Advertisement

Advertisement


Home > Politics - Opinion

CHAPTER ఉద్ధవ్

CHAPTER ఉద్ధవ్

‘‘కమలదళం కుట్ర చేసింది.. ప్రాంతీయ పార్టీలలో అస్థిరతకు కారణం అవుతోంది.. ఎన్డీయేతర ప్రభుత్వాలను కూల్చివేస్తోంది..’’ మహా సంక్షోభం గురించి సర్వత్రా వినిపించే మాటలు ఇవి! ఇవేమీ పొల్లుమాటలు కాదు.  అబద్ధాలు కాదు! అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది!

ఎవరో కుట్ర చేస్తే కూలిపోయేంత బలహీనంగా ఒక ప్రాంతీయ పార్టీ ఎందుకు ఉంది? ఎవరో తిరుగుబాటు చేసేందుకు ఆస్కారం ఇచ్చేంత నియంతృత్వంతో ఆ పార్టీ ఎందుకు ఉంటూ వచ్చింది? ఇవన్నీ కూడా ప్రశ్నలే..!

ఒక్కటి మాత్రం నిజం.. ఏ బలహీనతా లేని చోట, ఏ లొసుగూ కానరాని చోట.. ఏ కుట్ర కూడా అంత ఈజీగా వర్కవుట్ కాదు! క్యాంపు రాజకీయాలకు పేటెంట్ కలిగిఉన్న, మామకే వెన్నుపోటు పొడిచి లేని బలాన్ని ఉన్నట్టుగా ప్రచారంలో పెట్టి మాయ చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. వెన్నుపోటు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన ఛాప్టర్! అయితే, కమ్యూనికేషన్ చాలా ప్రబలంగా తయారై, అబద్ధపు మాటలతో మభ్యపెట్టడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉండే ఈ రోజుల్లో కూడా వెన్నుపోటుకు గురై ముఖ్యమంత్రిగా అధికారాన్ని కోల్పోతున్న ఉద్ధవ్ థాకరే ది ఇంకో ప్రత్యేకమైన ఛాప్టర్!

ప్రాంతీయ పార్టీలకు మాత్రమే అతి తరచుగా ఎదురవుతున్న ఈ రాజకీయ వెన్నుపోట్ల గురించి గ్రేటాంధ్ర సాధికారంగా విశ్లేషిస్తున్న కథనమే CHAPTER ఉద్ధవ్!

భారతీయ జనతా పార్టీకంటె బలమైన హిందూత్వ ఎజెండాతో ఆవిర్భవించిన పార్టీ శివసేన. దాని మూలపురుషుడు బాల్ థాక్రే. పార్టీ మౌలికమైన హిందూత్వ సిద్ధాంతాలు, వాటికోసం ఆ పార్టీ అనుసరించిన పోకడలు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం కాదు. అయితే.. రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత.. దాన్ని స్వయంగా తన కష్టంతో బలోపేతం చేసిన బాల్ థాక్రే.. ఆ పార్టీ ఆదరణను తన అధికారదాహంకోసం వాడుకోదలచుకోలేదు. 

ఒక దశంలో.. దేశ రాజకీయాల్లోనే కీలకంగా వ్యవహరించిన థాక్రే.. సమీకరణాలు సంకీర్ణంగా నడిచిన సమయంలో కూడా.. అధికారం పట్ల అదే నిర్లిప్తత ప్రదర్శించారు. తాను కావాలనుకుంటే.. ప్రధాని పదవి అడగదగిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా.. తాను ఎప్పటికీ కింగ్ మేకర్ గా ఉంటానే తప్ప.. గద్దె ఎక్కబోనని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. అధికారానికి దూరంగానే ఉండిపోయారు. 

