‘ఏనుగు నెత్తిన ఎవ్వరూ చెత్త వేయలేరు’ అని నానుడి. దాని నెత్తిన అదే చెత్త వేసుకుంటుంది. రాజకీయ రంగంలో అందరూ ఏనుగులే.. ఎవరి గోతిని వాళ్లే తవ్వుకుంటూ ఉంటారు.. ఎవరు కూర్చున్న కొమ్మను వారే నరుక్కుంటూ ఉంటారు.. ఏవేవో లెక్కలు వేస్తారు.. ఒకడిని తిడితే.. మరొకడు సంతోషిస్తాడని భావిస్తారు. ఒకచోట నిశ్శబ్దం పాటిస్తే.. అది ఓట్లు కురిపిస్తుందని.. ఊహల్లో తేలుతారు. తెరవెనుక ఎవరెవరు చేతులు కలుపుతారో.. లోపాయికారీ బంధాలను పెనవేసుకుంటుంటారో లోగుట్టు పెరుమాళ్లు కెరుక!
కానీ ఒక విషయం మాత్రం నిజం. స్వయంకృత అపరాధాలు ఇక్కడ నిత్యకృత్యం. కొందరి స్వయంకృతాలు పెద్దవి, మరికొందరివి చిన్నవి. ఆ స్వయంకృత అపరాధాల మోతాదు వారి వారి తలరాతను నిర్దేశిస్తుంటాయి. ఈ కోణంలో తెలంగాణ రాజకీయ పరిణామాల విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘వక్ర వ్యూహాలు, అడ్డదారుల ఎత్తుగడలు.. పతనమైతే స్వయంకృతమే!’
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కేసీఆర్ ను మట్టి కరిపించి.. తెలంగాణలో కాషాయ ధ్వజం ఎగరవేస్తామని, భారతీయ జనతా పార్టీ చాలాకాలం పాటూ చాలా గంభీరంగా పలికింది. నిజం చెప్పాలంటే ఆమని రాకముందే కూసిన కోయిలలాగా వారి పరిస్థితి తయారైంది. ఎన్నికల వాతావరణం జనం మదిలోకి రాకముందే వాళ్లు చాలా చాలా ప్రతిజ్ఞలు చేశారు, ప్రగల్భాలు పలికారు. తీరా ఎన్నికల సీజను వచ్చేసరికి సీను మొత్తం మారిపోయింది.
బిజెపి చాలా ఆవేశంగా రంకెలు వేస్తున్న సమయంలో.. కాంగ్రెస్ ఏదో చిన్నా సన్నా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, వారు గేరు మార్చారు. అదే సమయంలో.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అనూహ్యమైన విజయం సాధించడం అనేది తెలంగాణ పార్టీకి కూడా కలిసి వచ్చింది. పవనాలు వారికి అనుకూలంగా ఉన్నాయేమో అనే భ్రమను అనేకమందిలో అక్కడి విజయం కలిగించగలిగింది. వారు గేరు మార్చడం అనేది.. చాలా సునాయాసంగా జరిగిపోయింది.
తెరాసను భారాసగా రూపాంతరం చేయడంలో.. ప్రధాని నరేంద్రమోడీని తిట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంచుకున్న భాష, అనుసరించిన తీరు.. ఇవన్నీ ఈ రెండు పార్టీల మధ్య నిజంగానే వైరం ఉన్నదేమో అనే భ్రమను కల్పించాయి. కానీ అలా అనుకున్నవాళ్లు నెమ్మదిగా భిన్నాభిప్రాయానికి రాసాగారు. సరిగ్గా అప్పటికి ఎన్నికల గంట మోగింది. ఇక ఇక్కడినుంచి ఎత్తుగడలు, వ్యూహాలు, వాటి నడకలో అతిశయమైన పోకడలు.. ఆ దూకుడులో అనివార్యమైన స్వయంకృత అపరాధాలు అన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఎవరెవరి ఖాతాలో ఎన్ని ఉంటున్నాయి? ఎవరి కౌంట్ ప్రమాదకరమైన మోతాదులో ఉంది. గమనిద్దాం.
