అదిగో ఇదిగో.. అంటే అక్టోబర్ వచ్చేస్తోంది. ఇలాంటి క్రమంలో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందా? అంటే.. అలాంటి అవకాశాలు కనిపిస్తున్నట్టుగా లేదు. అక్టోబర్ కల్లా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తవుతాయని వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రకటిస్తూ వచ్చాయి. అయితే.. ఆ ప్రయత్నాలు ఇంతలోనే పూర్తవుతాయా? అనేది ఇప్పుడిప్పుడు సందేహంగా మారుతోంది.
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి తేడా రావడంతో.. ఒక్కసారిగా ఆ ప్రయత్నాలకు షాక్ తగిలింది. ఆ తర్వాత ఆ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నా.. వ్యాక్సిన్ పై కాస్త భయాలు కూడా కలిగే పరిస్థితి ఏర్పడింది.
అమెరికా లో నవంబర్ రెండున తొలి వ్యాక్సిన్ పడుతుందని ఇటీవలే అక్కడి ప్రభుత్వం తేల్చినట్టుగా అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి ఇంకా సమయం అయితే ఉంది. మరో నెలన్నరలో అమెరికా ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయేమో చెప్పలేని పరిస్థితి.
రష్యా మాత్రం వ్యాక్సిన్ రెడీ అయ్యిందని ప్రకటించేసి, ఇక మెడికల్ షాపుల్లో దొరకడమే తరువాయి అంటోందట. అతి త్వరలో రష్యాలో స్ఫూత్నిక్ వ్యాక్సిన్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందట.
ఇక ఇండియా పరిస్థితి ఏమిటి? అంటే.. ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ రాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ ఏడాదే ఇండియాలో అలాంటిదేమీ ఉండదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2021లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాకా మంత్రి హర్షవర్దన్.
అది కూడా కచ్చితమైన తేదీ కూడా లేదని, కనీసం నెల పేరు కూడా చెప్పలేదు కేంద్రమంత్రి. 2021 ప్రథమంలో కరోనా నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో కచ్చితమైన తేదీ ఏదీ చెప్పలేమని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీంతో.. ఈ ఏడాదిలో మిగిలిన మూడున్నర నెలల్లో కూడా కరోనాకు వ్యాక్సిన్ రాదని తేల్చారు. వచ్చే ఏడాదిలో ఎన్ని నెలల్లో ఆ వ్యాక్సిన్ వస్తుందో కూడా స్పష్టత కేంద్రానికి కూడా లేదు.
మరోవైపు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య అధికారికంగానే లక్షకు చేరింది. 80 శాతం రికవరీ కేసులు ఏ రోజుకారోజు నమోదవుతున్నాయి. జనాలు మాత్రం కరోనా పట్ల పెద్దగా సీరియస్ గా కనిపించడం లేదు. ఎవరికి అవసరమైనట్టుగా వారు వ్యవహరిస్తున్నారు.