Advertisement

Advertisement


Home > Politics - National

కాంగ్రెస్ కూలిపోకుండా.. ఎవరు ఆపగలరు?

కాంగ్రెస్ కూలిపోకుండా.. ఎవరు ఆపగలరు?

కాంగ్రెస్ పార్టీ నిత్యం ముఠాకుమ్మలాటలతో కుదేలవుతూ ఉండే పార్టీ. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటూ ఉండడం.. బ్రిటిషు వారునేర్పిపోయిన డివైడ్ అండ్ రూల్‌ను పాటిస్తూ అధిష్ఠానం ముఠాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ముఠాలు అలా కొట్టుకుంటూ ఉంటేనే.. అధిష్ఠానంగా తమ స్వరూపానికి విలువ ఉంటుందని భావిస్తూ ఉంటుంది. అయితే ఆ ముఠాలు నిత్యం పార్టీ పతనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను.. పార్టీలోని ముఠాలే పతనానికి చేర్చేలా కనిపిస్తున్నాయి.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్.. మొత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా అధికార పగ్గాలు స్వీకరించడానికి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. శవాసనం వేసిఉన్న కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెడతారనే నమ్మకంతో సోనియా కుటుంబం అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న మరో నాయకుడు శశిథరూర్ తిరుగుబాటు నాయకుడుగా ముద్ర ఉండడమే అందుకు కారణం కావొచ్చున. లేదా.. గెహ్లోత్ తరహా విధేయతను సోనియా కుటుంబం కోరుకుంటూ ఉండవచ్చు. 

మొత్తానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెడతారని అధిష్ఠానం ఆశిస్తున్న అశోక్ గెహ్లోత్, తాను సీఎంగా పార్టీ అధికారంలో ఉన్న సొంత రాష్ట్రంలో కూడా శవాసనం వేయించే విధంగా పావులు కదుపుతున్నారు. అక్కడ ముఠాలను ప్రోత్సహిస్తూ పార్టీ పతనాన్ని నిర్దేశించే పనులు చేస్తున్నారు. 

గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఖాళీ కాబోయే సీఎం పీఠం సచిన్ పైలట్ కే దక్కుతుందని అందరూ అంచనాలు వేస్తూ వచ్చారు. అధిష్ఠానం మొగ్గు అటు ఉన్నట్టే అంతా అనుకున్నారు. అయితే అక్కడ గెహ్లోత్ వర్గంలోని ఎమ్మెల్యేలు పైలట్ కు పగ్గాలు ఇస్తే తాము రాజీనామా చేసేస్తామంటూ బెదిరించడం తాజా పరిణామం. వారికి గెహ్లోత్ మద్దతు ఉండడం కొసమెరుపు. 

గతంలో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసి ప్రభుత్వం కూలడానికి ప్రయత్నించారనేది వారి ఆరోపణ. అప్పట్లో రాహుల్ బుజ్జగించాక పైలట్ మరియు ఆయన వర్గం మళ్లీ కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు. అలా తిరుగుబాటు చేసిన నాయకుడికి సీఎం సీటు ఇస్తే తాము రాజీనామా చేస్తామని 50మందికి పైగా గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకరుకు ఆల్రెడీ రాజీనామా లేఖలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

వారి వర్గానికి మళ్లీ ముఖ్యమంత్రి సీటు ఇస్తే గనుక.. ఈసారి సచిన్ పైలట్ రాజీ లేకుండా తన గ్రూపుతో వేరు కుంపటి పెట్టుకోవడం ఖాయం. అలా జరిగినా కూడా ప్రభుత్వం అత్తెసరు మెజారిటీలో పడుతుంది. ఇండిపెండెంట్లతో కప్పల తక్కెడ రాజకీయాలు జరిగితే గనుక.. కాంగ్రెసు సర్కారు కూలుతుంది. 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు ఇవ్వడానికి పదవికోసం ఆరాటపడుతున్న నాయకుడు గెహ్లోత్ , తన సొంత రాష్ట్రంలో పార్టీ ఉసురు తీయడానికి పూనుకుంటూ ఉండడమే కాంగ్రెస్ పార్టీ ఖర్మ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?