ప్లాన్ మార్చిన పవన్.. ఈసారి అన్నీ ఒకచోటే

అందరూ అనుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఖాళీగా లేరు. 2024 ఎన్నికల కోసం నియోజకవర్గం వెదుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. అవును, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే పవన్ కల్యాణ్ నియోజకవర్గం వేటలో…

అందరూ అనుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఖాళీగా లేరు. 2024 ఎన్నికల కోసం నియోజకవర్గం వెదుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. అవును, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే పవన్ కల్యాణ్ నియోజకవర్గం వేటలో మునిగిపోయారు. గతంలో చేసిన తప్పులు ఈసారి చేయకూడదని ఫిక్స్ అయ్యారు. 

ఏపీలో ఎక్కడినుంచైనా పోటీ చేసి గెలుస్తామనే ధీమా పనికిరాదని, ఎంత పెద్ద నాయకుడికైనా సొంత నియోజకవర్గం ఒకటి ఉండాలని కొంతమంది కీలక నేతలు హితవు పలకడంతో పవన్ ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నారు.

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండుచోట్లా పోటీ చేసి ఓడిపోయారు పవన్ కల్యాణ్. కేవలం తన సామాజిక వర్గం ఓట్లు గెలిపిస్తాయనే నమ్మకం పెట్టుకుని ఇబ్బంది పడ్డారు. ఈసారి కోస్తాని వదిలేసి రాయలసీమకు వెళ్లాలనుకుంటున్నారట జనసేనాని. గతంలో తాను సీమ నుంచే పోటీచేస్తానని చెప్పినా చివర్లో నిర్ణయం మార్చుకున్నారు. ఈ దఫా మాత్రం సీమకే ఫిక్స్ కావాలనుకుంటున్నారట.

నియోజకవర్గాన్ని మార్చాలనుకుంటున్నారు కాబట్టే, ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా పవన్ గాజువాక, భీమవరం జోలికి వెళ్లలేదు.

ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఆ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కల్యాణ్. అక్కడ జనసేనకు మంచి గ్రిప్ ఉందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తన సామాజిక వర్గం బలంతో పాటు, అన్ని వర్గాలు మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాయని నమ్మారు. ఆ ధీమాతోనే చివరి వరకు తిరుపతి సీటు జనసేనకు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఆఖరున అధిష్టానం ఆదేశాలతో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ప్రచారం చేసి పెట్టారు.

గతంలో ప్రజారాజ్యం తరపున చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సెంటిమెంట్ కూడా ఉంది. దీంతో పవన్ తిరుపతి నియోజకవర్గానికి ఫిక్స్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

ఈసారి రెండు కాదు.. ఒక్కటే..

ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోటే గెలిచారు, పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. ఒకరకంగా ఈ రెండు అనే కాన్సెప్ట్ బాగోలేదని, అందులోనూ ఓటమి భయంతో రెండు చోట్లా పోటీచేశారనే అపవాదు కూడా ఉంటుందని పవన్ భావిస్తున్నారట. 

అందుకే ఈసారి సింగిల్ నియోజకవర్గానికే పవన్ పరిమితమౌతారని అంటున్నారు జనసైనికులు. మరీ ముఖ్యంగా బీజేపీతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ తనకంటూ 2 సెగ్మెంట్లు ఉంచుకుంటే, మిగతా అభ్యర్థులకు ఇబ్బంది అనే అంశాన్ని కూడా పవన్ గుర్తించారు.

మూడేళ్ల తర్వాత ముచ్చట గురించి ఇప్పుడు చర్చించుకోవడం కాస్త విడ్డూరమే అయినా.. పవన్ కల్యాణ్ మాత్రం నియోజకవర్గం ఎంపికపై గట్టి ఫోకస్ పెట్టారు. 

సినిమాలు పూర్తి చేసుకుని తిరిగి రాజకీయాలు మొదలు పెట్టేనాటికి.. కచ్చితంగా ఏదో ఒక ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెంటనే తను ఎంపిక చేసుకున్న నియోజకవర్గంలో పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుంది.