కేసిఆర్ అడ్డాపై కన్ను?

ఉరుము లేని పిడుగు వుంటుందేమో కానీ రాజకీయాల్లో , అందునా ఓ పార్టీని స్వంతం చేసుకున్న మీడియాలో వార్తలు ఊరికనే పుట్టవు. దానికి కిలోమీటర్ దూరం అటూ ఏదో వ్యవహారం వుండనే వుంటుంది. అందునా…

ఉరుము లేని పిడుగు వుంటుందేమో కానీ రాజకీయాల్లో , అందునా ఓ పార్టీని స్వంతం చేసుకున్న మీడియాలో వార్తలు ఊరికనే పుట్టవు. దానికి కిలోమీటర్ దూరం అటూ ఏదో వ్యవహారం వుండనే వుంటుంది. అందునా అలవాటైపోయిన అధికారం ఎక్కడా అందకుండా పోయిన నేపథ్యం.. రాబోయే ఎన్నికల్లో ఎక్కడన్నా అధికారం అందుతుందా? అందదా? అన్న అనుమానం వెంటాడుతున్న తరుణం..కకావికలైపోయిన వ్యాపారాలు..అన్ని విధాలా అనాధలైపోతున్నామన్న భయం.

ఇలా అయితే గడచిన మూడున్నర దశాబ్ధాలుగా సాధించుకున్న ప్రాభవం ఏమైపోతుందో అనే విధంగా వెంటాడుతున్న పీడకల..ఇవన్నీ కలిసి మెలసి, తెలంగాణలో అన్నా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం. ఇదీ ఇప్పుడు తెలుగునాట ఓ వర్గపు రాజకీయ నేపథ్యం.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కొత్త జాతీయ రాజకీయ పార్టీ పెడుతున్నారనే చచ్చు పుచ్చు వార్త. ఆల్రెడీ ఓ పార్టీ, దానికో పాపులారిటీ వుండగా, మరో జాతీయ పార్టీ పెట్టడం ఏమిటి?  అది పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీల సమాహారం కావచ్చు అనే కనీసపు ఊహ కూడా రాకుండా పోవడం ఏమిటి? అసలు ఆ మాటకు వస్తే గతంలోనే కేసిఆర్ ఇలాంటి ప్రయత్నం చేసి వున్నారు అనే స్పృహే లేకపోవడం ఇవన్నీ యాధృచ్ఛికాలేనా? దీని వెనుక ఏమన్నా కుట్ర, కుతంత్రాలు వున్నాయా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో డిస్కషన్ పాయింట్.

ఒకటిగా వున్న ఆంధ్ర ప్రదేశ్ రెండుగా మారి తెలంగాణ-ఆంధ్రగా మారిపోయిన తరువాత చాలా పరిణామాలు, విపరిణామాలు సంభవించాయి. తెలంగాణలో ప్రాంతీయవాదం బలమైన ప్రభావం కనబర్చి, సమైక్యాంధ్ర లో బలమైన రాజకీయ పక్షంగా వున్న తెలుగుదేశం పార్టీ కలికంలోకి కూడా లేకుండా పోయింది. ఒకటికి రెండు సార్లు చేసిన ప్రయత్నాలు వమ్మయిపోయాయి. తెలంగాణ విభజన నేపథ్యాన్ని అనుకూలంగా మార్చుకుని, అంధ్ర అనాథ అయిపోయిందని, అనుభవం అపారంగా వున్న తాను తప్ప మరో అవకాశం లేదని చంద్రబాబు నమ్మించడంతో అక్కడి జనాలు అత్యవసరంగా ఆయనకు అధికారం అందించారు.

కానీ అంతలోనే అసలు విషయం జనాలకు అర్థం అయిపోయింది. అధికారం ఏ చేత్తో అందించారో, ఆ చేత్తోనే అలా తీసి ఇలా పక్కన పెట్టి, వైఎస్ జగన్ ను గద్దె ఎక్కించారు. ఏదో అయిదేళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ తరువాత చూసుకోవచ్చు అని అనుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. 

జగన్ వస్తూనే తెలుగుదేశం పార్టీని, దానికి మద్దతు ఇచ్చే వర్గాన్ని, ఆ వర్గపు వ్యాపారాలను కూకటి వేళ్లతో తొలగించే పనిని తెలివిగా చేపట్టారు. దానికి తోడు ప్రకృతి కూడా సహకరించడం లేదు. కరోనా వచ్చి కల్లోలం రేకెత్తించింది. ఇవన్నీ ఇలా వుంటే రెండు రాష్ట్రాల్లో అధికారానికి దూరం అయ్యాం అనుకుంటే కేంద్రం నుంచి కూడా కనీసపు సహాయం కూడా అందకుండా పోయింది.

ఘోరతప్పిదం

ఒక్కోసారి ఒక్కో నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమవుతుంది. నాలుగు పదుల రాజకీయ అనుభవంతో చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం ఆయనకే కాదు, ఆయనకు వెన్ను దన్నుగా నిలిచిన సామాజిక వర్గానికి ప్రాణసంకటంగా మారిపోయింది. తొందరపడి ముందే కూసిన కోయల మాదిరిగా చంద్రబాబు, అత్యుత్సాహానికి పోయి, అనాలోచితంగానో, అనూహ్యాలోచితంగానో మోడీకి ఎదురు వెళ్లారు. ఆ వెళ్లడం కూడా ఇలా అలా కాదు. 

దేశం మొత్తం కాలికి ఫ్లయిట్ కట్టుకుని మరీ తిరిగి, మోడీని ఓఢించి తీరాలన్న కసిని ప్రదర్శించారు. ఓ దశలో చంద్రబాబు కసి, పట్టుదల, ఆయన సాగిస్తున్న ప్రచారం చూసి, మోడీకి ఏమన్నా తేడా చేస్తుందేమో అనుమాన పడ్డవారు కూడా లేకపోలేదు.

బాబుగారు అంతలా చేసినా, ఆయన మద్దతు మీడియా తన చిత్తానికి అక్షర విన్యాసం చేసినా కూడా మోడీ గెలిచారు. ప్రతిపక్షం ఇప్పుడు వుండనా? ఊడనా? అనే స్థితికి చేరుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఇక చంద్రబాబు నాయడు కు కర్తవ్యం తోచడం లేదు. ఒకటి మాత్రం కళ్ల ముందు క్లియర్ గా కనిపిస్తోంది. మోడీయే దిక్కు..మోడీయే శరణ్యం..మోడీనే రక్ష..అందువల్ల అర్జెంట్ గా మోడీ సహచర్యం మళ్లీ కావాలి. 

గతంలో హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తా అని వేసిన రంకెలను మరిచిపోయి తనకు మద్దతు అవకాశం ఇచ్చారు మోడీ. అలా ఆ విధంగా 2014లో అధికారం సంప్రాప్తించింది. మళ్లీ మరోసారి అదే విధంగా మోడీ తన ఘోరాపరాధాన్ని మన్నించి, తనను అక్కున చేర్చుకుని, తనకు మద్దతు ఇస్తారని చంద్రబాబు ప్రగాఢ నమ్మకం.

ఆ ఆశలు నెరవేరేనా?

కానీ చంద్రబాబు పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు మోడీ ప్లానింగ్ నో, అమిత్ షా వ్యూహమో కానీ రాష్ట్రంలో భాజపా తన వ్యవహారం తను చూసుకుంటోంది. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టి సోము వీర్రాజును తెచ్చింది. బాబు తరపున కోవర్ట్ లు అని భావిస్తున్న భాజపాలో పసుపుదళం స్వరాలకు సంకెళ్లు వేసింది. అన్నింటికి మించి సిఎమ్ ఆస్పిరెంట్ పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపింది. 

ఇన్ని చేసిన తరువాత మళ్లీ భాజపా చంద్రబాబును దగ్గరకు తీయడం అంటే ఏదో అద్భుతం జరిగిపోవాలి. కానీ అలాంటి అద్భుతాలు జరుగుతాయన్న ఆశలు అడుగంటుతున్నాయి.

మోడీనే కనుక బాబు నాయుడుని దగ్గరకు తీసుకుంటే అర్జెంట్ జగన్ అనే వాడిని ఇరుకున పెట్టేయవచ్చు. ఏదో ఒంకన కిందకు లాగేయవచ్చు. మళ్లీ చక్కా మనమూ మన అమరావతి వ్యాపార సామ్రాజ్యం కలిసిమెలిసి వుండొచ్చు. కానీ ఇదంతా ఊహాతీతంగా వుంది. అసాధ్యానికి పక్కన సాధ్యానికి సుదూరంగా కనిపిస్తోంది. మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేసి మోడీ మనసు చూరగొనాలి. ఏం చేసి తమనను నమ్ముకున్న సామాజిక వర్గానికి మళ్లీ ఆక్సిజన్ అందించాలి. ఇదే తపన..ఇదే ఆలోచన..ఇందుకోసమే వ్యూహరచన.

ఆశపెడుతున్న తెలంగాణ

ఇలాంటి టైమ్ లో తెలుగుదేశం పార్టీ సంగతి ఎలా వున్నా దాని మద్దతు మీడియాకు, దాని మద్దతు దారులకు, ఆ పార్టీ వెన్నుదన్ను సామాజిక వర్గానికి మాత్రం అర్జెంట్ గా ఇక్కడైనా, అక్కడైనా షెల్టర్ కావాలి. పోనీ అలా అని కేసిఆర్ తో సమస్యలా?అంటే అవేం లేవు. కానీ బోరవిడుచుకుని తిరిగే పరిస్థితి తెలంగాణలో లేదు. అణిగిమణిగి వుండాల్సిందే. 

కానీ అంత మాత్రం చేత తమ తమ వ్యాపారాలు విచ్చలవిడిగా చేసేసుకోవచ్చు అనుకోవడానికి లేదు. పోనీ అవన్నీ ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోవచ్చులే అనుకుంటే, భాజపాకు దగ్గర చేరేదెలా? మెల్లగా మచ్చిక చేసుకునేదెలా? మెలమెల్లగా మంచిగా, అనుకూలంగా మార్చుకునేదెలా?

అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు సామాజిక వర్గం ఓ బృహత్తర ప్రణాళిక రచించినట్లు కనిపిస్తోంది. భాజపాకు కావాల్సింది తెలంగాణలో అధికారం. ఆంధ్రలో అధికారం అన్నది ఇంకా ఇప్పుడే ఇమ్మీడియట్ టాస్క్ కాదు. దానికి తమ వంతు సహకారం అదిద్దాం. వన్స్ తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తే తమకు షెల్టర్ వచ్చేసినట్లే. తమ ఆటలు సాగించేసుకోవచ్చు. పైగా ఆంధ్రలో దూరంగా వున్నారు, తెలంగాణలో దగ్గర ఎలా అవుతారు అన్న సమస్య లేదు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి సైద్దాంతిక శతృవు అయిన కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారుగా. ఆంధ్ర లో వేరు. తెలంగాణలో వేరు. అదే విధంగా ఆంధ్రలో మీరు మీరుగా కొట్టాడండి. తెలంగాణలో మీరు తెరాసతో చేసే కొట్లాటకు మా వంతు సహకారం అదిస్తాం అనే విధమైన వ్యూహంతో తెలుగుదేశం మద్దతు వర్గం ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఏ విధమైన మద్దతు?

క్షతగాత్రుల మాదిరిగా మిగిలిన ఈ వర్గం ఏ విధమైన మద్దతు భాజపాకు తెలంగాణలో అందివ్వగలదు? కీలకమైన మీడియా తమ దగ్గర వుంది. ఇప్పుడు న్యూట్రల్ గా వున్నా, ఎన్నికల వేళ తమ విశ్వరూపం చూపించవచ్చు. కావాలంటే 2014 ఎన్నికల టైమ్ లో ఇదే మీడియా పత్రికలను ఆర్కైవ్స్ లోంచి తీసి చూడండి.  

