భారతదేశం బాబాలకు ఫేమస్ అని ఊరికే చెప్పలేదు. ఎప్పటికప్పుడు వీళ్ల బాగోతాలు బయటకొస్తున్నప్పటికీ, దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఓ ఫేక్ బాబా వ్యవహారం బయటకొచ్చింది. పైకి ఆధ్యాత్మిక కేంద్రంగా కలరింగ్ ఇచ్చిన ఆ దొంగబాబా.. లోపల మాత్రం గంజాయి దందా నడిపాడు. ఏకంగా మహిళా భక్తుల్ని రేప్ చేసి వీడియోలు తీశాడు.
మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ధర్మేంద్ర దాస్ అనే వ్యక్తి తనకుతానుగా స్వామీజీగా ప్రకటించుకున్నాడు. మాయమాటలు చెప్పి స్థానిక గ్రామస్తుల్ని లోబరుచుకున్నాడు. ఏకంగా ఆశ్రమం స్థాపించాడు. కొన్ని రోజులకు గ్రామస్తుడు అతడ్ని నమ్మడం మొదలుపెట్టారు.
ఎప్పుడైతే తనపై గ్రామస్తులకు నమ్మకం కుదిరిందని గ్రహించాడో, ఇక అప్పుడు తన అసలు రూపం బయటపెట్టాడు ధర్మేంద్ర దాస్. ఆశ్రయంలో గంజాయి దందా ప్రారంభించాడు. అంతేకాదు.. మహిళా భక్తులపై అత్యాచారాలకు ఒడిగట్టాడు. వాళ్లను రేప్ చేస్తున్నప్పుడు వీడియోలు తీశాడు. వాటి సాయంతో మళ్లీ మళ్లీ అత్యాచారాలకు పాల్పడ్డాడు.
పరువు పోతుందని స్థానిక మహిళలు నోరుమూసుకున్నారు. కాని కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ముగ్గురు మహిళలు, ఒక మైనర్ పై అత్యాచారానికి పాల్పడినట్టు దొంగ బాబాపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. 4 కేజీల గంజాయితో పాటు వందల సంఖ్యలో సీడీలు, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు.