రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారం గవర్నర్ కోర్టుకు చేరింది. పంచాయతీరాజ్ చట్టానికి సవరణతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తన పదవిని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దీనిపై అనేక మంది హైకోర్టును ఆశ్రయిం చారు. చివరికి హైకోర్టు పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణ చెల్లదని, నిమ్మగడ్డను తిరిగి పునర్నియమించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే నిమ్మగడ్డను విధుల్లో చేరాలని కూడా ఆదేశించలేదు. నిమ్మగడ్డకు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఈ కేసు ఉంది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు స్టే నిరాకరించిన నేపథ్యంలో తన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో మరోసారి నిమ్మగడ్డ హైకోర్టు మెట్లు ఎక్కారు.
ఏపీ సర్కార్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై శుక్రవారం విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే గవర్నర్‌ను కలిసి తమ ఉత్తర్వులను అమలు చేయాలని కోరాలని హైకోర్టు నిమ్మగడ్డను ఆదేశించింది.
స్టే ఇవ్వక పోవడంతో తమ తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు పేర్కొంది. తీర్పు అమలు జరపాల్సిందేనని, నిమ్మగడ్డ గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని కోర్టు సూచించింది. దీంతో నిమ్మగడ్డ వ్యవహారం గవర్నర్ పరిధిలోకి వెళ్లింది. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించిందే తప్ప…గవర్నర్‌ను కాదనే విషయాన్ని గ్రహించాలి. అంతేకాదు, గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని మాత్రమే హైకోర్టు సూచించింది. దీంతో నిమ్మగడ్డ భవిత గవర్నర్ చేతిలో ఉన్నట్టైంది.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించి ఊరటనిస్తారా? లేక నియమించకుండా ఉస్సూరుమనిపిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గవర్నర్‌ను హైకోర్టు ఆదేశించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో న్యాయ నిపుణులు విశ్లేషించాల్సి ఉంది. ఒకవేళ గవర్నర్ నియమించకపోతే? ఏంటనేది ప్రస్తుతానికి బేతాళుని ప్రశ్నగా మిగిలింది.