కేంద్ర ప్రభుత్వం పెట్రో సుంకాలను కాస్త తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోల్ పై ఏడెనిమిది రూపాయల వరకూ, డీజిల్ పై లీటర్ కు తొమ్మిది రూపాయల వరకూ తగ్గే అవకాశం ఉంది.
ఈ అంశంపై బీజేపీ నేతల ప్రకటనలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక ఇది తనకు కూడా అదును అన్నట్టుగా బీజేపీ మిత్రుడైన పవన్ కల్యాణ్ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, దీని వల్ల నిత్యవసర ధరలు కూడా తగ్గిపోతాయంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు!
ఆహా.. ఎంత గొప్ప అంశం! పెట్రో భారాన్ని కొండంతకు పెంచి, ఇప్పుడు అందులో గోరంత తగ్గించింది మోడీ సర్కారు. దీంతో.. నిత్యవసర వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయంటూ పవన్ కల్యాణుడు చెప్పుకొచ్చారు!
మరి లీటర్ డీజిల్ పై 9 రూపాయల ధరను తగ్గించగానే నిత్యవసర వస్తువుల ధరలన్నీ అదుపులోకి వచ్చేస్తే… మరి ఇదే డీజిల్ ధరపై పదుల రూపాయల ధరను పెంచినప్పుడు నిత్యవసర వస్తువుల ధరలు గుర్తుకు రాలేదా!
మోడీ దేశం పగ్గాలు చేపట్టేనాటికి లీటర్ పెట్రోల్ ధర అరవై ఐదు రూపాయల స్థాయిలో ఉండేది. మొన్నటి వరకూ అది 120 రూపాయల స్థాయిలో నిలిచింది. ఇప్పుడు 110 కి తగ్గింది. అంటే మోడీ వచ్చిన దగ్గర నుంచి లీటర్ కు యాభై ఐదు రూపాయల ధరను పెంచి, ఇప్పుడు అందులో పది తగ్గించారు. నలభై ఐదు రూపాయల స్థాయిలో పెంపు ఉన్నట్టు!
అందులోనూ.. ఇప్పుడు తగ్గించిన ఏడెనిమిది రూపాయల ధర కూడా గత ఐదారు నెలల్లో పెరిగింది మాత్రమే! ఆరు నెలల కిందట లీటర్ పెట్రోల్ ధర 110 స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చిందంతే. యూపీ ఎన్నికల కోసం పెట్రోల్ ధరలను పెంచడాన్ని కొన్ని రోజుల పాటు ఆపారు. యూపీ ఎన్నికలు అయ్యాకా కూడా.. రెండు మూడు రూపాయలు పెంచారు.
ఏడెనిమిది రూపాయల ధరను తగ్గించగానే.. పండగ చేసుకోవచ్చన్నట్టుగా స్పందించారు పవన్ కల్యాణ్. మరి యాభై ఐదు రూపాయల మేరకు ధర పెరిగిన వైనం గురించి చర్చ జరిగినప్పుడు పవన్ కు నిత్యవసర వస్తువుల ధరలు గుర్తుకురాలేదేమో పాపం!