Advertisement

Advertisement


Home > Politics - Opinion

రాహుల్‌ను హీరోగా చేయడానికి బీజేపీ కంకణం!

రాహుల్‌ను హీరోగా చేయడానికి బీజేపీ కంకణం!

ఇటీవలే దేశవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రను చేసిన రాహుల్‌ గాంధీని ఎంపీ పదవికి అనర్హుడిగా తేల్చారు. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ, ఎన్నికల కమిషన్‌ వ్యవహారాలు అవి బీజేపీకి అనుకూలమైనవి అయితే వేగంగా తేలిపోతున్నాయి. అదే బీజేపీకి ఇబ్బంది పెట్టేవి అయితే ఎంతకూ తేలవు! మహారాష్ట్రలో అసలు శివసేన ఎవరిదనే అంశంలో ఎన్నికల కమిషన్‌ చాలా వేగంగా స్పందించింది. 

సాధారణంగా అలాంటి ప్రతిష్టంభన సందర్బాల్లో అసలు గుర్తును ప్రీజ్‌ చేసి, ఇరు వర్గాలకూ చెరో గుర్తును కేటాయించడం మంచి నిర్ణయం కావొచ్చు. వాస్తవానికి ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం.. ఎంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినా, వారి మందబలం వారి ఆధిపత్యానికి గుర్తింపు కాబోదని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకుందనేది సామాన్యుడికి అంతుబట్టని అంశం!

మరోవైపు మాజీ జడ్జిలు పదవీవిరమణ చేసి పది పదిహేను రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్‌ పదవులు పొందడం రివాజుగా మారింది. న్యాయమూర్తులు రిటైర్డ్‌ అయిన వారిని జస్టిస్‌లుగానే వ్యవహరిస్తుంది మన వ్యవస్థ. మరి అలాంటి వారు అలాంటి హోదాకు పరిమితం కాకుండా.. ఎందుకు రాజ్యసభ సభ్యులుగా, గవర్నర్లుగా, ఏదో ఒక కమిషన్‌ చైర్మన్‌ లుగా కావడానికి ఉబలాటపడుతున్నారో సామాన్యుడికి అర్థం కావడం లేదు!.

బోలెడన్ని క్విడ్‌ ప్రో కో కేసులను విచారించే న్యాయమూర్తులు ఇలా తమ పదవుల్లో తీర్పులు ఇచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దల అండతో లభించే పదవులను తీసుకోవడం ఎలాంటి సంకేతాలను ఇస్తుందో అవలోకనం చేసుకోరా! ఒకవైపు భారత న్యాయవ్యవస్థ అనేక తీర్పును నైతిక పరమైన అంశాల ఆధారంగా ఇస్తూ ఉంటుంది. మరి ఇలా ప్రభుత్వం నుంచి మాజీ జడ్జిలకు వేగంగా పదవులు లభిస్తూ ఉంటే దీన్ని సగటు పౌరుడు ఎలాచూస్తాడనే అంశంలో అవలోకనం చేసుకోవాల్సిన అవసరం  ఎంతైనా ఉంది!

కట్‌ చేస్తే.. రాహుల్‌ గాంధీ విషయంలో అలా తీర్పు వచ్చిందో లేదో.. ఇంతలోనే రాహుల్‌ ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించేశారు! సాధారణంగా ప్రజాప్రతినిధుల వ్యవహారంలో ఇలాంటి వ్యవహారాలు అంత తేలికగా తేలవు. ఫిరాయింపుదారులు, క్రైమ్‌ కేసుల్లో ఇరుక్కున్నవారిని కూడా వేటు వేయడానికి పార్లమెంటరీ వ్యవస్థ యేళ్లకు యేళ్ల సమయాన్ని తీసుకోవడాన్ని చూస్తూనే ఉన్నారంతా! అయితే రాహుల్‌కు శిక్ష వేసిన కోర్టు కూడా వెంటనే బెయిల్‌ ఇచ్చింది. కానీ ఆయన కొన్ని గంటల వ్యవధిలోనే ఎంపీ పదవికి అనర్హుడు అయిపోయాడు!

వాస్తవానికి దేశంలో ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషించడం అట్రాసిటీ కేసుకు కారణం అవుతూ ఉంటుంది. అవి కూడా వేగంగా తేలవు! కానీ దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఉంటుందా... అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్య కూడా కుల కోణంలోనే పరువు నష్టం అయ్యింది! తమ కులాన్ని కించపరిచాడంటూ కోర్టుకు వెళ్లి రాహుల్‌ కు రెండు సంవత్సరాల శిక్షను వేయించగలిగారు బీజేపీ నేతలు. బహుశా ఎస్సీ ఎస్టీలు కాకుండా.. ఇంత వరకూ ఇలాంటి పిటిషన్లు వేసి, శిక్షలను వేయించగిలిన వారు దేశంలో ఎవరైనా ఉన్నారో లేదో! దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టమే కాకుండా.. ఇలా ఏ కులానికి అయినా ఇలాంటి కేసులు వేసే సౌలభ్యం ఉందనేది తెలిసినది ఎంతమందికో!

ఒక వ్యాఖ్యతో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష, ఆ వెంటనే లోక్‌ సభ సభ్యత్వం రద్దు, మరో నెల రోజుల పాటు కోర్టు కు వెళ్లేందుకు గడువు.. అన్నీ చకచకా జరుగుతున్నాయి. మరి ఈ తీరుతో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? రాహుల్‌ ను ఎంపీగా చూడకూడదనుకుంటే బీజేపీకి ఇంత కన్నా మెరుగైన మార్గాలున్నాయి. ఎందుకంటే యూపీలో వారసత్వంగా వస్తున్న సీటు నుంచినే రాహుల్‌ ను ఆల్రెడీ బీజేపీ వాళ్లు ఓడిరచారు. అలాంటప్పుడు ఇలాంటి విషయాల్లో ఉదారంగా వ్యవహరించాల్సిందేమో! 

యూపీ ప్రజలు రాహుల్‌ ను ఓడిరచినా, కేరళ ప్రజలు ఆయనను ఎంపీగా గెలిపించడం బీజేపీ అసహనానికి కారణం ఏమో! మరి ఇలాంటి తీరుతో రాహుల్‌ ను రాజకీయంగా తెరమరుగు చేయడం సంగతెలా ఉన్నా.. అతడికి హీరో అయ్యే అవకాశాన్ని మాత్రం ఇస్తున్నట్టుగా ఉంది!

-హిమ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?