తనపై సానుకూలంగా వెలువడిన తీర్పునకు సంబంధించిన వార్తను ప్రచురించడానికి సాక్షికి జీవిత కాలం పట్టిందనే సెటైర్స్ పేలుతున్నాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రధానంగా సాక్షిలో పెట్టుబడుల కేంద్రంగానే సీబీఐ కేసు నమోదు చేసింది. తండ్రి దివంగత వైఎస్సార్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాక్షిలో బడా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టారని, ఇదంతా క్విడ్ప్రోకో అంటూ ప్రత్యర్థులు వాదిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సాక్షిలో పెట్టుబడులు సక్రమమే అంటూ ఆదాయపు పన్నుల శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి గతనెల 23న జ్యుడీషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. జగన్ కేసులో ఈ తీర్పు అత్యంత కీలకమైంది. దీనికి సంబంధించిన వార్త ఇటీవల జాతీయ దినపత్రికల్లో ప్రధానంగా వచ్చాయి. ఆ వార్తల్ని అందిపుచ్చుకుని జగన్ కేసుల పర్యవసానాలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర అంశాలను వివరించారు. ఇదే తీర్పుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, రాజ్యాంగ సవరణ చేసి జగన్ను జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.
తెలుగు సమాజమంతా ఈ తీర్పుపై ఆసక్తిగా చర్చించుకోవడం కూడా ముగిసిపోయింది. తగదునమ్మా అంటూ సాక్షి పత్రిక కేసు సమగ్ర వివరాలతో ఇవాళ బ్యానర్ కథనాన్ని ప్రచురించడం గమనార్హం. తన గురించి అసలేం జరుగుతున్నదో కూడా తెలుసు కోలేని స్థితిలో సాక్షి ఉందా? అందులోనూ సానుకూల తీర్పు వచ్చిన అంశాల్ని కూడా తెలుగు సమాజానికి చెప్పడంలో సాక్షి మీడియా విఫలమైతే…ఇక జగన్కు దిక్కెవరు?
గత నెల 23న తీర్పు వచ్చినట్టు ఇవాళ సాక్షి పత్రికలోనే రాయడం కొసమెరుపు. దీన్ని బట్టి గాఢనిద్రలో ఎవరున్నారో తనకు తానుగానే సాక్షి ప్రకటించుకోవడం అన్నిటికి మించిన గొప్పతనం. జగన్పై దాఖలు చేసిన చార్జిషీట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావని తీర్పులో పేర్కొన్నారు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచిందని గట్టిగా గడ్డి పెట్టారు.
మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలు సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ చార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదని తీర్పులో ప్రశ్నించడం విశేషం. అన్ని విధాలా సాక్షికి, జగన్కు ఎంతో పనికొచ్చే తీర్పునకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వడంలో ముఖ్యమంత్రి సొంత మీడియా విఫలం కావడం దేనికి నిదర్శనం? సమాచార విప్లవంలో జగన్ ఎంతగా వెనుకపడ్డారో చెప్పేందుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి?