ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం శత్రువుల్ని పెంచుకుంటోంది. చివరికి తన మానస పుత్రికైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నుంచి వ్యతిరేకతను తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే చేపట్టిన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ వ్యవస్థ పనితీరుతో ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చింది.
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ విషయానికి వచ్చే సరికి… జగన్ ప్రభుత్వం కాలయాపన చేయడంతో వివాదం తలెత్తింది. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం రెండేళ్లకు ప్రొబేషన్ పూర్తి చేయాలనే డిమాండ్లు సంబంధిత ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల జగన్ ప్రభుత్వం ప్రకటించిన నూతన పీఆర్సీని మరో నాలుగైదు నెలలు వాయిదా వేయడంతో సచివాలయ ఉద్యోగులకు కోపం వచ్చింది.
తమకు వెంటనే ప్రొబేషన్‌ను డిక్లేర్ చేయాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ నెల 10న ఉద్యమబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆందోళనకు దిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఒక్కరోజు జీతం కట్ చేస్తూ ప్రభుత్వం హెచ్చరిక పంపింది.
అసలే క్రమబద్ధీకరణ ఆలస్యమవుతోందనే ఆందోళనలో ఉన్న సచివాలయ ఉద్యోగులపై ఒకరోజు జీతం కట్ చేయడం… మూలిగే పక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ఒకరోజు జీతం ఎంతనే విషయాన్ని పక్కన పెడితే, చిత్తశుద్ధితో సేవలందిస్తున్న తమను శిక్షించడాన్ని సచివాలయ ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.
ఉద్యోగ సంఘాల నాయకులు అంతా హ్యాపీ అని అంటున్నా… క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇలా ఒక్కో రంగం ప్రభుత్వానికి వ్యతిరేకమవుతున్న తరుణంలో…తన ముద్రగా చెప్పుకునే సచివాలయ వ్యవస్థ (లక్ష మందికి పైబడి ఉద్యోగులు) నుంచి కూడా వ్యతిరేకత పొందడం విచారకరం.