బ్రాహ్మణిలో ఉన్నదేంటి-లేనిదేంటి?

చంద్రబాబు అరెస్టు పర్వంలో తెదేపా మీడియా పనిగట్టుకుని ప్రచారం కల్పిస్తున్నది మాత్రం నారా బ్రాహ్మణికి. లోకేష్ ని కారాగారం పాలు చేసినా కూడా తెదేపా యువ నాయకత్వానికి తిరుగులేదంటూ ఆమెను చూపి బాకా ఊదుతున్నారు. …

చంద్రబాబు అరెస్టు పర్వంలో తెదేపా మీడియా పనిగట్టుకుని ప్రచారం కల్పిస్తున్నది మాత్రం నారా బ్రాహ్మణికి. లోకేష్ ని కారాగారం పాలు చేసినా కూడా తెదేపా యువ నాయకత్వానికి తిరుగులేదంటూ ఆమెను చూపి బాకా ఊదుతున్నారు. 

ఇంతకీ ఆమె చేసిన పని ఏవిటి? తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న విధానమేమిటి? అసలామెలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఒక్కసారి పరిశీలిద్దాం. 

తన మామగార్ని జైల్లో పెట్టారని ఆమె తన అత్తగారితో కలిసి కొవ్వుత్తుల యాత్ర చేసారు. ఆ తర్వాత మీడియాలో మాట్లాడుతూ తన మామగారు పెట్టిన మహిళా రిజర్వేషన్ స్కీమువల్ల తనకి మెరిట్ లో ఇంజనీరింగ్ సీటొచ్చిందని చెప్పారు. రిజర్వేషన్లో మెరిట్ సీటు రావడమేంటో ఎవ్వరికీ అర్ధం కాలేదు. 

ఇక మరొక చోట తన మామగారిని “డైరుక్టుగా” అరెష్టు చేయడం అన్యాయమని చెప్పింది. ఆ పదానికి అర్ధమేంటో చాలామందికి బోధపడలేదు. అందుకే- మరి “ఇండైరెక్టుగా” ఎలా చెయ్యాలో- అని ట్రోల్స్ చేసారు. 

ఆమె ఉద్దేశ్యం బహుశా నోటీసిచ్చి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి వీలుండేలా అరెష్టు ప్రయత్నం చెయ్యాలని కాబోలు!! 

మొత్తానికి ఇలాంటి క్లారిటీలేని వాక్యాలతో ఆమె కాస్త గందరగోళ పరిచారు. 

అయినా పర్వాలేదు. తెలుగు భాషపై అనర్గళంగా మాట్లాడగలిగే పట్టులేకపోవడం వల్ల అలా జరిగిందేమో అనుకుందాం. భాషలో పట్టులేదు సరే..పోనీ భావంలో ఉందా? అదీ లేదు కదా! అత్యంత పేలవమైన పాయింట్లతో తన బాధను వెలిబుచ్చడం తప్ప ఎక్కడైనా ఆమె మాటలు ఇంపాక్ట్ కలిగించాయా?! 

భాష, భావం పక్కనపెట్టి ఇప్పుడు ఆమెలోని రాజకీయ సన్నద్ధత గురించి చెప్పుకుందాం. సరిగ్గా ఆమె మాట్లాడే సమయంలో ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.

“లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా. ఆయనతో మీరు కూడా కలిసి నడుస్తారా?” అని. దానికి ఆమె సమాధానం, “పాదయాత్ర లోకేష్ గారి సబ్జెక్ట్. దాని గురించి ఆయన మాట్లాడతారు”. 

ఇదీ పరిస్థితి. ఈ సమాధానం విన్న ఎవరికైనా రెండు రకాల ఆలోచనలు వస్తాయి. 

1. ఆమె భర్త చాటు భార్య. ఆయన గార్ని అడక్కుండా ఈమె కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పదు. 

2. ఈమెకు పాదయాత్ర పేరు వినగానే ఎక్కడ తనని కూడా రోడ్ల మీద నడిపిస్తారోనని ముందే ఆయాసమొచ్చి తప్పించుకుంది. 

ఎలా చూసుకున్నా రాజకీయంగా అస్సలు పరిజ్ఞానం లేని సమాధానం ఆమెది. అయ్యేదో కానిదో…”తప్పకుండా నడుస్తాను. ప్రజల్లోకి వెళ్తాను. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి సాయమందిస్తాను. వారి నాయకత్వం ఎంత అవసరమో ఇంటింటికీ వెళ్లి చెప్తాను” అనుంటే ఎలా ఉండేది. 

