ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు నితిన్. ఎట్టకేలకు అని ఎందుకు అంటున్నామంటే, దాదాపు 5-6 ఏళ్లుగా ఇతడి పెళ్లిపై ఒకటే గాసిప్స్. అలా అన్ని పుకార్లకు చెక్ పెడుతూ, 36 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన నితిన్ కు అనుకోని అవాంతరం ఎదురైంది. అది కూడా ఊహించని అవాంతరం. అవును.. కరోనా ప్రభావం ఇప్పుడు నితిన్ పెళ్లిపై కూడా పడింది.
ఇప్పటికే షాలినితో నితిన్ నిశ్చితార్థం పూర్తయింది. ఏప్రిల్ 16న దుబాయ్ లో పెళ్లి ప్లాన్ చేశారు. దాదాపు 2 వారాల కిందటే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అంతలోనే కరోనా వచ్చింది. అన్ని దేశాలపై ఈ వైరస్ ప్రభావం పడింది. దుబాయ్ లో కూడా అది ప్రభావం చూపిస్తోంది. దీంతో ఏప్రిల్ 16న దుబాయ్ లో నితిన్-షాలినిల పెళ్లిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ దిశగా నితిన్ కుటుంబంలో దీర్ఘాలోచనలు సాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ లో పెళ్లికి అందర్నీ వెంట పెట్టుకొని వెళ్తే అది పెద్ద రిస్క్ అవుతుంది. కుటుంబంలో మరికొందరు ఇంకా నెల రోజులకు పైగా టైమ్ ఉంది కాబట్టి, అప్పటికి అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు. ఒకవేళ అప్పటికీ కోరనా ప్రభావం తగ్గకపోతే.. హైదరాబాద్ లోనే నితిన్ కుటుంబానికి చెందిన ఓ ఫామ్ హౌజ్ లో పెళ్లి జరిపించాలనేది ఆలోచన.
పెళ్లికి సంబంధించి దుబాయ్ లో వేదిక ఖరారైంది. ముంబయికి చెందిన ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇటు కుటుంబసభ్యులు, బంధువులు అందరికీ ఫ్లయిట్ టిక్కెట్లు కూడా బుక్కయ్యాయి. ఏం చేస్తారనేది చూడాలి. అయితే ఒకటి మాత్రం పక్కా. కరోనాకు భయపడి పెళ్లిని పోస్ట్ పోన్ చేయకూడదని మాత్రం కుటుంబం నిర్ణయించింది. ఏప్రిల్ 16న పెళ్లి, 21న రిసెప్షన్ ఫిక్స్. వేదిక మాత్రం మారే అవకాశం ఉంది.