పాపం జగన్ కుటుంబాన్ని చూస్తే జర్నలిస్ట్ ఆర్కే కడుపు తరుక్కుపోతోంది. అమ్మ, చెల్లెళ్లకు ఎంత అన్యాయం జరిగిపోతోందో అని గుండె రగిలిపోతోంది. కానీ ఇదే మంట..ఇదే బాధ యుగపురుషుడు అని ఓ సామాజిక వర్గం సదా కీర్తించే ఎన్టీఆర్ ను చూస్తే లేదా? గతం గుర్తు లేదా…ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం జ్ఙాపకం లేదా. అసలు ఆర్కే ఏమంటున్నారు..
‘’…‘‘తల్లీ చెల్లీ అంటూ ఏ సెంటిమెంటూ లేని సిల్లీ ఫెలోవి’’ అని అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్‌బాబు ఒక డైలాగ్ చెబుతాడు. శుక్రవారంనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూసిన తర్వాత ఎందుకో ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది…’’
సరే నిజమే అనుకుందాం. మరి చంద్రబాబుకు ఈ తరహా సెంటిమెంట్లు వున్నాయా? నాదెండ్ల, ఉపేంద్ర, జయప్రద, రేణుకాచౌదరి, స్వంత బావ మరిది హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వీళ్లందరూ గతంలోనే ఏకరవు పెట్టారు కదా చంద్రబాబు గురించి. దగ్గుబాటి ఏకంగా పుస్తకం రాసేసారు. నాదెండ్ల పుస్తకంలో బాబు మీద చాప్టర్లే వున్నాయి.
జగన్ కష్టపడి కట్టుకున్న కోట. దానికి తల్లి చెల్లి సాయం చేసి వుండొచ్చు. వాళ్లేమీ తమకు జగన్ అన్యాయం చేసాడని గొంతు ఎత్తలేదే. కానీ పైన పేర్కొన్న పేర్లు, ఇంకా చాలా చాలా మంది బాబు గారి గురించి ఎంత మాట్లాడారో రికార్డులు వున్నాయి కదా?
స్వంత మామ పార్టీని తన ప్రాపర్టీ అని లాగేసుకున్నపుడు, నల్ల దుస్తులు వేసుకుని ఊరూరా తిరిగి జనం కళ్ల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు పెద్దాయిన ఎన్టీఆర్. విశాఖ జగదాంబ జంక్షన్ లో నిలబడి తనకు జరిగిన అన్యాయాన్ని జనానికి చెప్పి భోరు మన్నాడు. మరి ఆ రోజు ఏమయ్యాయి ఈ కొత్త పలుకులు అన్నీ.
‘’..రాజకీయం కోసం, డబ్బు కోసం సొంత కుటుంబాన్నే బయటకు గెంటిన జగన్ పాలనలో మంచి జరుగుతుందని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే వారి అమాయకత్వానికి జాలిపడటం మినహా ఇప్పుడు చేయగలిగింది ఏమీలేదు!…’
అంటున్నారు ఆర్కే. మరి రాజకీయం కోసం, పదవి కోసం, పిల్ల నిచ్చిన మామనే రోడ్డు పాలు చేసాడు చంద్రబాబు. తోడల్లుడినే వంచించాడు. బావమరిదినే వాడుకుని వదిలేసాడు. మరి ఆయన పాలనలో మంచి జరుగుతుందని, ఎవరైనా ఎలా నమ్ముతారు.
అలా నమ్మితే కూడా జాలి పడాలి కదా? అంటే చంద్రబాబు చేస్తే దైవ కార్యం జగన్ చేస్తే తప్పిదం ఎలా అవుతుందో? ఆర్కే ఓ వారం వివరిస్తే బాగుంటుందేమో?