పార్లమెంట్ క్యాంటీన్లో ఉన్న సబ్సిడీల గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. దేశంలోనే అతి తక్కువ ధరకు భోజనాలు దొరికే చోటు ఏదైనా ఉందంటే అది పార్లమెంట్ క్యాంటీనే. ఎంపీలకు ఆ మేరకు తక్కువ ధరకు ప్రభుత్వం భోజనాలను అందిస్తూ ఉంది. అక్కడ దాదాపు ఎనభై శాతం సబ్సిడీతో వాళ్లకు ఫుడ్ దొరుకుతూ ఉంది.
ఎనభై శాతం ధరను ప్రభుత్వం చెల్లిస్తుండగా, ఎంపీలు కేవలం ఇరవై శాతం ధర చెల్లించి భోజనాలు తింటూ వచ్చారు. ఇది తీవ్ర విమర్శల పాలవుతూ వచ్చింది. చికెన్ కర్రీ యాభై రూపాయలు, చపాతీ రెండు రూపాయలు, దోసె పన్నెండు రూపాయలు.. ఇలా క్వాలిటీ ఫుడ్ అంతా చీప్ రేట్ కు పార్లమెంట్ క్యాంటీన్లో అమ్ముతూ వచ్చారు. ఈ వైనం తీవ్ర విమర్శల పాలైంది. పార్టీలకు అతీతంగా ఈ సబ్సిడీలను ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు సోషల్ మీడియాలో కూడా చీవాట్లు తప్పడం లేదు.
అయితే మోడీ సర్కారు వచ్చాకా కూడా ఆ సబ్సిడీలు కొనసాగుతూ వచ్చాయి. దాదాపు గా తొంభై శాతం మంది కోటీశ్వరులు ఉన్న పార్లమెంట్ లో అలాంటి సబ్సిడీ భోజనాలు చేస్తూ వచ్చారు వారంతా. అయితే ఇప్పుడు ఎందుకో మార్పు వస్తున్నట్టుగా ఉంది.
పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీల రద్దు ప్రతిపాదన వచ్చింది. ఎంపీలకు అందించే భోజనం సబ్సిడీలను రద్దు చేయాలని కొందరు ఎంపీలే సిఫార్సు చేస్తున్నారు. దీంతో త్వరలోనే అక్కడ సబ్సిడీలు రద్దు కాబోతున్నాయని సమాచారం. దీని ద్వారా ప్రతి యేటా దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పై తగ్గుతుందని అంచనా!