ప్రజాకోర్టులో రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ దోషిగా నిలబడ్డాడు. నిమ్మగడ్డను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురావడం, వాటిని హైకోర్టు కొట్టి వేయడం తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయమై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం నిమ్మగడ్డకు నోటీసులు కూడా పంపింది.
ఇదిలా ఉంటే ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే నిమ్మగడ్డ నైతికంగా మరింత పతనమయ్యాడు. ఇది నిమ్మగడ్డ చేసుకున్న స్వీయ తప్పిదమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్క్ హయత్ హోటల్‌లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో నిమ్మగడ్డ రహస్య భేటీ కావడంపై రాజకీయ విశ్లేషకులు, మేధావులు తప్పు పడుతున్నారు.
ఈ విషయమై సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎమ్ కృష్ణారావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు.
‘ఇది చాలా దురదృష్టకరమైన వ్యవహారం. సుప్రీంకోర్టులో ఈ వివాదం ఉండగా, ఆ వివాదానికి సంబంధించి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన డాక్టర్ కామినేని శ్రీనివాస్‌తో ఈయన కూచుని మంతనాలు సాగించడం… ఎందుకు, ఏమిటనే వివరాలైతే ఎవరికీ తెలియదు. కానీ ఇది పూర్తిగా నిమ్మగడ్డ తన విశ్వసనీయతను కోల్పోయేలా చేసిందని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హైదరాబాద్ నుంచి ఓ ప్రకటన ఇచ్చారు. తాను నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన చేసిందేమిటి? ఇది నిష్పక్షపాతమా? ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే అది కనిపించాలి. ఇలా రహస్య మంతనాలు చేయడం అభిలషణీయం కాదు’
ఇలాంటి అభిప్రాయాలే అనేక మంది వెల్లడిస్తున్నారు. ఎన్నికల కమిషనర్‌గా కొన్ని నిర్ణయాల వెనుక, అలాగే ఏపీ సర్కార్‌పై ఐదు పేజీల ఘాటైన లేఖ వెనుక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉందని ఇంతకాలం వైసీపీ చేస్తున్న ఆరోపణలకు…నిమ్మగడ్డ తాజా రహస్య భేటీ బలాన్ని ఇచ్చినట్టైంది.
రాజ్యాంగ పదవిని అడ్డు పెట్టుకుని జగన్ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేయాలని నిమ్మగడ్డ కుట్ర పన్నారనే వాదనకు బలం చేకూరుతోంది. గతంలో రాజ్యాంగ పదవిలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి నిమ్మగడ్డ మాదిరి స్థాయి దిగజారి వ్యవహరించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిమ్మగడ్డ తన వ్యవహార శైలితో రాజ్యాంగ వ్వవస్థ అయిన ఎన్నికల సంఘం విశ్వసనీయతనే దెబ్బ తీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.