పుష్ప సినిమాలో పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం దుంగల్ని అల్లు అర్జున్ ఎలా తప్పిస్తాడో అందరం చూశాం. పాల ట్యాంకర్, పెళ్లి ట్రాక్టర్.. ఇలా రకరకాల వేషాల్లో ఎర్రచందనం దుంగల్ని చెక్ పోస్ట్ దాటించేస్తాడు పుష్ప. సరిగ్గా బీహార్ లో కూడా ఇలాంటి వ్యవహారమే జరిగింది. అయితే అక్కడ తరలించింది ఎర్రచందనం దుంగలు కాదు, విదేశీ మద్యం బాటిళ్లు. బీహార్ లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ రవాణా కోసం కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.
చావు తెలివితేటలు..
అవును.. ఇవి నిజంగా చావు తెలివితేటలే. లేకపోతే శవపేటికలో ఎవరైనా మద్యం బాటిళ్లు తరలిస్తారా..? కానీ వారి టైమ్ బాగోలేక పోలీసులకు చిక్కారు. శవపేటిక నుంచి 212 విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గయలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. శవపేటికలో మద్యం బాటిళ్లు చూసి పోలీసులే షాకయ్యారు.
ఎలా తెలిసిందంటే..?
గయ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ అంబులెన్స్ సర్రున దూసుకొచ్చింది. అంబులెన్స్ లో ఉన్నవారు హడావిడి పడుతుండే సరికి పోలీసులకు అనుమానం వచ్చింది. లోపల ఎవరున్నారు అని ప్రశ్నించగా.. శవం ఉందంటూ బాక్స్ చూపించారు. లోపల పేషెంట్ కొన ఊపిరితో ఉంటే.. ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది హడావిడి పడినా ఓ అర్థముంది, మరి శవాన్ని తీసుకెళ్తూ ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు పోలీసులు.
ఓసారి శవాన్ని చూడనీయండి అంటూ అంబులెన్స్ లోపలికి ఎక్కారు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే పైన ఓ గుడ్డ కప్పి ఉంది. దాన్ని పక్కకు తొలగిస్తే విదేశీ మందు బాటిళ్లు తళతళా మెరుస్తున్నాయి. మొత్తం 212 బాటిళ్లు. జాగ్రత్తగా పార్శిల్ చేసి తరలించాలని చూశారు కేటుగాళ్లు. పోలీసుల కళ్లుగప్పారు కానీ, చివరకు దొరికిపోయారు. వారంతా జార్ఖండ్ కి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
శవపేటిక వ్యవహారంతో పోలీసులే షాకయ్యారు. ఇకపై అంబులెన్స్ లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయాలని డిసైడ్ అయ్యారు.