కల్వకుంట్ల వారి మార్కు రాజకీయం
కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. మాటల మరాఠీ! వర్తమాన రాజకీయ నాయకుల్లో కేవలం మాటలతోనే తిమ్మిన బమ్మిని చేయగలరు. అంటే ఆయన కోతిని చూపించి.. అదే బ్రహ్మదేవుడు అని నమ్మించగలరన్నమాట. తాను ఎప్పుడు ఏ మాటలు చెబితే అవి మాత్రమే సత్యమని, తతిమ్మా తన రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే మాటలన్నీ అసత్యాలని ప్రజలందరితోనూ ఒప్పించలరు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు.. పెట్టుబడిదారులు- వ్యాపారులు- పేదలు, గతిలేనివాళ్లు అనే తేడాలేవీ పట్టించుకోకుండా.. ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి సెటిలైన వారంతా దుర్మార్గులు తెలంగాణను దోచుకోవడానికే వచ్చారు.. అని ఘోరమైన తిట్లు తిట్టారు. తెలంగాణ ఏర్పడితే.. మన ప్రాణాలకే ప్రమాదం అని భయపడే పరిస్థితి తెచ్చారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం ఏర్పడగానే.. ఆ తిట్లు అన్నింటికీ తూచ్ అనేశారు. ఏదో పోరాటానికి కాస్త మూడ్ ఇవ్వడం కోసం వారిని తిట్టానంతే.. వాళ్లంతా తెలంగాణ బిడ్డలే.. వాళ్ల కాల్లో ముల్లు దిగితే కంటితో తీస్తా.. అని తియ్యగా పలికారు.
2018 ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబునాయుడు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబును ప్రతి చోటా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తెలంగాణకు ఆయనను మించి ద్రోహం చేసిన వారు ఎవ్వరూ లేదన్నట్లు మాట్లాడారు. ఆయన చెప్పుకునే హైదరాబాదు అభివృద్ధి మొత్తం ఇతరుల ఖాతాల్లోకి నెట్టారు. మొత్తానికి చంద్రబాబును బూచిగా ఎస్టాబ్లిష్ చేసి.. ఎన్నికల్లో విజయం సాధించారు. తీరా ఇప్పుడు 2023 ఎన్నికలొచ్చాయి. ఇప్పుడు ఆయన వ్యూహం ఏమిటి?
స్వయంకృతాపరాధం చేయడమే లక్ష్యం అన్నట్టుగా ఆయన పోకడలు కనిపిస్తున్నాయి. ఆయన తీరు ప్రకారం ఎవరినో ఒకరిని నిందించాలి, ఆడిపోసుకోవాలి, తద్వారా రాజకీయ మైలేజీ సాధించాలి. అయితే ఇదివరకటిలా చంద్రబాబునాయుడును తిట్టి.. పబ్బం గడుపుకోవాలంటే కేసీఆర్ భయపడుతున్నారు. నిజానికి గత ఎన్నికల సమయంలో కంటె దారుణంగా చంద్రబాబునాయుడును తిట్టిపోయడానికి ఈ ఎన్నికల్లో అవకాశం పుష్కలంగా ఉంది.
రాష్ట్రంలో పార్టీ నాయకులు మొత్తం 119 స్థానాల్లో పోటీచేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండగా.. అసలు పోటీలోకే దిగకుండా.. వారికి జైలునుంచే దిశానిర్దేశం చేసిన దార్శనికుడు చంద్రబాబునాయుడు. కేవలం కాంగ్రెసుకు అనుకూలంగానే చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలంగాణలో పసిపిల్లవాడిని అడిగినా చెబుతున్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటిదాకా సేవలుచేసిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా రాజీనామా తర్వాత అదే మాట అన్నారు. కాంగ్రెసును గెలిపించడానికి మన పార్టీ ఉంటే, దానికి నేనెందుకు అని ఆయన అలకపూనారు.
మామూలు పరిస్థితుల్లో అయితే ఈ సమీకరణాన్ని కేసీార్ చాలా ఘాటుగా వాడుకోవాలి. చంద్రబాబునాయుడును తూర్పారపట్టాలి. కానీ బాబును పల్లెత్తు మాట అనడానికి ఆయన ‘భయపడుతున్నారు’! చంద్రబాబు అరెస్టు కావడం వలన.. తెలంగాణలోని ఆంధ్ర సెటిలర్లలో కూడా ఆయన పట్ల సానుభూతి, జాలి ఉన్నదనేది చంద్రశేఖరరావు ఆలోచన అందుకే.. బాబును పల్లెత్తు మాట అంటే.. అది బూమరాంగ్ అయి తనను దెబ్బకొడుతుందని భయపడుతున్నారు.
తెలంగాణలో ఉన్న కమ్మ ఓట్లన్నీ కూడా భారాసకు అనుకూలంగా పడుతాయని కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంచనా వేస్తున్నట్లుగా ఉంది. ఆయన అంచనా నిజమేనేమో అని అనుకున్నప్పటికీ కూడా.. ఒకవైపు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో కాంగ్రెస్ కానుకూలంగా ఓటు వేయాలని గులాబీ పతనాన్ని నిర్దేశించాలని తన కులం వారందరికీ స్పష్టమైన సంకేతాలు పంపుతుండగా.. కేసీఆర్ మాత్రం ఆయనను పల్లెత్తు మాట అనడానికి జంకుతూ ఉండడం గమనించాల్సిన సంగతి!
చంద్రబాబుని తిట్టాలంటే భయపడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎగతాళి చేయడం ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం సాధించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
భారత రాష్ట్ర సమితి పార్టీని ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా ఇక్కడ మైలేజీ వస్తుంది అని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా.. రియల్ ఎస్టేట్ వాళ్ళ సమావేశంలో.. తమ పార్టీని గెలిపించకపోతే.. హైదరాబాదు కూడా అమరావతి లాగా నాశనం అయిపోతుంది అని అనడాన్ని గమనించాలి. అమరావతి అనే మాయా రాజధాని వెనుక ఉన్న కులపరమైన కుట్రలు కూహకాలు తెలియకుండానే.. హరీష్ రావు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారని విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఏపీలో రోడ్ల పరిస్థితిని ఎగతాళి చేయడం.. విభజన తర్వాత ఏపీలో కలిసిన ముంపు మండలాల వారు తిరిగి తెలంగాణలో చేరాలని అనుకుంటున్నట్లుగా తనకు తోచిన మాటలు చెప్పడం చిత్రంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించడం అనేది..ఎన్నికల సమయంలో భారత రాష్ట్ర సమితికి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందనే సంగతి ఆయన గుర్తించడం లేదన్నట్లుగా ఉంది.
తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల గాని, వైయస్ జగన్ పట్ల గాని అభిమానం ఉన్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. వైఎస్ షర్మిల కాస్త హడావుడి చేసినప్పుడు ఆమెను అభిమానించిన వారందరూ కూడా.. జగన్ పట్ల కూడా అంతే ఆదరణ కలిగి ఉంటారన్నది నిజం.. అలాంటప్పుడు ఏపీ పాలనను దెప్పిపొడిచే మాటల ద్వారా చంద్రశేఖర రావు జగన్ ను అభిమానించే మొత్తం ఓటు బ్యాంకు ను దూరం చేసుకుంటున్నారు. అలాగని చంద్రబాబు పట్ల అనుసరిస్తున్న అసహజమైన మెతక వైఖరి కూడా ఆయనకు లాభించేది కాదు.
ఇక్కడ ఆయనకు ప్రధాన ప్రత్యర్థీ కాంగ్రెస్ కాగా.. వారిని నిందించడంతో సమానంగా.. జగన్ పాలనను ఆడిపోసుకుంటే ఏం వస్తుందో ఆయనకే తెలియాలి. ఈ వ్యవహారం మొత్తం ఆయన స్వయంకృతాపరాధం లాగా కనిపిస్తుంది.
విస్మయపరచే కమలదళం వ్యూహాలు!
తెలంగాణలో మేము ఈసారి అధికారంలోకి వచ్చి తీరుతున్నాం.. అని కొన్ని నెలల కిందటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పిన ప్రతి సందర్భంలోనూ.. రాష్ట్రంలో ఎంతో కొంత శాతం ప్రజలు ఆ మాటలు నమ్మారు. కానీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గమనాన్ని, వేస్తున్న అడుగులను గమనిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటిదాకా అర్థం కాని సంగతి ఒకటి ఉంది.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు తొలగించారు అనేది ఎవరికీ అర్థం కాని సంగతి. ఒకప్పటిలో కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడు అన్నది ఎంత సంచలనాత్మకంగా మారిందో .. బండి సంజయ్ ను ఎందుకు తొలగించారు అనేది కూడా అంతే చర్చనీయాంశం అయింది. ఆ సందేహాలను నివృత్తి చేయకపోతే పోయారు.. కనీసం బండి సంజయ్ సారద్యంలో కనబరిచిన దూకుడును కొనసాగించలేకపోవడం వారి వైఫల్యం.
నిజానికి బిజెపి స్వయంకృతాపరాధాలు అక్కడితో ఆగలేదు. భారత రాష్ట్ర సమితితో లాలూచీపడి తెలంగాణలో వారు రాజకీయం చేస్తున్నారనే విమర్శలను సమర్థంగా తిప్పి కొట్టడంలో వారు విఫలం అయ్యారు. తాము భారాసతో లాలూచీ రాజకీయం చేయడం లేదని.. కనీసం తమ సొంత పార్టీ నాయకులను కూడా నమ్మించలేకపోయారు. ఈలోగా కాంగ్రెస్ దూకుడు పెంచింది.
