వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనం మధ్యకు వెళ్తుంటే నిలదీతలు ఎదురవుతున్నాయని, ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల మధ్యకు వెళ్తుంటే, స్థానికులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ నిలదీస్తున్నారని తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా చెబుతూ ఉన్నాయి.
అందుకు సంబంధించి వీరు బాగా ఉత్సాహంతో స్పందిస్తున్నారు. ఫలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను ప్రజలు నిలదీశారని, సమస్యలను ప్రస్తావించారని తెలుగుదేశం అనుకూల మీడియా ఒక రేంజ్ లో ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని తెలుగుదేశం నేతలు అందుకుంటూ ఉన్నారు.
జనాలు ప్రభుత్వాన్ని నిలదీయడం అంటే.. అది మంచి ప్రజాస్వామిక లక్షణం. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్లడం స్వాగతించాల్సిన అంశం. ఇదే సమయంలో వారిని ప్రజలు నిలదీయడం కూడా సరైన చర్యే! అన్నింటికీ మించి ప్రజలకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చే ప్రభుత్వమే సరైన దిశలో ఉన్నట్టు! ఇలా కాకుండా.. ప్రజల మధ్యకు వెళ్లకుండా, వారి నిలదీతలకు భయపడో, వారి నిలదీతలను తిప్పి కొడితేనో.. అది తప్పు అవుతుంది.
మీ తోకలు కత్తిరిస్తా, మిమ్మల్ని ఫినిష్ చేస్తా.. అంటూ గతంలో తమకు ఎదురైన చిన్న పాటి నిలదీతలకు సమాధానం ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తమకు కనీస వేతనాలేవో పెంచాలని క్షురకులు కోరితే.. వారి తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు నాయుడు నోరు పారేసుకున్నారు.
ఎక్కడో ఒక యాత్రలో ఒక మహిళ నిలదీస్తే.. నిన్ను ఫినిష్ చేస్తా అంటూ చంద్రబాబు నాయుడు రంకెలేశారు! ఇలా ఒకటి కాదు.. తను చెప్పిందే వినాలి తప్పి, ఎవ్వరూ ఏదీ చెప్పుకోకూడదన్నట్టుగా చంద్రబాబు నాయుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనం మధ్యకు వెళ్తుంటే, స్థానికులు తమ సమస్యల విషయంలో నిలదీస్తున్నారు. ఇవేమీ విధానపరమైన అంశాలపై కాదు. స్థానిక సమస్యల గురించి. వాటి పరిష్కారం గురించి. వాటిని పరిష్కరించాలి. అది ప్రభుత్వంలోని వారి బాధ్యత.
నిలదీసే అవకాశం రావడం ప్రజలకు మేలు చేస్తుంది. అలాంటి నిలదీతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలేమీ విరుచుకుపడటం లేదు చంద్రబాబులా! ఈ వ్యవహారంలో పచ్చ బ్యాచ్ మరీ చంకలు గుద్దుకోవడం విడ్డూరమైన అంశం.