మరో 50 విమానాలు.. అసలేం జరుగుతోంది?

ప్రతి రోజూ విమానాలకు బాంబ్ బెదిరింపులు కామన్ అయిపోయాయి. ఎప్పటికప్పుడు అధికారులు విచారణ చేసి, కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ ఈ బాంబ్ బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈరోజు ఏకంగా 50 విమానాలకు బాంబు…

ప్రతి రోజూ విమానాలకు బాంబ్ బెదిరింపులు కామన్ అయిపోయాయి. ఎప్పటికప్పుడు అధికారులు విచారణ చేసి, కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ ఈ బాంబ్ బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈరోజు ఏకంగా 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

రకరకాల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు అగంతకులు. ఈరోజు తమకు చెందిన 10 విమానాలకు బెదిరింపులొచ్చాయని ఇండిగో ప్రకటించింది. బాంబు పెట్టామంటూ బెదిరించిన అన్ని విమానాల్ని దారి మళ్లించామని, పూర్తిస్థాయిలో చెక్ చేసిన తర్వాత తిరిగి ప్రయాణం ప్రారంభించామని ఇండిగో ప్రకటించింది.

అటు ఎయిర్ ఇండియాకు చెందిన 10 విమానాలకు కూడా బాంబు బెదిరింపులొచ్చాయి. నిన్న ఈరోజు కలిపి 30 ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులొచ్చాయి. ఈ విమానాలన్నీ గంటల తరబడి ఆలస్యమయ్యాయి. తాజా హెచ్చరికలతో కలుపుకొని, ఈ వారం రోజుల్లో 120 విమానాలకు బాంబు బెదిరింపులొచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

ఇండిగో, ఎయిర్ ఇండియాతో పాటు దాదాపు అన్ని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికితోడు ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కొద్దంటూ ఓ ఖలీస్థానీ ఉగ్రవాది హెచ్చరికలు జారీ చేయడంతో.. అసలు విమానం ఎక్కాలంటేనే వణికిపోతున్నారు ప్రయాణికులు.

ఒక బాంబు బెదిరింపు ఖరీదు రూ.3 కోట్లు

ఇప్పటికే అరకొర లాభాలతో కొన్ని, నష్టాలతో మరికొన్ని విమానయాన సంస్థలు నడుస్తున్నాయి. తాజా బాంబు బెదిరింపులు ఈ సంస్థలకు మరింత నష్టాల్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ నష్టాలు ఎలా వస్తాయో ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం..

147 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైమ్ లో విమానం బరువును అమాంతం తగ్గించాల్సి ఉంటుంది. దీని కోసం విమానంలో ఉన్న వంద టన్నుల ఇంధనాన్ని బయటకు వదిలేశారు. దీని ధర దాదాపు కోటి రూపాయలు. అంటే కోటి రూపాయల ఇంధనం వృధా అయినట్టే.

దీంతో పాటు ప్రయాణికుల వసతి, సిబ్బంది మార్పు, గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కలిపి 3 కోట్ల రూపాయలు అయింది. ఈ డబ్బుతో పాటు ఎన్నో గంటల సమయం వృధా. ఒక విమానానికే ఇంత నష్టమంటే.. ఈ 3 రోజుల్లో ఎన్ని విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి, ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసుకోవచ్చు. ఈ అదనపు ఖర్చులే, విమానయాన సంస్థలకు ఆర్థిక సంవత్సరం చివర్లో నష్టాలుగా మిగులుతాయి.

9 Replies to “మరో 50 విమానాలు.. అసలేం జరుగుతోంది?”

  1. దీనికి పరిష్కారం – ప్రతీ విమానం బయలుదేరే ముందు బాంబ్ స్కాడ్ తో తనిఖీ చేయిస్తే ఇటువంటి calls ని పట్టించుకోనక్కరలేదు.

  2. పాకిస్తాన్ సపోర్ట్ తో ,కెనడా లో ఖలిస్తాన్ వాళ్ళు చేస్తున్న అరాచకం ఇది.

    ఇక్కడ ఆప్ పార్టీ వాళ్ళకి సపోర్ట్.

Comments are closed.