మీడియా మడుగులో కులాల సాగు

చేపపిల్లను ఏదో చేయక్కరలేదు. నీళ్లలోంచి తీసి ఒడ్డున పడేస్తే చాలు అన్నది వెనకటికి పెద్దల మాట. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయడు వైనం ఇలాంటిదే. ఆయన మీడియా మడుగులో…

చేపపిల్లను ఏదో చేయక్కరలేదు. నీళ్లలోంచి తీసి ఒడ్డున పడేస్తే చాలు అన్నది వెనకటికి పెద్దల మాట. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయడు వైనం ఇలాంటిదే. ఆయన మీడియా మడుగులో బతికేస్తున్న చేప. పచ్చినిజమింది.

చంద్రబాబు అనే నాయుకుడికి విజన వుండొచ్చు. కానీ విజయం మాత్రం మీడియా ఇచ్చిన వరమే. చంద్రబాబు నాయుడు అనే లీడర్ కు నాయకత్వ లక్షణాలు వుండి వుండొచ్చు కానీ, నాయకత్వం దక్కడానికి కారణం మాత్రం మీడియానే. చంద్రబాబు ఎత్తులు, పై ఎత్తులు వేయగల దిట్ట కావచ్చు. కానీ అవి ఫలించడానికి, ఫలితాలు ఇవ్వడానికి సాయం పట్టేది మాత్రం ఆయన మీడియానే.

దాదాపు ముఫై అయిదేళ్ల పాటు అప్రతిహతంగా అందిన మీడియా సాయం మాయం కావడం వల్లనే కదా? తెలంగాణలో తెలుగుదేశం తోకముడిచేయాల్సి వచ్చింది. తెలంగాణ విభజన తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రచురితమవుతున్న ఆంధ్ర మీడియా సంస్థలు అనివార్యంగా తమ మద్దతును చంద్రబాబు వైపు నుంచి కేసిఆర్ వైపు మళ్లించాల్సి వచ్చింది. అనవు కాని వేళ అధికులమనరాదు…అనే నానుడి ప్రకారం అప్పటి వరకు చంద్రబాబును భుజాన మోసిన సామాజిక మీడియా, ఆయనను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసింది. తమ తమ ప్రయోజనాల తరువాతే బాబు అయినా, ఆయన బాబు అయినా అనే రీతిలో ఈ సామాజిక మీడియా వ్యవహరించడంతో, పదేళ్లు రాజధాని పాలు వున్నా కూడా వదిలేసుకుని, ఆంధ్రలో అద్దెకొంపకు సిఎమ్ గా రావాల్సి వచ్చింది చంద్రబాబు.

చంద్రబాబు మీడియా మడుగులో బతికేసే చేప అని కాంగ్రెస్ నాయకులు ఏనాడో గమనించారు. కానీ వాళ్లకు చేయడానికి ఏమీ చేత కాలేదు. తొలిసారి ఆ ప్రయత్నం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రెండు మీడియాలు అంటూ ఎక్స్ పోజ్ చేయడం ప్రారంభించారు. ఒకపక్క బాబు మీడియా బంధాలు ప్రజలకు తెలిసేలా చేస్తూనే, మరోపక్క తమకు తమ స్వంత మీడియా వుండాలని డిసైడ్ చేసుకుని, ఆ దిశగా వెళ్లారు. అయితే రాజశేఖర రెడ్డి సైతం చేయలేనిది కేసిఆర్ ఛేయగలిగారు. అలా చేయగలగడానికి కారణం, ఆయనకు అనుకూలించిన పరిస్థితులు. తెలంగాణ విడిపోవడం, తెలంగాణ గడ్డమీద ఆస్తులు పెంచుకుని, వ్యాపారాలు చేసుకునే మీడియా అనివార్యంగా కేసిఆర్ కు మద్దతుగా నిలవాల్సి వచ్చింది. కేసిఆర్ కు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా, బాబుకు మద్దతు ఇవ్వకుండా వుండడం అనివార్యమైంది.

ఎప్పుడయితే బాబు మీడియాబలం గమనించారో కేసిఆర్ అక్కడ నొక్కడం ప్రారంభించారు. దిగ్విజయంగా బాబు అనే చేపను మీడియా నీళ్లలోంచి తీసి పక్కన పెట్టగలిగారు.  అంతే. అంతకు మించి చేసింది లేదు. హైటెక్ సిటీ కట్టింది నేనే, రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు ఘనతా నాదే, సైబరాబాద్ నిర్మాతనను నేనే అన్న చంద్రబాబు కానీ ఆయన పార్టీ కానీ తెలంగాణలో సోదిలోకి లేకుండాపోయింది.  మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం పోటీ చేయలేని స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది తెలంగాణలో.

ఇదే పరిస్థితి అంటే, మీడియా మోయడం అన్నది లేకుండా వుంటే ఆంధ్రలో ఆరునెలల్లో చంద్రబాబును జనం మరిచిపోతారు. అది కాదని ఎవరన్నా అనగలరా? బాబుగారు-మీడియా బంధం ఎలా వుంటుందో? ఎన్ని విధాల బాబుకు ప్రయోజనం కలగడానికి ప్రయత్నిస్తుందో అన్నది లెక్కలేదు. లెక్కకు అందదు.

ఎందుకంటే బాబు అనుకూల సామాజిక మీడియా అనేక విధాలుగా పనిచేస్తుంది. బహుళార్థకంగా ఎత్తులు వేస్తుంది. ఎన్ని వందల వేల ఎత్తులు వేస్తుందో,అందుకు అనుగుణంగా ఎన్ని వార్తలు వండివారుస్తుందో లెక్కా జమా వుండదు. బాబుకు ఏది ఉపయోగమో ఆ విధంగా వార్తలు వండి వారుస్తారు. అంతే కాదు, బాబు గారు ముందుగా తాను చేయాల్సిన పనుల గురించి తన మీడియాలో ఫీలర్లు వదిలి, ప్రజల, పార్టీ జనాల నాడి ఎలా వుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఎనాటి నుంచో జరుగుతున్నదే. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బాబుగారి సామాజిక మీడియా ఓ కొత్త వ్యూహానికి తెరతీసింది. అదేంటో చూద్దాం

వర్గాలు దూరం చేయడమే లక్ష్యం

ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రలో జరుగుతున్న మీడియా యజ్ఞం అంతకు మించి సాగుతోంది. అసలు జగన్ ఈసారి అధికారంలోకి ఎలా వచ్చారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, బిసిలు, క్రిస్టియన్లు, ముస్లింలు, ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. ఆయన నవరత్నాలు జనాలను ఆకర్షించాయి. గెలిచారు.

జగన్ గెలిచిన దగ్గర నుంచి బాబుగారి సామాజిక మీడియా ఏం చేయడం ప్రారంభించింది. ముందుగా జగన్ కు పాలన చేతకాదు అనే ముద్ర వేయడానికి వార్తలు వండి వార్చడం ప్రారంభించింది. ఆ తరువాత మెల్లగా హిందూత్వ ను రెచ్చగొట్టే ప్రయత్నం ప్రారంభించింది. అది అయిపోయిన తరువాత రాజధాని విభజన సాకుగా చూపించి ఉద్యోగులను దూరం చేయాలనే ప్రయత్నం మొదలు పెట్టింది. లేటెస్ట్ గా బిసిలను దూరం చేయాలనే కార్యక్రమం భుజాన ఎత్తుకుంది.

బాబుగారి కులకలం

చంద్రబాబుకు ఓ అలవాటు వుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆయన తెలుగునాట ప్రవేశ పెట్టిన ఓ అద్భుతమైన కార్యక్రమం ఒకటి వుంది. ఏ కులం వాళ్లను వాళ్ల కులం వాళ్లతోనే తిట్టించడం అన్నది చంధ్రబాబు ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్య. దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీలో ఆయన అమలు చేస్తున్నది అదే. చదరంగంలో ఏ పావు అవసరం అయితే దాన్ని ముందుకు నడిపినట్లు, ఆయన నాయకులను ముందుకు నడుపుతారు. రెడ్డిని తిట్టించాలి అంటే రెడ్డి నాయకుడిని ముందుకు నడుపుతారు. కాపు లీడర్ ను విమర్శించాలి అంటే కాపు లీడర్ ను ముందుకు తీసుకువస్తారు. ఇదే స్ట్రాటజీ ఆయన అన్ని కులాల విషయంలో అమలు చేస్తారు.

ఇప్పుడు ఏం జరిగింది. బిసిల స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయంలో ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఆ వ్యక్తి ఎవరు? ఒకప్పుడు కాంగ్రెస్ లో వుండేవారు. ఆ తరువాత తన నాయకుడితో కలిసి తెలుగుదేశంలో చేరారు. ఇప్పడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది. ఆయన పేరు చివర రెడ్డి అని వుండడంతో వైకాపాలో జమకట్టేసి ప్రచారం ప్రారంభించేసింది. కేవలం కమ్మ వాళ్లనే కాదు, బిసిలను కూడా అటాక్ చేస్తున్నారు జగన్ అనే ప్రచారానికి బాబు అనుకూల కుల మీడియా తెరతీసింది.

ఆ వ్యక్తి తెలుగుదేశంలో వున్నారని, తెలుగుదేశం పార్టీలో పదవి వుందని, బాబు, లోకేష్ తో కలిసిన ఫొటోలు వున్నాయని చెబుతున్నా, తమ మానాన తమ ప్రచారం చేసుకుంటూ పోతున్నాయి. ఒక్కో వార్త వండి వారుస్తూ ఒక్కో ఓటు అయినా జగన్ కు తగ్గించాలి అనేదే లక్ష్యంగా సాగుతోంది బాబు అనుకూల సామాజిక మీడియా.

ఇదంతా చూస్తుంటే పంతులుగారు మేకపిల్లను తీసుకెళ్తుంటే కొట్టేయాలని ప్లాన్ చేసిన నలుగురు దొంగల కథ గుర్తుకు వస్తుంది. అందరూ కలిసి కుక్క పిల్ల…కుక్కపిల్ల అని చెప్పి, ఆఖరికి కుక్కపిల్లను చేసేస్తారు ఆ కథలో. తెలుగునాట ఈ సామాజిక మీడియా బంధాలు కూడా అదే విధంగా పని చేస్తున్నాయి.

బిసిలు కీలకం

మొన్నటి ఎన్నికల్లో బిసిలు కీలకంగా వ్యవహరించారు. మొత్తగా బిసి లు గంప గుత్తగా జగన్ కు మద్దతుగా నిలవడం వల్లనే తెలుగుదేశం అంత భారీగా నష్టపోయింది. ఇప్పుడు ఈ బిసి రిజర్వేషన్ల కోర్టు కేసు ఆసరాగా తీసుకుని, జగన్ ను కార్నర్ చేసి, గోబెల్స్ ప్రచారానికి తెరతీసి, బిసిలను దూరం చేయాలనే లక్ష్యం పెట్టుకుంది బాబుగారి అనుకూల సామాజిక మీడియా. ఇదే తరహా ప్రయోగం తెలంగాణలో ఈ మీడియా చేయగలదా? చేసి మనగలదా? కేసిఆర్ అధికారంలోకి వచ్చింది లగాయతు వీలయినంత మౌనంగా వుంటూ వస్తూ, గడచిన ఎన్నికల సమయంలో, బాబుగారి కూటమిని గెలిపించాలనే ప్రయత్నం చేసి, చతికిల పడిన నాటి నుంచి మళ్లీ యాంటీ కేసిఆర్ అనే మాటనే మరిచిపోయారు.

జగన్ కు మేలు

కానీ జగన్ కొనసాగితే తమ మనుగడకే ప్రమాదంగా పరిగణించింది అన్న విషయం గమనించి, సదరు మీడియా ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతోంది. కానీ ఇక్కడ ఆ సామాజిక మీడియా తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, గ్రౌండ్ రియాల్టీ వేరుగా వుందన్నది. ఆ మీడియా ఇలా రాయడం వల్ల జగన్ ఇప్పుడు ఏం చేస్తారు. బిసిలపై అభిమానాన్ని చాటడానికి రిజర్వేషన్ లతో సంబంధం లేకుండా, జనరల్ సీట్లు, మహిళల సీట్లు కూడా వీలయినంతగా బిసిలకు కేటాయిస్తారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే స్కీము అమలు చేయాల్సి వస్తుంది. ఇవ్వాళ చకచకా నాలుగు వార్తలు వండి వార్చేసి వుండొచ్చు. కానీ ఒకసారి ఎన్నికలు అంటూ వచ్చి, టికెట్ ల కేటాయింపు వివరాలు బయటకు వస్తే, బిసి ల మీద ఎవరికి ఎంత ప్రేమ వుందన్నది క్లారిటీ వచ్చేస్తుంది.

ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి స్వంత సామాజిక బంధాలు వున్నాయి. ఆంధ్రలో ప్రతి జిల్లాలో అవి ఎప్పటికీ ఆ పార్టీ కాళ్లకు బంధాలుగా వుంటూనే వుంటాయి. వైకాపాకు ఆంధ్రలో అలాంటి బంధాలు లేవు. రాయలసీమలో మాత్రమే వున్నాయి. రాయలసీమలో ఏ పార్టీ అయినా ఒకటే సామాజికవర్గం వైపు ఎక్కువగా మొగ్గక తప్పదు. అందువల్ల బిసిలకు ఎక్కువ ఇవ్వడం అన్నది వైకాపాకు సాధ్యం అయినంతగా తెలుగుదేశానికి సాధ్యం కాకపోవచ్చు.

ప్రయత్నాలు ఆగవు

అయినా తెలుగుదేశం దాని సామాజిక అనుబంధ మీడియా మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే వుంటాయి. ఈ మధ్య కొత్తగా జగన్ సంక్షేమ పథకాలు కూడా బోగస్ అనే ప్రచారం స్టార్ట్ చేసాయి. బాబు పథకాలు, జగన్ పథకాలు బేరీజు వేస్తూ వార్తలు వండుతున్నాయి. నెలవారీ డబ్బులివ్వడం మంచిది అని, ఏడాదికి ఒకసారి ఇవ్వడం తప్పు అని, అలా చేస్తే అసలు పనికి వాడకుండా వేరే వృధా ఖర్చులు చేస్తారని అక్షర విన్యాసాలు చేస్తున్నారు.

కానీ ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ఇవీ తెలుగుదేశానికి వికటించేవార్తలే. జనం ఏమనుకుంటారు. తెలుగుదేశం అనుకూల మీడియా ఇలా అంటోంది అంటే మళ్లీ బాబు అధికారంలోకి వస్తే, జగన్ పథకాలు అన్నీ ఎత్తేయడం ఖాయం అన్న భావనకు వచ్చే అవకాశంవుంది. అప్పుడు ఈ మీడియా రాతలు అన్నీ బాబుకు వ్యతిరేకంగా  మారే ప్రమాదం వుంది.

అయితే అప్పటి సంగతి చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సామాజిక మీడియా లక్ష్యం ఒక్కటే, ఏయే వర్గాలు అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్ విజయానికి దోహదం చేసాయో, ఆయా వర్గాలు అన్నింటినీ దూరం చేయడం.

ఆ రోజు వస్తే..

ప్రస్తుతానికి జగన్ కు ఇంకా నాలుగేళ్ల సమయం వుంది. అనుకోనిది ఏదైనా జరిగితే తప్ప, నాలుగేళ్ల వరకు జగన్ ను కదపడం అన్నది ఈ సామాజిక మీడియాకు సాధ్యమయ్యేది కాదు. జనంలో ఇంగ్లీష్ మీడియం, ఇళ్లపట్టాలు, ఇళ్ల దగ్గరకు పింఛను, అమ్మఒడి ఇలా చాలా వ్యవహారాలు జగన్ కు పాజిటివ్ గా వున్నాయి. తొందరపడి బాబుగారి అనుకూల సామాజిక మీడియా తన అస్త్రాలు అన్నీ ఇప్పుడే వాడేస్తోంది. భవిష్యత్ లో జగన్ కు అన్నీ అనుకూలించి మరోసారి అధికారం అందితే, ఈ మీడియా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. జగన్ ఏదో చేస్తారని, సాధిస్తారని కాదు, రాయడానికి ఈ తరహా వార్తలు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అప్పుడు అచ్చంగా తెలంగాణలో పరిస్థితే ఆంధ్రలో కూడా తెలుగుదేశానికి వస్తుంది. కేవలం మీడియా బలం మీద మితిమీరి ఆధారపడిపోవడం వల్లనే తెలంగాణలో ఆ పార్టీ అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా తెలుగుదేశం అదే పని చేస్తోంది. ఇక్కడ కూడా ఆ మీడియా అండ మాయమైతే పార్టీ మాయమైపోయే ప్రమాదం వుంది.  అప్పటి వరకు బాబు అండ్ పార్టీ ఇలా మీడియా చెరువులో కులాల చేపలసాగు చేస్తూనే వుంటాయి. ఈ నీరు కాస్తా ఎండిపోతే, చేపలు చచ్చిపోయి, కంపే మిగులుతుంది.

చాణక్య
[email protected]