పోలీసులు, సైన్యాన్ని లెక్క చేయకుండా వేల మంది శ్రీలంకలో రోడ్డు మీదకి వచ్చారంటే దాని వెనుక చాలా కడుపు మంట వుంది.
6నెలల నుంచి శ్రీలంక ప్రభుత్వానికి ఫారిన్ ఎక్స్ఛేంజ్ కొరత ఏర్పడింది. ఫలితంగా ఆయిల్ కంపెనీలకి చెల్లింపుల సమస్య. ఆయిల్, గ్యాస్ తగ్గిపోయాయి. అంటే లీటర్ పెట్రోల్ కోసం గంటలకొద్దీ క్యూలో ఉండాల్సిన స్థితి. ఈ సంక్షోభానికి అదనంగా కరెంట్ కష్టాలొచ్చాయి. 13 గంటలు పవర్‌కట్.
మార్చి నెల నాటికి పరిస్థితి ఏమంటే వండుకుందామంటే గ్యాస్ లేదు. కరెంట్ స్టౌలు వాడుదామంటే పవర్ లేదు. పోనీ పవర్ వున్నప్పుడు రెండుమూడు రోజులకి సరిపడా వండుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుందామంటే పవర్ సమస్యతో కూలింగ్ లేక చెడిపోతున్నాయి. వ్యవసాయాన్ని మొత్తంగా ఆర్గానిక్‌కి షిప్ట్ చేయడం వల్ల ఆల్రెడీ తిండి గింజలు ఖరీదుగా మారాయి. చచ్చీ చెడి కొంటే వండుకునే స్థితి లేకపోవడంతో ఆడవాళ్లలో కోపం, అసహనం, కుటుంబాల్లో అశాంతి.
పవర్ కట్‌తో చిన్న వ్యాపారస్తులు కష్టాల్లో పడ్డారు. శ్రీలంకలో టీ, కాఫీలు ఎక్కువ. శాండ్‌విచ్, పఫ్‌లు తినే అలవాటు. పవర్ లేకపోవడంతో ఓవెన్‌లో వేడి చేసి ఇవ్వలేని పరిస్థితి. డిమాండ్ తగ్గింది. బేకరీలు నష్టాల్లోకి వెళ్లాయి.
లంకలో చేపలు ప్రధాన ఆహారం. మత్స్యకారుల పడవలకి ఆయిల్ లేక సముద్రంలోకి వెళ్లలేరు. ఒకవేళ ఆయిల్ బ్లాక్‌లో కొన్ని చేపలు పడితే రవాణా వాహనాలు లేవు. దూర ప్రాంతాలకి మార్కెట్ చేయాలంటే రిఫ్రిజిరేటెడ్ ఐస్ వాహనాలు ఆయిల్ కొరతతో దొరకడం లేదు. అంటే వేటకి వెళ్లలేరు. వెళ్లినా చేపలు అమ్ముకోలేరు. సొంతంగా చేపల ధరలు మూడింతలు పెరిగాయి. చికెన్, గుడ్లు ఇదే. రవాణా వాహనాలు లేక కోళ్ల పెంపకం ఆగిపోయింది.
బిల్డింగ్ మెటీరియల్‌ని దిగుమతి చేసుకుంటే పోర్టు నుంచి తీసుకెళ్లడానికి ట్రక్కులు లేవు. పోర్టులో సరుకు ఆగిపోతే రోజుకింత అని అద్దె కట్టాలి. కన్‌స్ట్రక్షన్ మందగించింది. కార్మికులకి పని లేకుండా పోయింది.
ఇది కాకుండా పవర్‌కట్ వల్ల చాలా ఉద్యోగాలు పోయాయి. దూర ప్రాంతాల నుంచి కొలంబోకి వెళ్లి ఉద్యోగాలు చేసేవారు పెట్రోల్ సమస్యతో సకాలానికి ఉద్యోగాలకి వెళ్లలేని స్థితి.
