మోడీ ఎజెండా అని కొందరంటారు! ఆరెస్సెస్ ఎజెండా అని కొందరంటారు! మొత్తానికి ‘హిందూత్వ ఎజెండా’ అనే మాట ద్వారా మన దేశంలో విస్తృతమైన విషప్రచారం నడుస్తూ ఉంటుంది. ముస్లిం మతానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా దుష్టులు దుర్మార్గులు లాగా ప్రచారం చేసే వ్యూహం అది.
ముస్లింలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ.. తద్వారా.. వారి పట్ల హిందూ సమాజంలో భయాన్ని, అసహ్యాన్ని పెంచాలనే కుట్ర అది. ముందు ముస్లిం మతస్తుల పట్ల మిగిలిన సమాజంలో ఒక భయాన్ని పెంచగలిగితే.. ఆ తర్వాత, సదరు ముస్లిములను కంట్రోల్ చేయగలిగేది ఒక్క బిజెపి మాత్రమే అనే మాటప్రచారం చేసుకుంటూ భయపడే వారి ఓట్లను గంపగుత్తగా ఎప్పటికీ దక్కించుకుంటూ ఉండవచ్చుననేది ఒక వర్గం వారి ఆలోచన.
బిజెపి అనుకూలంగా పనిచేసే వారు కూడా ఇలాంటి భావాలనే వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నిత్యం సోషల్ మీడియాలో, వాట్సప్/ఫేస్ బుక్ గ్రూపుల్లో ఇలాంటి చండాలాల్ని మనం అనేకం చూస్తూ ఉంటాం.
ఇక వర్తమానంలోకి వస్తే.. అమెరికా అధ్యక్షుడుగా పోటీచేయాలని అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కూడా అచ్చంగా ఈ హిందూత్వ మార్గాన్నే అనుసరించాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ముస్లిం వ్యతిరేక భావాలను ప్రచారం చేసుకోవడం ద్వారా.. దేశంలోని ప్రజల ఓట్లను గంపగుత్తగా పొందడం సాధ్యం అవుతుందని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి అమెరికాకు పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ యూదు కూటమి సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇరాక్, సూడాన్ వంటి దేశాలకు చెందిన మామూలు ప్రజలు కూడా అమెరికాలో అడుగు పెట్టకుండా ట్రప్ తన పదవీకాలంలో ఆంక్షలు విధించారు. బైడెన్ వచ్చాక వాటిని ఎత్తివేశారు. అందుకే ఆయన .. ప్రయాణ నిషేధం మీకు గుర్తుందా? నేను రెండోసారి అధ్యక్షుడైన తొలిరోజే.. ఆ నిషేధాన్ని పునరుద్ధరిస్తా. మనదేశంలో బాంబుపేలుళ్లు ఇష్టపడేవాళ్లు మనదేశంలో అడుగుపెట్టవద్దు అని ట్రంప్ అంటున్నారు.
ముస్లిం మతానికి చెందిన వారు అంటేనే మొత్తం అందరినీ కూడా ఉగ్రవాదులుగా ప్రొజెక్ట్ చేయడానికి చూస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటన ఉంది. అచ్చంగా ఇలాంటి ప్రయత్నమే భారతదేశంలో కూడా జరుగుతోంది. హిందూత్వ ఎజెండాతో ప్రచారం బలంగా జరుగుతోంది. కానీ.. మోడీ సక్సెస్ సాధిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత లేదు. మళ్లీ మళ్లీ గెలుస్తున్నారు.
ఈ మోడీ వ్యవహార సరళి ట్రంప్ కు స్ఫూర్తి ఇచ్చిందేమో తెలియదు గానీ.. ఆయన అమెరికాలో కూడా ముస్లిం వ్యతిరేకతను విష బీజాల్లాగా ప్రజల హృదయాల్లో నాటి గెలవాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.