ఓ యువకుడు తనను కిడ్నాప్ చేశాడని, ఓ అమ్మాయి కేసు పెట్టింది. 2 రోజుల పాటు తనను అత్యాచారం చేశాడని ఆరోపించింది. సహజంగా ఇలాంటి ఆరోపణలు నిజమని నమ్మేస్తాం. కానీ అబ్బాయి మాత్రం తను, సదరు అమ్మాయిని రేప్ చేయలేదని వాదించాడు. ఈ వాదనను ఎవ్వరూ నమ్మలేదు. కానీ షాకింగ్ నిజం బయటపడింది. అమ్మాయి చెప్పింది అబద్ధమని తేలింది.
రాజస్థాన్ లోని సిరోహి పోలీస్ స్టేషన్ పరిథిలో శంకర్ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. ఆటోలో తీసుకెళ్లి 2 రోజుల పాటు నిర్బంధించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు విడిపించారు. శంకర్ పై కిడ్నాప్ తో పాటు అత్యాచారం కేసు పెట్టారు. అయితే శంకర్ మాత్రం తను రేప్ చేయలేదని వాదించాడు.
నిజాన్ని నిర్థారించేందుకు పరీక్షలు నిర్వహించారు పోలీసులు. వచ్చిన ఫలితం చూసి ఆశ్చర్యపోయారు. అవును.. శంకర్ నిజానికి మగాడు కాదు, ఓ మహిళ.
భర్త చనిపోయిన తర్వాత ఈ సమాజం నుంచి తననుతాను కాపాడుకునేందుకు ఇలా పురుషుడి వేషంలోకి మారి, శంకర్ అనే పేరు పెట్టుకుంది. జీవనోపాధి కోసం పెళ్లిళ్లలో టేబుల్స్ వేయడం, క్యాటరింగ్ చేయడం, లైట్లు పట్టుకోవడం లాంటి పనులు చేస్తుందీమే. అంతేకాదు, ఈమెకు మూడేళ్ల ఓ పాప కూడా ఉంది.
ఇలా పొట్టుకూటి కోసం పురుషుడిగా మారి చిన్నచిన్న పనులు చేసుకుంటున్న ఈమె, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆమెపై పెట్టిన అత్యాచారం సెక్షన్లను తొలిగించి, కేవలం కిడ్నాప్ కేసు నమోదు చేశారు.