ఒక్క సాకర్ ప్రపంచకప్ సాధనతోనో అర్జెంటీనన్ సాకర్ స్టార్ మెస్సీని ప్రపంచం ఎంతగా ఆరాధిస్తోందో .. ఎవరికీ ప్రత్యేకంగా విశదీకరించనక్కర్లేదు. ఇటీవలే సాకర్ ప్రపంచకప్ జరిగింది ఖతార్ లో. ఫైనల్లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం సాధించి విజేతగా నిలిచింది. టీమ్ గేమే అయినా సాకర్ లో స్టార్ స్టేటస్ లోని ఆటగాళ్లను అభిమానులు అమితంగా అభిమానిస్తారు. ఒక గోల్ సాధనలో కూడా ఒకరికి మించి ఆటగాళ్ల ఇన్ వాల్వ్ మెంట్ ఉంటుంది. ఒంటిచేత్తో గెలిపించడానికి, గెలవడానికి సాకర్ ఏమీ టెన్నిస్ సింగిల్ మ్యాచ్ కాదు. అయినప్పటికీ ఫుట్ బాల్ లో స్టార్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ల నీడన మరొకరి పేరు కూడా వినపడనంతా అక్కడ స్టార్ల ప్రభావం ఉంటుంది.
ఇండియన్స్ విషయానికే వస్తే.. భారతీయులుకు తెలిస్తే గిలిస్తే స్టార్ సాకర్ ప్లేయర్ల పేర్లు తెలుస్తాయి తప్ప, మరొకరి పేరు కూడా తెలియని సాకర్ అభిమానులు ఎంతో మంది ఉంటారు. ఇటీవల సాకర్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన అర్జెంటీనా టీమ్ లో మెస్సీ పేరు తప్ప మరొకరి పేరు తెలియని భారతీయ సాకర్ ప్రియులు ఎంతోమంది ఉంటారు. అలాగే పోర్చుగల్ టీమ్ లో క్రిస్టియానో రొనాల్డో పేరుకు మించి మరెవరూ తెలియని వారూ ఉంటారు! కేవలం సాకర్ గురించి పెద్దగా తెలియని భారతీయుల విషయంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా సాకర్ లో స్టార్లు మర్రిచెట్లలాంటి వాళ్లే. వీరి నీడన మరొకరి పేరు కూడా వినపడదు.
మరి ఇలాంటి స్టార్లలో కూడా పీలే, మారడోనాలు మరింత ప్రత్యేకం. దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయినా వీరి ప్రత్యేకమే. కొత్త స్టార్లు వచ్చినా, మరెన్నో విన్యాసాలు సాగినా.. పీలే, మారడోనా వంటి పేర్లు ప్రపంచం మరిచిపోనివే. ఇలాంటి సాకర్ ధిగ్గజమైన పీలే నిష్క్రమించారు. 82 యేళ్ల వయసులో పీలే మరణించారు. ఎప్పుడో సాకర్ ఫీల్డ్ నుంచి రిటైర్డ్ అయినా పీలే పేరుకు మాత్రం ఆటతో అనుబంధం కొనసాగింది. తన కెరీర్ లో బ్రెజిల్ కు వరసగా మూడు సార్లు ప్రపంచకప్ ను సాధించి పెట్టిన ఘనత ఈ ఆటగాడిది.
సాకర్ లో ఒక్కసారి ప్రపంచకప్ గెలవడమే ఏ స్టార్ కు అయినా జీవితేచ్ఛ! అలాంటిది మూడు సార్లు తన జట్టును ప్రపంచకప్ విజేతగా నిలపడం అంటే.. అదెంత గొప్పదనమో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా తమ జట్టును విజేతగా నిలపకుండానే అంతర్జాతీయ ఆట నుంచి నిష్క్రమించిన వారున్నారు. క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్ హమ్ వంటి వారు ఇందుకు చెప్పుకోదగిన ఉదాహరణలు. వారే ధిగ్గజాలు అయినప్పుడు సాకర్ బాల్ తో మ్యాజిక్ చేసిన పీలే అభిమానుల మదిని మరెంత రంజింపజేసి ఉండాలి!
ధిగ్గజ ఆటగాళ్లు కేవలం తాము మాత్రమే మ్యాజిక్ చేయరు. తమ మ్యాజిక్ తో మరెంతో మందికి స్ఫూర్తిని ఇస్తారు. మరెంతో మంది కొత్త తరం ఆటగాళ్లు తయారు కావాలనికి పరోక్షంగానే ఊతం ఇస్తారు. పీలే స్ఫూర్తితో ఎంతోమంది సాకర్ రణరంగంలోకి దిగి ఉంటారు బ్రెజిల్ లో. వారిలో స్టార్లు అయిన వారు, తమ జట్టును విజేతగా నిలిపిన వారూ ఉన్నారు.
ఇక పీలే కొన్నేళ్ల కిందట భారత్ లో కూడా పర్యటించారు. ఆ సమయంలో భారత ఫుట్ బాల్ ప్రియులు పీలే పట్ల అపూర్వ ఆదరణను చూపించారు. ఆట గురించి అంతగా తెలియని దేశంలోనే పీలేకు అపూర్వస్వాగతం లభించింది.