మ‌రోసారి నిమ్మ‌గ‌డ్డ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం

మ‌రోసారి మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌, ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఈ ద‌ఫా వేదిక అదే. కార‌ణం మాత్రం నిమ్మ‌గ‌డ్డ సొంత విష‌యం కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో క‌రోనా మొద‌టి వేవ్‌లో…

మ‌రోసారి మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌, ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఈ ద‌ఫా వేదిక అదే. కార‌ణం మాత్రం నిమ్మ‌గ‌డ్డ సొంత విష‌యం కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో క‌రోనా మొద‌టి వేవ్‌లో ఆక‌స్మికంగా స్థానిక ఎన్నిక‌ల‌ను నిమ్మ‌గ‌డ్డ వాయిదా వేసిన మొద‌లు… ప్ర‌భుత్వానికి, అత‌నికి మ‌ధ్య వార్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే.

అనంతర కాలంలో ఆయ‌న్ను ఎస్ఈసీ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం, దానిపై నిమ్మ‌గ‌డ్డ న్యాయ‌పోరాటం చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై కూడా కోర్టులో ఎస్ఈసీ, ప్ర‌భుత్వం మ‌ధ్య పోరు నడిచింది. ఇదే కాదు, త‌మ హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా నిమ్మ‌గ‌డ్డ మాట్లాడారంటూ, ఆయ‌న‌పై ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దానిపై విచార‌ణ న‌డుస్తోంది.

ఎస్ఈసీగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత‌, గ‌త కొంత కాలంగా ఆయ‌న పేరు ఎక్క‌డా వినిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న కోర్టుకెక్క‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల‌లో తాను ఓటు న‌మోదు చేసుకునేందుకు ఇచ్చిన విన‌తిని చీఫ్ ఎల‌క్టోర‌ల్ అధికారి తిర‌స్క‌రించ‌డాన్ని ఆయ‌న హైకోర్టులో స‌వాల్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

పుట్టిన ఊరు, నివాస ప్రాంతం, ప‌నిచేసే చోట్ల‌లో ఎక్క‌డ ఓట‌రుగా పేరు న‌మోదు చేసుకోవాల‌నేది రాజ్యాంగం భార‌త పౌరుడికి ఇచ్చిన ఐచ్ఛికమ‌ని ఆయ‌న వాదిస్తున్నారు. దుగ్గిరాల‌లో మొద‌ట ఓట‌రుగా న‌మోదు చేసుకున్నాన‌ని, త‌ర్వాత హైద‌రాబాద్‌కు బ‌దిలీ చేయించుకున్నాన‌న్నారు. 

ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత సొంతూర్లోనే త‌న‌కు ఓటు క‌ల్పించాల‌ని చేసిన విన‌తిని అధికారులు తిర‌స్క‌రించార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దుగ్గిరాల ఓట‌రు జాబితాలో త‌న పేరు చేర్చేలా అధికారుల‌ను ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆయ‌న న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్థించారు.

రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిగా ప‌నిచేసిన వ్య‌క్తి, త‌న ఓటు కోసం పోరాటం చేయ‌డం నిజంగా విచిత్రమే. ప‌ర‌స్ప‌ర స‌త్సంబంధాలు లేక‌పోతే … చివ‌రికి ఓటు న‌మోదు కోసం ఏ స్థాయిలో పోరాటం చేయాల్సి వ‌స్తుందో నిమ్మ‌గ‌డ్డ తాజా ఎపిసోడే నిద‌ర్శ‌నం.