విమర్శకుల నోళ్లు మూయించేలా జగన్ సర్కార్ ఇప్పుడిప్పుడే తన పాలనను మెరుగుపరచుకుంటోంది. సంక్షేమ పథకాలకు డబ్బును పప్పుబెల్లాలు పంచినట్టు జగన్ సర్కార్ పాలన సాగిస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో అభివృద్ధి పనులెక్కడ? పరిశ్రమలేవి? నిరుద్యోగులకు ఉపాధి ఎక్కడ? అంటూ గట్టిగా నిలదీస్తుండడం చూస్తున్నాం.వీటన్నింటికి సమాధానంగా ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఏదో రకమైన పారిశ్రామిక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభపరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ సర్కార్ దెబ్బతో పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది.
తాజాగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీన్ (ఎంఎస్ఏఎఫ్) అత్యాధునిక స్టీల్ ప్లాంట్ నెలకొల్పనుంది.
ఇందుకోసం రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ పరిశ్రమ స్థాపనతో 1,800 మందికి నేరుగా ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్లాంటు సిద్ధమవుతుందని కంపెనీ డైరెక్టర్ గౌతమ్ గనెరివాల్ మీడియాకు తెలిపారు. ఈ సంస్థ ఇప్పటికే తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు నడుపుతున్నాయి.
మూడురోజుల క్రితం రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం అంగీకరించిన విషయం తెలిసిందే.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ మూడు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుతో దాదాపు 37 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్, పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వారి కృషి ఫలిస్తోంది. తాజాగా వస్తున్న పరిశ్రమలే ఇందుకు నిదర్శనం.
అయితే చంద్రబాబు హయాంలో పరిశ్రమల రాక కంటే ప్రచారమే ఎక్కువగా ఉండేది. కానీ జగన్ పాలనలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. పరిశ్రమలు వస్తున్నా …. అందుకు తగ్గట్టు ప్రచారానికి నోచుకోవడం లేదు.