సహజంగానే.. కేసీఆర్ ను వ్యతిరేకించే కీలక నాయకులు.. ఏదో బిజెపి ముసుగులో.. రాజకీయనాయకులుగా చెలామణీ అయిపోవడం మాత్రమే కాకుండా నిజంగా రాజకీయ జీవితం ఉండాలని కోరుకునే వారు, కేసీఆర్ ను నిజంగా వైరిగా భావించేవారు అందరూ.. భారతీయ జనతాపార్టీని వీడిపోవడం మొదలైంది. అందరూ కాంగ్రెసు గూటికి చేరారు. కమలదళం ప్రస్థానంలో ఏ మలుపులో చూసినా వారి స్వయంకృతాపరాధాలే కనిపిస్తున్నాయి.
ఒకప్పట్లో తెలంగాణలో 30 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉన్నదని ఆ పార్టీ నాయకుల అంచనాల్లో ఉండేది. బహుశా నిజమేనేమోనని అంతా అనుకునేవారు. ఇప్పుడు చూస్తే సింగిల్ డిజిట్ దాటుతారా అనే ది ప్రశ్నార్థకం అవుతోంది. ఒకవేళ అటు ఇటుగా సీట్లు గెలిచినా కూడా.. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అంటూ జరిగితే గనుక.. గెలిచిన బిజెపి ఎమ్మెల్యేల్లో కొందరు ఫిరాయించి కాంగ్రెస్ గూటికి చేరుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కమల పతనం సమస్తం స్వయంకృతాపరాధంగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్ కు కలిసొస్తోంది..
కాంగ్రెస్ చేస్తున్న తప్పులు లేవని అనలేం. వారు చేస్తున్న స్వయంకృత అపరాధాలేమీ లేకుండానే.. ఆ పార్టీని ఇప్పటికే అనేక మంది నాయకులు వీడిపోతుండడం జరగదు. కాంగ్రెస్ ను వీడుతున్న వారందరూ భారాసలోకి దడికడుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన రెడ్డి లాంటి సీనియర్లు మాత్రమే కాదు.. ఇతర నాయకులు కూడా పెద్దసంఖ్యలోనే వెళుతున్నారు. కానీ బిజెపి అపరాధాలు కాంగ్రెసుకు ఎలా కలిసొస్తున్నాయంటే.. ఇక్కడినుంచి వెలుపలికి వెళుతున్న ఏ ఒక్కరూ బిజెపిని తమ ఆప్షన్ గా ఎంచుకోవడం లేదు. అదే నిదర్శనం.
బిజెపి- లాలూచీ రాజకీయం నడుపుతోందనే అభిప్రాయం మెజారిటీ జనంలో ఉంటోంది. దీని ప్రభావం.. కాంగ్రెసుకు అనుకూలం అవుతుందని అనడంలో సందేహం లేదు. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి గద్దెమీదకు రాకూడదనుకునే ప్రతి ఓటు కూడా కాంగ్రెసుకు అనుకూలంగానే పడబోతోంది. భాజపాకు కరడుగట్టిన కాషాయవాదులు తప్ప.. మరో ఓటు బ్యాంకు తెలంగాణలో లేకుండా పోయింది. కేవలం హిందూత్వ అతివాద ఓట్లను నమ్ముకుని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా తమ వైపు మరలకపోతే.. వారు ఏం చేయగలరు? అదే కాంగ్రెస్ కు ఎడ్వాంటేజీ అవుతోంది.
నిజానికి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేసిన స్వయంకృతాపరాధాలు కూడా కాంగ్రెసుకే లాభం అవుతున్నాయి. ఆ రెండు పార్టీలు 119 స్థానాల్లో పోటీ అనే నినాదంతో హడావుడి చేసి.. పూర్తిగా ఎన్నికలబరినుంచి తప్పుకున్నాయి. షర్మిల కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రాకుండా ఉండడం కోసం.. తమ పార్టీ ఎన్నికల్లో పోటీచేయకుండా.. కాంగ్రెసుకు మద్దతు ఇస్తుందని విస్పష్టంగా ప్రకటించారు. టీడీపీ ఆ ప్రకటన చేయలేదుగానీ.. వారి మనోగతం అదే. షర్మిలకు అలాంటి ప్రకటన వల్ల సొంత పార్టీ కార్యకర్తల నుంచి కొంత సెగ తగులుతోంది. కానీ ఆ సెగను చల్లార్చడం ఆమెకు, కాంగ్రెసు పార్టీకి పెద్ద విషయమేం కాదు.
ఈ రకంగా.. రెండు అగ్ర పార్టీలు చేస్తున్న స్వయంకృతాపరాధాలు కొల్లలుగా ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఏతావతా.. కాంగ్రెసుకు అధికారం దక్కితే గనుక.. వారి కష్టంతో పాటూ.. పరోక్షంగా ఓడిపోయిన రెండు పార్టీల సాయం కూడా మెండుగానే దక్కినట్టుగా భావించాల్సి ఉంటుంది.
..ఎల్. విజయలక్ష్మి