తను బిజెపిని రోడ్‌మ్యాప్ అడిగానని, దాని కోసం ఎదురుచూస్తున్నానని పవన్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. అదేదో యిన్నాళ్లకు, తెలంగాణ ఎన్నికల సందర్భంగా యిచ్చినట్లయింది. తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో 8 స్థానాలు జనసేనకు కేటాయించింది. మరో స్థానంపై తగాదా నడుస్తోంది. ఇచ్చినా పదిశాతం సీట్లు కూడా యిచ్చినట్లు కాదు. జనసేనకు తెలంగాణలో బలం కాదు కదా, ఉనికి ఉన్నట్లు కూడా యిప్పటిదాకా నిరూపితం కాలేదు కాబట్టి కనీసం పదిశాతం యిచ్చి ఉండాల్సింది అని మనం అనలేము. జనసేన 32 సీట్లలో పోటీ చేస్తాం అన్నంత మాత్రాన అంత బలం ఉందని అనుకోలేము కదా. ఇప్పుడిచ్చిన 8-9 కూడా ఆంధ్రమూలాల ఓటర్లు బహుళంగా ఉన్న సీట్లే. గత ఐదేళ్లగా పవన్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయలేదు. మీటింగులు, ర్యాలీలు, దీక్షలు, ప్రజాసమస్యలపై పోరాటాలు ఏవీ చేయలేదు. జిల్లాల వారీ పార్టీ ఆఫీసులూ పెట్టలేదు. ఆయన ఫోకసంతా ఆంధ్ర మీదే ఉంది. ఇదంతా తెలిసి కూడా బిజెపి జనసేనను భాగస్వామిని చేసుకుని కొన్ని సీట్లు కేటాయించింది.
పవన్ అడిగినది యిదేనా!? ఆయనే చెప్పాలి. ఆయన ఆంధ్ర మ్యాప్ అడిగితే బిజెపి తెలంగాణ మ్యాప్ చేతిలో పెట్టిందేమోనని అనుమానం వస్తోంది. ఎందుకంటే రోడ్‌మ్యాప్, వేరేలా చెప్పాలంటే ఎన్నికల స్ట్రాటజీ కావలసినది ఆంధ్రలో. అక్కడ వైసిపిని ఓడించాలంటే టిడిపితో పొత్తు పెట్టుకుని తీరాలని పవన్ ఎప్పణ్నుంచో చెప్తున్నారు. ఇటీవల దాన్ని ప్రత్యక్షంగా ప్రకటించారు కానీ, పరోక్షంగా ఎప్పణ్నుంచో సంకేతాలిచ్చారు. తామిద్దరం చాలమని, బిజెపి కూడా కలిసి రావాలని పవన్, బాబు యిద్దరూ అభిప్రాయ పడుతున్నారు. కానీ బిజెపి ఎటూ తేల్చటం లేదు, నానుస్తోంది. నాన్పుడు మానేసి, స్పష్టంగా 2014 నాటి కూటమిని పునరుద్ధరించండి అనే అర్థంలోనే పవన్ ‘రోడ్‌మ్యాప్ యివ్వడం’ అనే మాటను ఉపయోగించారు.
ఆ మ్యాప్ యివ్వడం సంగతి యిప్పటికీ బిజెపి తేల్చలేదు. ‘మోదీ, అమిత్‌లతో డైరక్టుగా మాట్లాడే చనువు నాకుంది. ఆ కూటమి ఏర్పాటుకి నేను ఒప్పిస్తాను’ అని పవన్ ధీమాగా చెప్తూనే ఉన్నారు కానీ బిజెపి ఆ దిశగా అడుగు వేయలేదు. బాబు అరెస్టు తర్వాత పవన్, బిజెపినే కాదు, తన పార్టీ కార్యకర్తలను సంప్రదించకుండా (నాయకులను, అనగా నాదెండ్ల, నాగబాబులను సంప్రదించారేమో తెలియదు) జైలు బయటే టిడిపితో పొత్తు ప్రకటించేసి, బాబు మన్ననలను, కృతజ్ఞతలను అందుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో తయారీలో పడ్డారని, యివాళ్టి ఆంధ్రజ్యోతి రాసింది. టిడిపి యిప్పటికే ప్రకటించిన ఆరు అంశాలకు, జనసేన మరో ఆరు కలుపుదా మనుకుంటోందట. సమన్వయ కమిటీ 9న సమావేశమై తేలుస్తుందట. ఈ స్కీములో బిజెపి ఎక్కడా కానరావటం లేదు.
పొత్తు విషయంలో అక్కడ స్తబ్ధంగా ఉన్న బిజెపి తెలంగాణలో చొరవ తీసుకుంది. కానీ అది జనసేనకే పరిమితం. టిడిపిని దగ్గరకు రానీయలేదని అనుకోవాలి. రానిచ్చి ఉంటే టిడిపి ఎన్నికలలో పోటీ చేసేదేమో! పోటీ చేయకపోవడానికి కారణం ఏమిటో అది ప్రకటించలేదు. మొన్నటిదాకా దాని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ప్రకారం కాంగ్రెసును గెలిపించడానికే! తను జైల్లో ఉన్నాను కాబట్టి యిప్పుడు పోటీ చేయడం కుదరదు అని బాబు కాసానితో అన్నారట. అలా ఎలా, మేమంతా సిద్ధంగా ఉన్నాం కదా అంటే లోకేశ్ చూస్తాడులే అన్నారట. లోకేశ్ చూస్తే మీటింగుకి రాలేదు, ఫోన్లు ఎత్తలేదు. తెలంగాణలో టిడిపిని గెలిపించే బాధ్యత నాది, ప్రచారం చేస్తా అని ముందుకి వచ్చిన బాలకృష్ణను బాబు అడ్డుకున్నారు లాగుంది. ఆయన మళ్లీ పిక్చర్‌లోకి రాలేదు.
తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే బాబు బయటకు వచ్చేశారు. రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టేశారు. ఆంధ్రలో జనసేనతో మేనిఫెస్టో కమిటీ వేశారు. ఇన్ని చేయగలిగినవారు, కావాలంటే తెలంగాణలో కాసాని మొదట్లో చెప్పిన 80 పై చిలుకు స్థానాల్లో పోటీకి ఓకే అనలేక పోయారా? ఆయనకు ఆ ఉద్దేశం లేదని క్లియర్‌గా తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడో రాశారు, తెలంగాణలో పోటీ చేసి, కమ్మ ఓట్లు, ఆంధ్రమూలాల ఓట్లు చీలిపోయేట్లా చేసి కాంగ్రెసును దెబ్బ తీయవద్దని ఆ వర్గాలు బాబుపై ఒత్తిడి తెస్తున్నాయని! బాబు ఆ ఒత్తిడికి లొంగారనుకోవాలి. లేదా కాంగ్రెసును గెలిపించి, జగన్‌కు మద్దతిచ్చే బిజెపి, తెరాసలకు ఏకకాలంలో బుద్ధి చెప్పడానికి బాబే ఆ విధంగా వ్యూహరచన చేశారనుకోవాలి.
