సింపుల్ గా చెప్పాలంటే 2014 నాటికి లీటర్ పెట్రోల్ ధర అరవై ఐదు రూపాయల స్థాయిలో ఉంటే, అది ఇప్పుడు 120 రూపాయల ధరకు చేరింది. ఇది మోడీ దేశ ప్రధాని అయ్యాకా సాధించిన ప్రగతి. అంతర్జాతీయంగా 2014తో పోలిస్తే గత ఎనిమిదేళ్లలో చాలా సార్లు పెట్రో ధరలు తగ్గిపోయాయి. ముడి చమురు ధర 2014 కన్నా చాలా తక్కువ స్థాయికి పడిపోయిన సందర్భాల్లో కూడా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ రోజూ కాస్త ఊరటను ఇవ్వలేదు. రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను బాదుతూ.. అందులో కొంతలో కొంత ఊరటను ఇచ్చింది. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర సుంకాలను కాస్తంటే కాస్త తగ్గించింది. దీని ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర ఆరేడు రూపాయల వరకూ తగ్గినట్టుగా ఉంది.
మరి దీనికి కొండంత దీర్ఘం తీస్తున్నారు కమలనాథులు. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాల సుంకాలను కూడా తగ్గించుకోవాలని ఉచిత సలహా ఒకటి కేంద్రం పడేసింది. ఈ అంశంపై తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి స్పందించిన తీరు ఆసక్తిదాయకంగా ఉంది.
గత ఎనిమిదేళ్లలో పెట్రో ధరలపై పెరిగింది కేంద్ర సుంకాలే తప్ప, రాష్ట్ర సుంకాలు కాదని తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి త్యాగరాజన్ కేంద్రానికి గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రో ఉత్పత్తులపై కేంద్రం పొందే సుంకాలే భారీగా పెరుగుతూ పోయాయి. అందులో ఇప్పుడు కొంత మేర , అది కూడా స్వల్పంగా తగ్గించారు.
పెట్రోల్ ధరలపై రాష్ట్రాలేమీ పన్నులను పెంచలేదు. అవి గతంలో ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలానే ఉన్నాయి. పెంచుకుంటూ పోతోంది కేంద్రం. అందులో కాస్తంతే కాస్త ఉపశమనం ఇచ్చి.. ఇప్పుడు రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలంటూ కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కడం ఏమిటంటూ తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి ప్రశ్నించారు.