కేసిఆర్ వ్యతిరేక విశ్వరూపాన్ని కనులారా వీక్షించవచ్చు.  సో ఆ విధంగా 2023 లేదా 2024 నాటికి భాజపాకు మద్దతు ఇచ్చేందుకు రెడీ. ఇక హైదరాబాద్ లో భయంకరంగా నిలదొక్కుకుని, అంతకన్నా భయంకరంగా ఆస్తులు కూడ బెట్టుకున్నఈ వర్గం నుంచి ఆర్థికంగా అండదండలు అందించడం. ఒక్క ఫ్యామిలీ ఒక్కో అభ్యర్థికి ఆర్థిక అండదండలు అందిస్తామనే హామీ. అయితే వీటన్నింటి నుంచీ ఈ వర్గం ఆశించేది ఏమిటి?

ఒకటి ఆంధ్రలో ప్రస్తుతం మాట, ఆట, పాట ఏదీ చెల్లుబాటు కావడం లేదు కాబట్టి, కనీసం ఇక్కడ పరుగెత్దెయవచ్చు. రెండవది మెల్లగా ఇక్కడ ఏదో విధంగా దగ్గరకు చేరి, టెంటులో అరేబియా ఒంటె మాదిరిగా ఓ కాలు పెట్టగలిగితే, తరువాత తరువాత నాలుగు కాళ్లు దూర్చి గుడారమే లేపేయచ్చు. ఏదో విధంగా మోడీని మంచి చేసుకుని, ఆంధ్రలో కూడా కాస్త సాయం పొందవచ్చు.

అసలు బలం మిగిలిందా?

నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇంకా తెలంగాణలో బలం మిగిలి వుందా? ఇదో పెద్ద అనుమానం. పదేళ్ల పర్మిట్ వున్న ఉమ్మడి రాజధానిని వదిలేసి, లగెత్తుకుని వెళ్లిపోయారు. దాంతో పార్టీ జనాలు కూడా ఎక్కడివాళ్లు అక్కడ సర్దుకున్నారు. మిగిలింది వందల కోట్ల విలువైన పార్టీ ఆఫీసు మాత్రమే. తెలుగుదేశం పార్టీ తమంతట తాము పోటీ చేసే పరిస్థితి లేదు. 2019లో కాంగ్రెస్ తో పొత్తు అనివార్యమైంది. అందుకే 2024 నాటికి భాజపా పొత్తు సంపాదిస్తే బహుళార్థక సాధక ప్రాజెక్టులా వర్కవుట్ అవుతుంది.

అయితే ఇలా చేయాలి అంటే ఇప్పటి నుంచి ఫైల్ తయారుచేయాలి. ఏదో ఒక సంచలన గ్యాసిప్ వండి వారుస్తుండాలి. ఆ విధంగా భాజపా జనాలకు తెలంగాణ లో తెదేపా మద్దతు అవసరాన్ని సృష్టించాలి. ఇదే ఇప్పుడు తేదేపా మద్దతు మీడియా తక్షణ కర్తవ్యం. అయితే అలా అని ఇప్పడు బాహాటంగా తిరుగుబాటు జెండా ఎగరేయలేరు. అలా చేస్తే, తక్షణం కేసిఆర్ కన్నెర్రకు గురికావాల్సి వస్తుంది. 

కాయిన్ ను కన్నం దగ్గరకు మెలమెల్లగా, ప్రత్యర్థికి అనుమానం రాకుండా తోసుకుంటూ వెళ్లాల్సి వుంది. అందులో భాగంగానే కేసిఆర్ జాతీయ పార్టీ గ్యాసిప్ లు. ఇలా కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అనే గ్యాసిప్ వండి వారిస్తే అటు మోడీ అలర్ట్ అవుతారు. తెలంగాణలో భాజపాను మరింత బలోపేత చేయాలనుకుంటారు. అలాగే తెరాస నాయకుల్లో కూడా కేసిఆర్ కేంద్రంలోకి వెళ్లిపోతే ఎలా అనే చిన్న అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది.

చూడ్డానికి సూదూరంగా, ఊహాతీతంగా, పచ్చి గ్యాసిప్ లా కనిపించే ఈ వ్యవహారం పక్కా ప్లానింగ్ మాదిరిగా, ఆచరణ సాధ్యంగా, ఆమోదయోగ్యంగా కనిపించాలంటే ఇంకా రెండేళ్లు ఆగాలి. అప్పుడు బొమ్మ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఆర్వీ