పొరుగు దేశం పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. గత ఏడాది కనివినీ ఎరగని వరదలతో పాకిస్తాన్ ఇక్కట్లు పతాక స్థాయికి చేరాయి. రాజకీయ అనిశ్చితి, సైన్యం ప్రమేయం, సామాన్యుడి బతుకు దుర్భరం ఆవడం ఇవన్నీ పాక్ కు చాలా పాత సమస్యలే అయినా, మూలికే నక్కపై తాటి పండు పడ్డట్టుగా గత ఏడాది వరదలు పాక్ లో ఆహార సంక్షోభానికి కూడా కారణం అయ్యాయి. గోధుమల కోసం ప్రజలు రోడ్ల మీదే పరస్పరం తలపడే పరిస్థితులు దాపురించాయి పాక్ లో. ఆ ఆక్రంధనలు క్రమంగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్టుగా ఉన్నాయి. అయితే పాక్ ప్రభుత్వానికి మాత్రం తేలికగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు.
ముందు ముందు పాక్ ప్రభుత్వ కష్టాలు పెరిగేట్టుగా ఉన్నాయి తప్ప.. దగ్గరిలో సానుకూల పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రభుత్వాధి నేతలు అధికారం చేతిలో ఉన్నంత సేపూ అక్కడ ఉండి, అధికారం చేజారగానే.. మరో దేశాన్ని చూసుకుని పలాయనం చిత్తగించేంత దారుణ మైన రాజకీయ వ్యవస్థ పాక్ ను దశాబ్దాలుగా ఏలుతోంది. కేవలం పాలకులు అనే కాదు.. కాస్త డబ్బున్న వారెవరూ పాక్ లో ఉండటం లేదు. ఆస్తులు తెగనమ్ముకుని అయినా.. ఇంగ్లండ్ కో, గల్ఫ్ దేశాలకో చేరుకోవడం పాక్ లో పాత సంప్రదాయమే!
పాక్ మాజీ క్రికెటర్లు కూడా చాలా మంది పాక్ లో ఉండరు. ఛలో లండన్ అని, బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందిన వారూ ఉన్నారు. మరి కొందరు దుబాయ్ లో సెటిలయిపోతే చాలనుకుంటూ ఉంటారు. ఇలా పాక్ నుంచి బయటపడటం వరంగా భావించే పరిస్థితి.
ఇదే అనుకుంటే.. ఇంకో వైపు నుంచి పాక్ పై తాలిబన్ల పట్టు పెరుగుతూ ఉంది. తెహ్రిక్ ఇ తాలిబన్ ఆగడాలు పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ తాలిబన్ పాక్ శాఖ తను అనుకున్న చోట దాడులు చేయగలుగుతూ ఉంది. అన్నీ ఆత్మాహుతి దాడులే. కరాచీలో తాజాగా తాలిబన్ల ఆత్మాహుతి దాడితో ఉనికి చాటుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తాలిబన్ ముఠా చెలరేగుతూ ఉంది.
ఇదంతా చూస్తుంటే.. పాకిస్తాన్ పై తాలిబన్ల ముఠా పట్టు సాధించేందుకు పెద్ద సమయం పట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంతర్గత సంక్షోభాల నేపథ్యంలో పాక్ పై పట్టు పెంచుకోవడానికి తాలిబన్లకు కూడా అవకాశాలు పెరగవచ్చు!
ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, మతవాదాన్ని నిరసించే బంగ్లాదేశీ రచయిత్రి తస్లిమా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఐసిస్ వరకూ అక్కర్లేదని, తాలిబన్లే పాక్ ను పూర్తిగా క్రమించే రోజు మరెంతో దూరంలో లేకపోవచ్చంటూ తస్లిమా అభిప్రాయపడ్డారు. పాక్ లో అయితే పరిస్థితులు కల్లోలానికి అంచునే ఉన్నట్టున్నాయి!