అంటే…చంద్రబాబుకి!

నిన్న “అంటే సుందరానికి” చూసాను. చూస్తున్నంతసేపూ నాకు చంద్రబాబు-పవన్ లే గుర్తొచ్చారు. అదేంటని అడగొచ్చు. కానీ అంతే. చెబితే మీకూ నిజమే అనిపించొచ్చు.  Advertisement సినిమాలో హీరో నానికి..అంటే సుందరానికి సంతానం “గంట” మోగే…

నిన్న “అంటే సుందరానికి” చూసాను. చూస్తున్నంతసేపూ నాకు చంద్రబాబు-పవన్ లే గుర్తొచ్చారు. అదేంటని అడగొచ్చు. కానీ అంతే. చెబితే మీకూ నిజమే అనిపించొచ్చు. 

సినిమాలో హీరో నానికి..అంటే సుందరానికి సంతానం “గంట” మోగే యోగం లేని రోగం వచ్చిందని తన కుటుంబసభ్యులంతా నమ్ముతారు. అయినా తనని పెళ్లి చేసుకోవడానికి ఒక క్రిష్టియన్ అమ్మాయి ఇష్టం చూపిస్తోందని చెప్తాడు సుందరం. 

ఆ సమయంలో ఇక తనని ఇక ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదని, చేసినా అబద్ధమాడి ఆమెని మోసం చేసినట్టే అవుతుందని..వేరే దారిలేక క్రిష్టియన్ పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకుంటారు కుటుంబసభ్యులు. అంటే వేరే దారి లేక చేసిన పనన్నమాట. 

కానీ తర్వాత సుందరానికి అసలా సమస్య లేదని తెలుస్తుంది. అప్పుడు వెంటనే ప్లేటు మార్చేసి కులం, గోత్రం అనుకుంటూ పెళ్లికి ఒప్పుకోరు. 

ఆ సీన్లో సుందరం తల్లి పెద్ద క్లాసే పీకుతుంది భర్తకి, అత్తమ్మకి. “మనలో లోపముందనుకుంటే ఎవరితోనైనా రాసుకు పూసుకు తిరిగేస్తాం..లోపం లేదంటే మనవాళ్ళూ పగవాళ్లూ అంటూ లెక్కలేసేస్తాం. ఆచారం ముసుగులో మనిషిని చంపేస్తున్నాం” అంటుంది ఆమె. యాథాతథంగా కాకపోయినా ఇంచుమించు డయలాగ్ సెన్స్ ఇదే. 

సేం టు సేం ఇక్కడ సుందరం ప్లేసులో చంద్రబాబుని, హీరోయిన్ ప్లేసులో పవన్ కళ్యాణ్ ని పెట్టుకుంటే సరిపోతుంది. 

చంద్రబాబు సైకిల్ “గంట” లోంచి సౌండ్ రావట్లేదని పార్టీసభ్యులు కంగారు పడ్డారు. ఇక ఏ పార్టీతోనూ పెళ్లికి పనికిరాడని…అంటే పొత్తుకు పనికిరాడని తీర్మానించుకున్నారు. 

ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు కనపడే పవన్ కళ్యాణ్ పొత్తుకు సిద్ధమన్నాడు. అంతే ఇక…కమ్మ- కాపు లెక్కల్ని కూడా పక్కనపెట్టి కలిపేసుకున్నారు. మోగని “గంటకి”, బీటవారిన గాజుగ్లాసుకి ముడెయ్యాలనుకున్నారు. 

కానీ మహానాడు-2022 కి జనం అనుకున్నదానికంటే ఎక్కువొచ్చారు. ఒకసారి సైకిల్ “గంట” వాయించుకుని చూసారు. కాస్త సౌండచ్చినట్టపించింది.

పవన్ కళ్యాణ్ ఏవో మూడు ఆప్షన్లనగానే చంద్రబాబు పార్టీ సభ్యులు విరుచుకుపడ్డారు, సెటైర్లు వేసారు. గాజుగ్లాసుని నేలకేసి కొట్టారు. 

అదీ కథ. ఇదీ పోలిక. ఇప్పుడు చెప్పండి “అంటే..సుందరానికి!” చూస్తే నాకు చంద్రబాబు-పవన్ లు గుర్తుకురావడం తప్పా!

శ్రీనివాస్ మోదుకూరి