పౌరసత్వ సవరణల బిల్లు పెట్టిన మంటలు దేశ వ్యాప్తంగా అల్లుకుంటున్నాయి. ముందుగా ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన ఆందోళనలు క్రమేపీ ఇతర ప్రాంతాల్లోనూ మొదలవుతున్నాయి. కేవలం ముస్లింలు మాత్రమే ఈ ఆందోళనలు చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆందోళనలు చేస్తున్న వారిలో ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తెగల ప్రజలు ఉన్నారనేది వాస్తవం. అలాగే తాము ముస్లింలం కాదని.. అయినా ఆందోళనల్లో ముందున్నట్టుగా కొంతమంది విద్యార్థులు కూడా ప్రకటించుకుంటున్నారు.
ఇక ఈ ఆందోళనలను అరికట్టడం మోడీ సర్కారుకు తలపోటుగా మారింది. ఈ ఆందోళనలకు బాధ్యతలు రాష్ట్రాలవే అన్నట్టుగా ఎంపీలు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెడతామంటూ వారు దీన్నొక అవకాశంగా మార్చుకుంటున్నారు.
ఇక మరోవైపు ఢిల్లీలో వాహనాలను కాల్చేసింది విద్యార్థులు కాదనే ఆధారాలు కూడా దొరికాయి. కొందరు పోలీసుల ముసుగులో విధ్వంసాన్ని పెంచారనే వీడియోలు కొన్ని విడుదల అయ్యాయి. దీంతో ఆందోళనల్లో హింస చెలరేగడం వెనుక రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
ఇక అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఇంటర్నెట్ ను ఆపేశారు. మోడీ ప్రభుత్వం ఏ బిల్లును తీసుకు వచ్చినా ఎక్కడో ఒక చోట ఇంటర్నెట్ ఆపక తప్పని పరిస్థితి నెలకొంటూ ఉంది. ఇప్పుడు యూపీలో కూడా ఇంటర్నెట్ ఆగిపోయింది. మీరట్, షహరాన్ పూర్ తదితర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఒకింత ప్రశాంతంగానే ఉండిన దేశంలో పౌరసత్వం చట్టంతో గట్టిగానే మంటలు పెట్టారు. ఈ మంటలు ఎంత వరకూ వెళ్తాయనేది ఆందోళనకరమైన అంశం.