ఆమెలోని వీరనారితనం అప్పుడు కాస్త బయటపడేది. అంతే తప్ప పాదయాత్ర పేరు చెప్పగానే తప్పించుకుంటే ఇంకెక్కడి వీరత్వం? 

ఆమె జనం ముందుకొచ్చి మాట్లాడింది ఈ ఒక్కసారే. మళ్లీ తర్వాత కనపడలేదు. అయినా సరే…ఆమెని కొంగు చుట్టి, నడుం కట్టి రాజకీయ రంగంలోకి దిగమని ఒక తెదేపా సానుభూతిపరుడైన యాంకర్ పిలుపునిచ్చాడు. ఇంతోటి దానికి ఆమె భావి తెదేపా నాయకురాలు అన్న చందానా బిల్డప్పిచ్చుకుంటున్నారంటే తెదేపా మీడియా ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్ధమవుతోంది. 

గతంలో బ్రాహ్మణి ఇంగ్లీషులో మాట్లాడిన విధానం, స్పీచ్ ఇచ్చిన తీరు చూస్తే బాగానే ఉందనిపించింది. కానీ స్థానిక రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే తెలుగు భాషలో మనసుల్ని తట్టే విధంగా మాట్లాడడం తెలిసుండాలి. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి, అనుకున్న విషయాన్ని స్థైర్యంతో చెప్పడానికి భాషలోనూ,భావంలోనూ పట్టుండాలి కానీ జనం హృదయాలు తట్టడానికి మంచి మనసు, ఓపిక, జనంలో కలిసిపోయే తత్వం ఉంటే చాలు. అవైనా బ్రాహ్మణిలో ఉన్నట్టుగా ఇంతవరకు కనిపించలేదు. 

ఒక్కసారి వై.ఎస్ షర్మిల విషయం గుర్తు చేసుకుందాం. ఆమె ఒక పార్టీ పెట్టుకుని తన ప్రయత్నం చేసింది. మీడియా చుట్టూ లేకపోయినా ఒక మొబైల్ ఫోన్లో షూట్ చేయించుకుంటూ వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు చేసింది, అవమానాలు పడింది. పోలీసులతో వాగ్వాదాలకు దిగింది. వేదికలెక్కి ప్రత్యర్థులపై తన శైలిలో విమర్శలు చేసింది. మానవప్రయత్నంగా ఆమె పని ఆమె చేసింది. కానీ ఫలితం రావడంలేదని పరుగాపింది. దానికి కారణం ప్రత్యర్థి చాలా బలంగా ఉండడం. కొత్తపార్టీని నడపడానికి వనరుల సమస్య. ఇలా అనేకం ఉన్నాయి. కానీ ఆమె ప్రయత్నాన్ని మాత్రం తక్కువచేయలేం. 

కనీసం ఆ స్థాయి పోరాటపటిమ బ్రాహ్మణిలో ఏది? రాజకీయాల్లో మహిళలు రాణించాలంటే చాలా కష్టం. ఎక్కడో ఒక ఇందిరాగాంధీ, ఒక జయలలిత, ఒక మమతా బెనెర్జీ, ఒక మాయావతి గురించి చెప్పుకుంటున్నాం తప్ప ఈ రాజకీయ రొచ్చులో పడి నిలదొక్కుకుని సర్వంసహా నాయకురాళ్లుగా పైస్థాయికి ఎదిగిన మహిళామణులు చాలా తక్కువ. 

ఈ లెక్కన రిజర్వేషన్లో మెరిట్ సీటు తెచ్చుకున్నానని చెప్పిన బ్రాహ్మణి రాజకీయ భవిష్యత్తు ఏమిటో ఊహించడం పెద్ద కష్టం కాదు. 

ఈ వ్యాసం ఉద్దేశం బ్రాహ్మణిని కించపరచాలని కాదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ రకంగా ఫస్ట్ ఇంప్రెషనైతే ఆమె క్రియేట్ చెయ్యలేకపోయింది. కనీసం రెండవ ఇంప్రెషన్ తోనైనా  ఆమె ప్రజల్ని ఆకట్టుకునే విధంగా తనని తాను మార్చుకోవాలి. ఆ అవకాశముంది. 

ఎందుకూ పనికిరాడనుకున్న రాహుల్ గాంధీ జనంలో మమేకమవుతూ తన ఉనికి తాను చాటుకుంటున్నాడు. తన తండ్రి, నాయనమ్మ, ముత్తాత అందరూ ప్రధానమంత్రులని, కనుక తనది ప్యాలెస్ స్థాయి అని.. వాళ్లు డీసెంట్ గా గ్లామరస్ గా కనిపించారు కాబట్టి తాను కూడా అలాగే కనిపిస్తానని అతను అనుకోవడం లేదు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా తాను ఏం చేస్తే జనంలో ఉండగలడో ఆ పని చేస్తున్నాడు. ప్రస్తుతానికి తన ప్రత్యర్థి బలంగా బలంగా ఉన్నాడు కాబట్టి కింద మెట్టుపై ఉన్నాడు. కానీ ఎల్లకాలం ప్రత్యర్థులు బలంగా ఉండరు. ప్రతి ఒక్కరూ కాలమహిమకి తలొగ్గాల్సిందే. కనుక ఏ సమయానికైనా సర్వసన్నద్ధంగా ఉంటూ, అలుపెరుగని పోరాటం చేస్తూ ముందుకు సాగాలి.

లోకేష్ విషయానికొద్దాం. రాజకీయాల్లోకొచ్చి పదేళ్లైనా ఇంకా పాలిటిక్సులో ఎల్కీజీ స్టూడెంట్ లాగానే కనిపిస్తున్నాడు. కేవలం తెదేపా సానుకూల మీడియా తప్ప అసలు జనమెవ్వరూ ఇతన్ని ఇంకా నాయకుడిగా గుర్తించనేలేదు. తండ్రి అరెష్టవగానే తప్పించుకు తిరుగుతున్న ఇంప్రెషన్ ఇస్తున్నాడే తప్ప భయంలేని పోరాట యోధుడిగా మాత్రం రూపాంతరం చెందడం లేదు. ఏమన్నా అంటే ఢిల్లీలో తండ్రి కేసు గురించి మీడియాలో మాట్లాడి ఆ తర్వాత సుప్రీం కోర్ట్ లెవెల్లో చక్రం తిప్పడానికి అక్కడున్నాడంటోంది సానుకూల మీడియా. నేషనల్ మీడియాలో రెండు ఇంటర్వ్యూలతో పనైపోయింది. కోర్ట్ లెవెల్లో చక్రాలు తిప్పడానికి లోకేష్ అవసరం లేదు. అతనికంటే ఉద్దండులు చంద్రబాబు అభిమానుల్లో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ గ్రౌండ్ లెవెల్లో యాక్షన్లో ఉండాల్సిన వ్యక్తి. తెలంగాణా ఉద్యమం కాలంలో కేటీఆర్, హరీష్ రావులు అసలు కేసులకే భయపడకుండా తిరిగేవాళ్లు. పదవొస్తేనే పవర్ కాదు, పవరుంటే పదవి అదే వస్తుందని నిరూపించిన వ్యక్తులు వాళ్లు. ఎదురుకుండా ఉన్న అలాంటి నాయకుల్ని చూసి స్ఫూర్తి పొందకుండా, చరిత్రలో తన స్థానమేమౌతుందో అని ఆలోచించకుండా ఢిల్లీలో కూర్చోవడం మాత్రం అతని భయానికి నిదర్శనం. 

బ్రాహ్మణి టాపిక్ కి వస్తే ఆమెకి ఒక పెద్ద అదృష్టం ఉంది. ఆమెది వై.ఎస్.షర్మిల టైపులో కొత్త పార్టీ కాదు. దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ. నాయకత్వం ఏ మాత్రం ఆశాజనకంగా ఉన్నా కోట్ల రూపాయలు పార్టీ ఫండిచ్చే అభిమానులు అమెరికా నుంచి అనకాపల్లివరకు ఉన్న పార్టీ అది.

అటువంటి పార్టీలో ఇటు నారావారి కోడలిగా, అటు నందమూరి ఆడపడుచుగా ఆమెకి నాయకత్వం వహించడానికి వారసత్వబలం మెండుగానే ఉంది. కానీ అసలైన సొంత బాలాన్ని ఆమె పెంచుకోవాలి. 

ఆ దిశానిర్దేశం చేయడమే ఈ వ్యాసం లక్ష్యం. 

శ్రీనివాసమూర్తి