ఇది ఒక గందరగోళ పరిస్థితి. టిడిపి ఆంధ్రలో బిజెపితో పొత్తుకై అర్రులు చాస్తుంది, తెలంగాణలో దాన్ని దెబ్బ తీయడానికి కాంగ్రెసుకు మద్దతిస్తుంది. జనసేన ఆంధ్రలో టిడిపితో పొత్తు పెట్టుకుంటుంది, తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుని, టిడిపి కాంగ్రెసుకు యిచ్చే మద్దతుకి గండి కొట్టేలా ప్రవర్తిస్తుంది. ఇక బిజెపి పవన్‌తో ఏం చేస్తోందో అర్థమే కావటం లేదు. ఆంధ్రలో పొత్తు ఉందని చెప్పుకుంటారు. మొదట్లో తమ కూటమి తరఫున సిఎం అభ్యర్థి పవన్ అన్నారు, తర్వాత అలా అనడం మానేశారు. ఉమ్మడి కార్యక్రమాలు చేయరు. పవన్ వేదికలపై బిజెపి రాష్ట్ర నాయకులు కానరారు. బిజెపి జాతీయ నాయకులు, పవన్ తన ఆత్మీయులుగా చెప్పుకునే మోదీ, అమిత్‌లు ఆంధ్రలో సభలు పెట్టినపుడు పవన్‌కు ఆహ్వానం ఉండదు. ఆంధ్రలో అల్లూరి విగ్రహానికై చిరంజీవిని పిలిచారు కానీ యీయన్ని పిలవలేదు. అమిత్ అన్నిసార్లు హైదరాబాదు వచ్చినా పవన్‌ను పిలిచి మాట్లాడరు. నటుడిగా జూనియర్ ఎన్టీయార్ని పిలిచారు తప్ప యీయన్ని పిలవలేదు.
ఇప్పుడు పొత్తు అంటున్నారు కానీ యిన్నాళ్లూ తెలంగాణ సభల్లో కూడా పవన్‌ను పిలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమకు మద్దతివ్వకుండా, తెరాస అభ్యర్థికి యిచ్చినా ఏమీ పట్టించుకోలేదు. ఇన్నాళ్లలో మోదీతో వైజాగ్‌లో జరిగిన ముఖాముఖీ సమావేశమొక్కటే లెక్కించదగినది. బాబు ఆరెస్టు తర్వాత జైలు బయట టిడిపితో పొత్తు పెట్టుకున్నా అని ప్రకటిస్తే, ఏ విధమైన స్పందనా లేదు. భేష్ అని కానీ, మాతో ఓ ముక్క చెప్పడం కర్టెసీ కదా అని కానీ అనలేదు. అలగలేదు. తెలంగాణ జనసేన యూనిట్ తమంతట తామే 32 స్థానాల్లో పోటీ అని చెప్పేసుకుంటే ఖండించలేదు. అలాటిది హఠాత్తుగా అమిత్ దిల్లీకి ప్రత్యేక విమానంలో పిలిపించి, కిషన్ రెడ్డి ఎదుటే మాట్లాడారు. పొత్తు ఖాయం, సీట్ల సంఖ్య కిషన్‌తో తేల్చుకోండి అన్నారు. తర్వాత మళ్లీ చాలా జాప్యం. పవన్ ఇటలీ వెళ్లినా కావాలంటే జూమ్‌లో మాట్లాడి ఫైనలైజ్ చేయవచ్చు. కానీ ఎందుకో తాత్సారం జరిగింది. ఇవాళ సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. సో, బిజెపి రోడ్ మ్యాప్ పవన్ చేతికి దాదాపు వచ్చినట్లే!
మ్యాప్ రీడింగు అనేది ఒక కళ. లెజెండ్ అని యిచ్చే యిండికేటర్లు చూస్తే కాస్త బోధ పడుతుంది. ఇప్పటిదాకా తెలంగాణలో జనసేనను పట్టించుకోని బిజెపి హఠాత్తుగా ఎందుకు పట్టించుకున్నట్లు అనే యిండికేటరు తెలిస్తే బిజెపి యిచ్చిన మ్యాప్‌ను కాస్త రీడ్ చేయగలం. బిజెపి, టిడిపి, పవన్ ఆంధ్ర, తెలంగాణలో పరస్పర విరుద్ధమైన విధానాలను అవలంబిస్తున్నారని పైనే అనుకున్నాం. దాన్ని పక్కన పెట్టి, బిజెపి జనసేనకు పిలిచి పీట వేసిందంటే, జనసేన బలమో, బిజెపి బలహీనతో, ఏదో గట్టి కారణమే ఉండాలి. మొన్నటిదాకా తెరాసకు ప్రత్యామ్నాయం అని చెప్పుకునే స్థితి నుంచి బిజెపి హంగ్ అసెంబ్లీ కోసం ప్రయత్నించే పార్టీగా మారిపోయింది. ఓ 20-25 స్థానాలు తెచ్చుకుని, హంగ్ అసెంబ్లీ వస్తే తెరాసకు మద్దతిచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించి, దానికి బదులుగా పార్లమెంటులో మద్దతడుగుదామని బిజెపి వ్యూహమని అంటున్నారు.
ఇది నిజమని తెలంగాణలో అన్ని పార్టీల నాయకులూ నమ్ముతున్నట్లే ఉంది. ఎన్నికల వేళ ఆ పార్టీలో చేరేవారు కనబడటం లేదు, దానిలోంచి బయటకు వెళ్లిపోయే నాయకులే తప్ప! పార్టీలో ఉన్న వీరులందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయం, ఎంపీగా చేస్తాం అంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీ కైతే నెగ్గుతామన్న ధైర్యం లేదు, పార్లమెంటు అంటే మోదీ వేవ్‌లో గెలిచేయవచ్చని ఆశ. చాలామంది నాయకులు పార్టీలో ఉంటారా, వీడతారా అనే సందేహాలు వస్తున్నాయి. టిక్కెట్ల జాబితా ప్రకటించడంలో చాలా జాప్యం జరుగుతోంది. తెరాసను ఓడిస్తామనే కిల్లర్ యిన్‌స్టింక్ట్ కాంగ్రెసులో కనబడుతున్నంత దానిలో పదో వంతు కూడా బిజెపిలో కనబడటం లేదు. నాయకులు, కార్యకర్తలు యింత ఉదాసీనంగా ఉన్నపుడు తెలంగాణపై బిజెపి ఆశ పెట్టుకుందని అనుకోలేము. ఏ 10-15 దగ్గరో ఆగిపోతుందా?
అంతకంటె ఎక్కువ సీట్లు తెచ్చుకునేలా కనబడని, ఫైటింగ్ స్పిరిట్ కొరవడిన బిజెపితో పొత్తు పెట్టుకుని జనసేన సాధించేది ఏముంది అనేది మొదటి ప్రశ్న. ఆసలే ఆంధ్రలో 2019లో చావు దెబ్బ తింది. ఒకే ఒక్క సీటు. పార్టీ అధ్యక్షుడే రెండు చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు తెలంగాణలో కూడా దెబ్బ తింటే, ఓటర్లలో, పవన్ అభిమానుల్లో విశ్వాసం కలుగుతుందా? 2024లో ఆంధ్రలో కాండిడేట్లు దొరుకుతారా? ఈ రిస్కు తీసుకోవడం కంటె తెలంగాణలో తనంతట తనే టిడిపి మద్దతుతో, కమ్మ, కాపు ఓట్లు కైవసం చేసుకుని, ఓ 10 సీట్లు గెలిచి, హంగ్ ఎసెంబ్లీ వస్తే కాంగ్రెసుకి మద్దతిస్తే పోయేదిగా! మరి బిజెపితో పొత్తెందుకు? అక్కరలేదని చెప్పలేక పోయారా? చెప్పే ధైర్యం లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే బిజెపిని అడక్కుండానే ఆంధ్రలో టిడిపితో ముందుకు వెళ్లిపోతున్నారని అనిపిస్తోంది కదా! ‘అనిపిస్తోంది’ అని ఎందుకంటున్నానంటే, పవన్ టిడిపికి మద్దతు ప్రకటించడం బిజెపి ప్లాన్ ప్రకారమే అని కొందరి అంచనా కాబట్టి!
