గత మూడు రోజుల్లో ఏకంగా 12 భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫలితంగా వీటిని రకరకాల విమానాశ్రయాల్లో అర్ధాంతరంగా ల్యాండింగ్ చేయడమో, టేకాఫ్ డిలేలు జరిగాయి. ఏదో ఒకటీ రెండు అంటే ఆకతాయిల పని అనుకోవచ్చు. అయితే మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 12 విమాన సర్వీసుల విషయంలో ఇలాంటి నకిలీ బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. దీనిపై పౌరవిమానయాన శాఖ దృష్టి సారించింది.
ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారట. అలా దొరికితే ఆపై వారు జీవితంలో విమానం ఎక్కకుండా చేసేందుకు లేకుండా నిషేధించనున్నారని, కేసులు అదనం అని సమాచారం. ఇలాంటి నకిలీ కాల్స్ ను చేస్తున్న వారిని గుర్తించేందుకు సైబర్ సెక్యూరిటీ సాయం తీసుకుంటోందట విమానాయన శాఖ.
ఫేక్ కాల్స్ వల్ల భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థలకు సంబంధించి, విదేశాలకు వెళ్తున్న విమానాలు కూడా అర్ధాంతరంగా ల్యాండ్ అయ్యాయి. కెనడాలో ఒక చోట మారుమూల ప్రాంతంలోని విమానాశ్రయంలో కూడా ఒక భారతీయ విమానం ల్యాండ్ అయ్యింది. అయితే అన్నీ ఉత్తుత్తి బెదిరింపులే అని ఆ తర్వాత తేలింది. అయితే కావాలని వరస పెట్టి వస్తున్న కాల్స్ వెనుక అసలు టార్గెట్ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి.
ఇలాంటి బెదిరింపు కాల్స్ నేపథ్యంలో.. విదేశాలకు వెళ్లే భారతీయ విమానాల్లో ఎయిర్ మార్షల్స్ ను పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. వీరు ప్యాసింజర్స్ తరహాలో మామూలు దుస్తుల్లోనే వారిలో కలిసిపోయి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ మేరకు విదేశాలకు ప్రయాణించే ఎయిర్ లైన్స్ లో ఎయిర్ మార్షల్స్ ను పంపి భరోసాను కల్పించే ప్రయత్నాలూ జరుగుతున్నాయట విమానయాన శాఖ వైపు నుంచి.