బైక్ పై వెళ్లే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం సర్వసాధారణం. అయితే ఇకపై ఇలా మాట్లాడితే నేరం. బైక్ డ్రైవ్ చేస్తూ, వెనక కూర్చున్న వ్యక్తి (పిలియన్ ప్యాసింజర్)తో మాట్లాడితే ఫైన్ పడుతుంది. ఈ కొత్త నిబంధన కేరళలో పుట్టుకొచ్చింది.
రహదారి భద్రతను మరింత పెంచే ఉద్దేశంతో, కేరళ మోటారు వెహికల్ డిపార్ట్ మెంట్ ఈ కొత్త రూలు తీసుకొచ్చింది. బైక్ పై తోటి ప్రయాణికుడితో మాట్లాడుతూ, పరధ్యానంలో రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్న వాళ్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై అలా బైక్ వెనక ఉన్న వ్యక్తితో మాటలు కలిపే డ్రైవర్ కు జరిమానా విధించాల్సిందిగా రవాణా మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని అన్ని ఆర్టీవో కార్యాలయాలకు సర్కులర్ పంపించింది. అయితే ఇలా దొరికే డ్రైవర్ కు ఎంత పెనాల్టీ విధిస్తారనే విషయం ఇంకా బయటకురాలేదు.
వెనక కూర్చున్న ప్రయాణికుడితో మాట్లాడేందుకు డ్రైవర్ తరచుగా తన తలను పక్కకు తిప్పుతాడు. అదే టైమ్ లో గట్టిగా మాట్లాడతాడు. దీనివల్ల అతడు డ్రైవింగ్ పై ఏకాగ్రత కోల్పోతున్నాడని రవాణా శాఖ అభిప్రాయపడింది. హైవేలపై అధిక వేగంతో వెళ్తున్నప్పుడు, భారీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇలాంటి చర్యల వల్ల ప్రమాదాల సంభావ్యత పెరుగుతోందని తెలిపింది. ఇకపై కేరళలో బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి తన ఫోకస్ మొత్తాన్ని డ్రైవింగ్ పై మాత్రమే పెట్టాలి.