖల్ని ఏర్పాటుచేసే అవకాశం ఉందంటున్నారు.
అంటే, అక్టోబర్ 1 నుంచి పెద్ద నోటును ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో మార్పిడి చేసుకోవడం కుదరదన్నమాట. కేవలం కొన్ని నిర్దేశిత శాఖల్లో మాత్రమే పెద్ద నోట్లను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకునేలా ఆర్బీఐ మార్గదర్శకాలు జారీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మార్కెట్లో పెద్ద నోటు దాదాపు కనుమరుగైంది. ఆర్బీఐ ప్రకటనకు ముందే సామాన్యుడి కంటికి కనిపించని 2వేల రూపాయల నోటు, అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో కనుమరుగుకానుంది.
అక్టోబర్ 1 నుంచి 500 రూపాయల నోటు మాత్రమే అతిపెద్ద పెద్ద నోటుగా చలామణి కానుంది. మార్కెట్లోకి తిరిగి 2వేల రూపాయల నోటును తీసుకొస్తారా లేక వెయ్యి రూపాయల నోటును మళ్లీ ప్రవేశపెడతారా అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి ఆర్బీఐ నుంచి ఎలాంటి సమాధానం లేదు.