ప్రతి ఒక్కరిలో అసహనం, అశాంతి. ఇదిలా వుంటే తినింది అరక్క కొంత మంది ట్వీట్స్ చేస్తూ వుంటారు. ప్రధాని మహింద కొడుకు నామల్ రాజపక్స అనే బుద్ధిహీనుడు “చిన్నచిన్న అసౌకర్యాలను ప్రజలు భరించాలి” అని మార్చి 30వ తేదీ ట్వీట్ చేశాడు. జనానాకి భగ్గుమంది తమ అధ్వాన్న బతుకు చిన్న అసౌకర్యంగా కనిపిస్తూ వుందా అని ట్రోలింగ్ చేశారు.
ప్రధాని కొడుకు అక్కడితో ఆగకుండా “నేనూ పవర్‌కట్ బాధితున్నే” అని ట్వీట్ చేశాడు. దాంతో ఎవడో తెలివైన వాడు వీఐపీల ఇళ్లకి అసలు పవర్ కట్ లేదు అనే విషయాన్ని బయట పెట్టాడు. కడుపు మండిన జనం నేరుగా ప్రెసిడెంట్‌తోనే తేల్చుకుందాం పదా అని మార్చి 31న గొటబాయ్ నివాసానికే బయల్దేరారు. ఇక ఆగలేదు.
ఈ రోజు సంక్షోభానికి మూలాలు ఎక్కడో వున్నాయి. పేదవాళ్లు అప్పులు చేసి తమకున్న ఎకరా రెండెకరాల భూమిని ఎట్లా పోగొట్టుకుంటారో , అదే సూత్రం దేశానికి కూడా వర్తిస్తుంది. అప్పు చేయడం మొదటి తప్పు, ఆ తర్వాత అనేక తప్పులు అదే చేయిస్తుంది. పేద దేశాలు అప్పులు చేయకుండా ఉండలేవు. వాళ్లకి అప్పులు ఇవ్వడానికే ప్రపంచ బ్యాంక్ , IMF వున్నాయి. వీళ్లతో అప్పు చేస్తే వాళ్ల షరతులకు లోబడి వుండాలి. కరెక్ట్‌గా వడ్డీ కడుతూ వుండాలి. లేదంటే కొత్త అప్పులు పుట్టవు.
శ్రీలంక ఇప్పటికే రికార్డు స్థాయిలో 16 సార్లు IMF నుంచి అప్పు తీసుకుంది. వడ్డీలు కట్టడానికి చైనాతో కొత్త అప్పులు చేసి , వాళ్ల వ్యాపారానికి గేట్లు తెరిచింది. ప్రతి దానికి ఒక బాయిలింగ్ పాయింట్ వుంటుంది. అది రానే వచ్చింది కరోనా రూపంలో.
శ్రీలంకకి దిగుమతుల భారం దాదాపు 23 బిలియన్ల డాలర్లు. ఎగుమతుల ఆదాయం దాదాపు 15 బిలియన్స్. మిగిలిన దాన్ని టూరిజం ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న శ్రీలంక వాసులు పంపుతున్న డబ్బు ద్వారా సర్దుబాటు చేసుకుంటూ గండం గట్టెక్కేది.
2019లో ఈస్టర్ బాంబు పేలుళ్లు మొదటి దెబ్బ. టూరిజం తగ్గిపోయింది. తర్వాత కరోనా. దాంతో ఆదాయం తగ్గడమే కాకుండా ప్రజారోగ్యంపై ఖర్చు పెరిగింది. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది.
రాజపక్స మొన్నటి వరకు బ్రాండ్ నేమ్. మంత్రివర్గంలోనే ఏడుగురు రాజపక్సాలు వున్నారు. మొత్తం ప్రభుత్వమే వాళ్ల బంధువులతో నిండిపోయింది. ఇప్పుడు ఆ పేరు చెబితే జనం తరుముతున్నారు.
ప్రభుత్వం మారినా అక్కడ అద్భుతాలేం జరగవు. నెత్తి మీదున్న అప్పు మారదు కదా!
జీఆర్ మహర్షి