భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏడాది సగటు జీతాల్లో అత్యథికం ఎంత అనే అంశంపై ఆసక్తికర సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆసక్తికర విశేషాలు బయటపడ్డాయి. ఇండియాలో అత్యథిక ఏడాది సగటు జీతం రూ.18,91,085. భారతీయ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఉద్యోగులు సంపాదిస్తున్న సగటు వేతనం మాత్రం రూ.5,76,851.
ఆర్జన విషయంలో లింగబేధం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది శాలరీ సగటులో పురుషుడు 19,53,055 రూపాయలు కాగా, మహిళ ఏడాది సగటు జీతం రూ. 15,16,296.
138 దేశాల నుంచి సగటు వేతనాన్ని గణించారు. భారత్ లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 11,570 వేతల జీవుల జీతాల ఆధారంగా ఈ సర్వే ఫలితాల్ని వెల్లడించారు.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అంతా అనుకుంటున్నట్టు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఎక్కువ జీతాల్లేవు. ఇండియాలో మేనేజ్ మెంట్ అండ్ బిజినెస్ రంగాల్లో మాత్రమే అత్యథికంగా వేతనాలున్నాయి. ఈ రంగాల్లో సగటు ఏడాది సంపాదన అక్షరాలా 29,50,185 రూపాయలు. ఈ రెండు రంగాల తర్వాత న్యాయ విభాగంలో అత్యథికంగా సంపాదిస్తున్న వాళ్లు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ లో పనిచేస్తున్న వాళ్ల సగటు వార్షిక వేతనం రూ.27,02,962.
వ్యక్తిగత జీతాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్స్ పీరియన్స్ ఉన్న ఉద్యోగులు ఎక్కువ శాలరీలు పొందుతున్నారు. వీళ్లు కూడా మేనేజ్ మెంట్, బిజినెస్ రంగాల్లో ఉన్న వాళ్లే. 20 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగి ఏడాదికి సగటున రూ.38,15,462 సంపాదిస్తున్నాడు.
వేతనాల విషయంలో చదువు కూడా కీలక పాత్ర పోషిస్తోంది. డిగ్రీలు కంటే పీజీలు చేసిన వాళ్లు ఎక్కువ జీతాలు పొందుతున్నారు. పీజీల్లో స్పెషలైజేషన్ చేసినవాళ్లకు ఇంకాస్త ఎక్కువ జీతం లభిస్తోంది.
నగరాల పరంగా సగటు వార్షిక వేతనం చూసుకుంటే.. ఆశ్చర్యకరంగా షోలాపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ కేవలం ఇద్దరు ఉద్యోగుల వేతనాన్ని మాత్రమే లెక్కించారు. కాకపోతే వీళ్లలో ఒకరు అత్యథిక ప్యాకేజీతో ఉన్నారు. అందుకే షోలాపూర్ టాప్ లో నిలిచింది. ముంబయి తర్వాత స్థానంలో నిలిచింది.
సౌత్ లో చూసుకుంటే.. రూ.21,01,388 సగటు వార్షిక వేతనంతో బెంగళూరు టాప్ లో నిలవగా.. 18,62,407 రూపాయల సగటు వార్షిక వేతనంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.