జనసేన సంగతి సరే, బిజెపి ఉద్దేశం ఏమిటి? తను గెలిచే స్థానాలే అంతంత మాత్రం అనుకుంటే తక్కిన వాటిలో తన ఓట్లు బదిలీ చేసి జనసేనను గెలిపించగలదా? తెలంగాణ బిజెపి ఓటర్లకు జనసేనపై ప్రేమ ఉందని అనుకోగలమా? ఆంధ్రలో బిజెపి ప్రమేయం లేకుండా టిడిపికి అనుబంధ పార్టీగా తిరుగుతున్న పవన్ అంటే సగటు బిజెపి ఓటరుకు ప్రేమ ఎందుకుంటుంది? చంద్రబాబు అరెస్టు వెనక వైసిపితో పాటు బిజెపి ఉందని టిడిపి అనుకూల మీడియా కోడై కూస్తోంది. బాబు-పవన్ అనుబంధం తెలియనిది కాదు. అలాటప్పుడు బిజెపి అభిమాని పవన్‌ను ఎందుకు ఆదరిస్తాడు? తమ పార్టీ చెపితే మాత్రం ఓట్లెందుకు వేస్తాడు? ఇదే సందేహం జనసేన అభిమానుల విషయంలో కూడా వస్తుంది. పవన్, బాబుల అభిమానులు బాబుని యిబ్బంది పెడుతున్న (లేదా బాబుకి అండగా నిలవని) బిజెపికి తమ ఓట్లు బదిలీ చేస్తారా? ఓ పక్క బాబు అభిమానులు కాంగ్రెసుకి ఓటేసి బిజెపికి గుణపాఠం చెపుదామని చూస్తూంటే, తాము మాత్రం పవన్ చెప్పాడు కదాని బిజెపికి ఓటేస్తారా?
ఎలా చూసినా యీ పొత్తులో ఓట్ల బదిలీ సందేహాస్పదంగానే ఉంది. మరి ఎందుకోసం బిజెపి పొత్తు పెట్టుకుంది? మరో కోణంలో ఆలోచించి చూస్తే – బిజెపికి ప్రధాన శత్రువు కాంగ్రెసు. తెలంగాణలో కాంగ్రెసుకు మెజారిటీ సీట్లు వస్తే అదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీకి కాస్త తక్కువ వస్తే, తెరాస నుంచి ఫిరాయింపులు చేయించుకుని (గతంలో జరిగినదానికి రివర్సులో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రెండూ జరగ కూడదంటే కాంగ్రెసు మెజారిటీకి అల్లంత దూరంలో ఆగాలి. ఆగాలంటే తెరాస వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి. ఆంధ్రమూలాల వారు బిజెపికి బుద్ధి చెప్పడానికై కాంగ్రెసుకు ఓటేద్దా మనుకుంటున్నారని తెలుగు మీడియా ఊదర గొట్టడంతో బిజెపికి అనుమానం వచ్చింది. కాంగ్రెసు ఓట్లు చీలకుండా ఉండడానికై టిడిపి బరిలో నుంచి తప్పుకోవడంతో అనుమానం ధృవపడింది.
కాంగ్రెసు ఓటు చీలకుండా చూడడానికి టిడిపి విరమించుకుంది కాబట్టి, చీల్చడానికై బిజెపి జనసేనను దింపింది. ఆంధ్రమూలాల వారిలో కమ్మలు కాంగ్రెసుకి వేసినా (వేస్తారో లేదో ఎవరూ చెప్పలేరు. ఇవన్నీ ఊహాగానాలే, స్థానిక రాజకీయ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటారని నా నమ్మకం), కాపుల, పవన్ అభిమానుల ఓట్లు మాత్రం అటు పడకుండా, యిటు లాగడానికి జనసేనను దింపారేమో! తెలంగాణలోని మున్నూరు కాపులను పవన్ ప్రభావితం చేస్తారని అనుకోవడానికి లేదు. ఆంధ్ర నుంచి వచ్చిన కాపులు మాత్రమే ప్రభావిత మౌతారనుకుంటే పవన్ ప్రభావం ఎంత ఉంటుంది? మహా అయితే 5 శాతం లోపునే అనుకుందాం. హోరాహోరీగా పోటీ జరిగినప్పుడు పవన్ కారణంగా వచ్చే 2-3శాతం ఓట్లు కాంగ్రెసుకు పడకుండా బిజెపికో, తెరాసకో పడితే కాంగ్రెసుకు సీట్లు తగ్గుతాయి కదా! ఆ మేరకు బిజెపికి లాభమే!
కానీ దీనివలన జనసేనకు దీర్ఘకాలికంగా నష్టమే. తెలంగాణలో తక్కువ సీట్లు తెచ్చుకుంటే, ఆంధ్రలో టిడిపితో బేరమాడే శక్తి తగ్గుతుంది. తెలంగాణలో కమ్మలు, కాపులు వేర్వేరు పార్టీలకు ఓటేస్తే ఆంధ్రలో టిడిపి-జనసేన మధ్య ఓట్ల బదిలీ ప్రభావితమౌతుంది. తెలంగాణలో మా జనసేనకు కమ్మలు ఓటేయలేదు కానీ, ఆంధ్రలో మాత్రం మేం కమ్మలకు వేయాలా? అని ఆంధ్ర కాపులు అలిగే ప్రమాదం ఉంది. ఇవి 2024 నాటి విషయాలు. తక్షణ పర్యవసానం ఏమిటంటే, ఆంధ్రలో జనసేన-టిడిపి సంయుక్త కార్యాచరణ ప్రారంభమైన యీ తరుణంలో జనసేనాని తెలంగాణలో ప్రచారానికై నెల రోజుల పాటు అందుబాటులో లేకుండా పోవడం. జనసేన స్థానాల్లోనే కాక, బిజెపి నాయకులు పోటీ చేసే చోట్లా తిప్పుతారేమో! వాటితో పాటు ఛత్తీస్‌గఢ్‌లో తెలుగువారున్న ప్రాంతాలకు కూడా పంపుతారేమో! బాబు ర్యాలీలలో పాల్గొనకూడదు. పవన్ యిటు వచ్చేస్తారు. ఆ కార్యక్రమం కుంటుపడుతుంది. పవన్, బాబు లేకపోతే జనసమీకరణ భారం లోకేశ్ మీదే పడుతుంది.
ఇక్కడే యింకో విషయం కూడా ఆలోచించాలి. కమ్మలే టిడిపి రాజకీయాలను శాసిస్తున్నారని, అందుకే టిడిపి తెలంగాణలో పోటీ చేయటం లేదనే ఆంధ్రజ్యోతి వాదనను ఆధారంగా చేసుకుని ముందుకు సాగితే – కమ్మలు తెలంగాణలో జనసేనకు కాకుండా కాంగ్రెసుకు ఓట్లేసే పక్షంలో ఆంధ్రలో కాపుల ఓట్లు కమ్మలకు బదిలీ కావనే భయం ఉంటుంది కదా! ఆంధ్రలో అయినా, తెలంగాణలో అయినా కమ్మలకు ఆంధ్రలో టిడిపి కూటమి విజయం ముఖ్యం. దాని కోసం జనసేన ఓట్ల అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో కాంగ్రెసుకు సహకరించి, జనసేనను దూరం చేసుకోవడం కంటె, కనీసం జనసేన నిలబడిన చోట వాళ్లకే ఓట్లేయవచ్చు, అది బిజెపితో పొత్తు పెట్టుకుందని ఓ పక్క పళ్లు నూరుకుంటూనే! ఇలా జరిగితే బిజెపి కమ్మల బ్లాక్‌మెయిల్‌కు లొంగకుండా, కమ్మలనే బ్లాక్‌మెయిల్ చేసిందనవచ్చు. రోడ్ మ్యాప్ రహస్యం యిదేనేమో!
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)