క‌రోనా టీకా అంద‌రికీ అవ‌స‌రం లేదు..తేల్చి చెప్పిన కేంద్రం

అదిగో ఇదిగో అంటున్న క‌రోనా వ్యాక్సిన్ ఇప్పుడ‌ప్పుడే అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ముందుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్టుగా వ‌చ్చే ఏడాది మార్చికి కానీ దేశంలో క‌రోనా వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి వ‌చ్చేలా…

అదిగో ఇదిగో అంటున్న క‌రోనా వ్యాక్సిన్ ఇప్పుడ‌ప్పుడే అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ముందుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్టుగా వ‌చ్చే ఏడాది మార్చికి కానీ దేశంలో క‌రోనా వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి వ‌చ్చేలా లేదు.

మార్చికి క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చినా అది ఎంత మేర‌కు ప్ర‌భావ‌వంతం అనే విష‌యంలో ర‌క‌ర‌కాల మాట‌లు వినిపిస్తున్నాయి. 70 శాతం అనేది కొన్ని కంపెనీలే చెబుతున్న మాట‌. కొన్ని వ్యాక్సిన్లు 99 శాతం ప్ర‌భావ‌వంతం అంటున్నా.. అవి ఇండియాలో అందుబాటులోకి వ‌స్తాయో లేదో తెలియ‌దు. ముందుగా కోవిడ్ వారియ‌ర్ల‌కు ఇండియాలో వ్యాక్సిన్ ను ఇవ్వ‌బోతున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది.

అయితే ఇప్ప‌టికే వ్యాక్సిన్ విష‌యంలో కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య‌న చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. వ్యాక్సిన్ ను ఎలా స‌ర‌ఫ‌రా చేయాల‌నే అంశం గురించి చ‌ర్చ‌లు జరుపుతున్నారు. వ్యాక్సిన్ లు త‌యారు చేసే చోట‌కు ప్ర‌ధాన‌మంత్రి కూడా వెళ్లి వ‌చ్చారు.  

ఇక వ్యాక్సిన్ విష‌యంలో రాజ‌కీయానికీ అంతు లేదు. ఎన్నిక‌లు ఎక్క‌డెక్క‌డ జ‌రుగుతుంటే అక్క‌డ ఉచిత వ్యాక్సిన్ అంటూ బీజేపీ వాళ్లు రాజ‌కీయ హామీగా మార్చేశారు. బిహార్ లో, గ్రేట‌ర్ లో అలాంటి హామీని ఇచ్చింది బీజేపీ.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ఇలా వ్యాక్సిన్ ను ఎన్నిక‌ల హామీగా ఇవ్వ‌డం ఏమిటో భ‌క్తుల‌కే తెలియాలి. బ‌హుశా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌మంటారో ఏమో! 

ఆ సంగ‌త‌లా ఉంటే.. వ్యాక్సిన్ అవ‌స‌రం అంద‌రికీ లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ‌, ఐసీఎంఆర్ ల సంయుక్త ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. భార‌తీయులంద‌రికీ వ్యాక్సినేష‌న్ అవ‌స‌రం లేదు. కొద్ది మందికి వ్యాక్సిన్ ఇచ్చినా చాలు అని కేంద్రం, ఐసీఎంఆర్ లు స్ప‌ష్టం చేశాయి. క‌రోనా వ్యాప్తి చైన్ ను బ్రేక్ చేసేంత స్థాయిలో వ్యాక్సినేష‌న్ చాలు అని ఆ సంస్థ‌లు పేర్కొన్నాయి.

లాజిక‌ల్ లెక్క‌లేస్తే.. మొత్తం జ‌నాభాలో 50 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నా.. చాలు క‌రోనా చైన్ బ్రేక్ అయిన‌ట్టే! దేశంలో క‌రోనా నంబ‌ర్లు త‌గ్గ‌డానికి కూడా  ఈ బ్రేకే కార‌ణ‌మ‌ని విశ్లేషించ‌వ‌చ్చు. ఆల్రెడీ కొంత‌మంది క‌రోనా వ‌చ్చి పోవ‌డంతో.. మిగ‌తా వాళ్ల‌లో కొందిరికి సోకినా యాంటీబాడీస్ జ‌న‌రేట్ అయ్యి, ఎలాంటి సింప్ట‌మ్స్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో.. క‌రోనా చైన్ బ్రేక్ అయ్యింద‌నేది ఒక విశ్లేష‌ణ‌.

వ్యాక్సిన్ తో ఈ బ్రేక్ మ‌రింత శాస్త్రీయం అవుతుంద‌నేది కేంద్ర సంస్థ‌ల అంచ‌నాలాగుంది. ఒక‌రు వ్యాక్సిన్ వేయించుకుంటే వారికి క‌రోనా సోక‌పోవ‌డమే కాదు, వారి ద్వారా మ‌రింత‌మందికి వ్యాపించే అవ‌కాశాలు త‌గ్గిపోతాయి.

ఇలా క‌నీసం దేశ జ‌నాభాలో 50 శాతం మందికి వ్యాక్సినేష‌న్ జ‌రిగినా మిగ‌తా వారు కూడా సేఫ్ జోన్లో ఉన్న‌ట్టే. ఇదే విష‌యాన్ని కేంద్ర సంస్థ‌లు చెబుతున్నాయి. అంద‌రికీ వ్యాక్సినేష‌న్ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నాయి. 

వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ నాటికి దేశంలో క‌నీసం 30 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌వ‌చ్చు అని అంచ‌నా. బ‌హుశా వైర‌స్ బ్రేక్ కు కూడా ఆ మొత్తం స‌రిపోతుందేమో!

పేపర్లు విసిరేసిన తమ్మినేని