ఒక రుషి లాగా.. పార్టీని తనకోసం కాదు మహారాష్ట్ర కోసం మాత్రమే అన్నట్లుగా నడిపిన బాల్ థాక్రే కూడా పుత్ర వాత్సల్యాన్ని అధిగమించలేకపోయారు. శివసేన పార్టీ అంతర్గత ఆధిపత్య పోరు తారస్థాయికి చేరినప్పుడు.. తొలినుంచి తనతో కలసి పనిచేసి పార్టీ నిర్మాణంలో తన తర్వాత ఎంతో కీలకంగా వ్యవహరించిన రాజ్ థాక్రేను ఆయన పక్కన పెట్టారు. పార్టీనుంచి వెలుపలికి వెళ్లేలా పొగపెట్టించారు. పుత్రవాత్సల్యంతో ఉద్ధవ్ థాక్రేకు పార్టీ సారథ్యం అప్పజెప్పారు. ‘అధికారంకోసం కాదు.. శివసేన పార్టీ అనేది మహారాష్ట్ర కోసం’ అనే నైతిక పరిమితి బాల్ థాక్రేతోనే పోయింది. 

ఉద్ధవ్.. కేవలం అధికారం కోసం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. తాను సీఎం అయ్యారు. ఆయనకు కేవలం వారసత్వంగా మాత్రమే పార్టీ పెత్తనం లభించింది. ఆ పార్టీ సారథిగా గానీ, ప్రభుత్వ అధినేతగా గానీ.. తాను తతిమ్మా అందరికంటె సమర్థుడిని అని ఆయన నిరూపించుకోలేకపోయారు. దాదాపు మూడింట రెండొంతుల కంటె ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు శిబిరంలోకి వెళ్లారంటే… ఆయన పార్టీని ఎంత సమర్థంగా నడుపుతున్నారని అనుకోవాలి? ప్రభుత్వం మీద ఏమాత్రం పట్టు కలిగి ఉన్నారని అనుకోవాలి?

సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా.. కేవలం కన్నకొడుకు కావడం ఒక్కటే అర్హతగా.. ప్రాంతీయ పార్టీలను పెట్టిన నేతలు తమ వారసులను సింహాసనాల మీద కూర్చోబెట్టాలని కోరుకోవడం అనేది ఈ దేశంలో అన్నివేళలా ఒకేరీతిగా ఫలితాలు ఇవ్వలేదు. ఇదంతా ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల గురించిన చర్చ! ఎప్పటికైనా సమర్థత మాత్రమే పార్టీని నిలబెడుతుందని, కేవలం వారసత్వం కాదని.. వారసత్వం వలన దక్కే ఆదరణ చాలా పరిమితం మాత్రమే అని చాలా ఉదంతాలు మనకు రుజువు చేశాయి.

దేశంలో ఎన్నో ఉదాహరణలు..

పొరుగున ఉన్న తమిళనాడు సంగతి చూద్దాం. డిఎంకె చాలా గొప్ప విప్లవాత్మకమైన సిద్ధాంతాలు ఆదర్శాలతో ఆవిర్భవించిన పార్టీ. పార్టీని నిష్కామకర్మలాగా నిర్వహించడంలో బాల్ థాక్రే గురించి పైన చెప్పుకున్నట్లే.. పెరియార్ గురించి ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలి. పెరియార్ సిద్ధాంతాలు, ఆయన భావజాలం, పోరాటాలు వాటిలో ఉండగల నైతికానైతికతలు అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. ఆయన పార్టీని ఏవిధంగా నడిపారు అనేదే చూద్దాం. డిఎంకె ద్వారా అధికారాన్ని పెరియార్ ఎన్నడూ ఆశించనేలేదు. 

అన్నాదొరై లాంటి వాళ్లు ఆ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నడిపారు. వారందరూ తమ కుటుంబమే పార్టీ అనుకుని ఉంటే ఏమై ఉండేది.? అసలు కరుణానిధి దాకా అవకాశాలు వచ్చేవేనా అనేది ఇంకో ప్రశ్న. 

ములాయం సింగ్ యాదవ్, దేవెగౌడ వంటి సీనియర్ నాయకుల సారథ్యంలోని ప్రాంతీయ పార్టీలు పతనం అంచుకు చేరుకోవడానికి కూడా ఈ పుత్రవాత్సల్యమే కారణం అంటే అది అతిశయోక్తి కాదు. ఏదో గాలివాటుగా పుత్రరత్నాలు ఓసారి సీఎం పీఠాన్ని అధిష్టించినా.. ఆ తర్వాత.. దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. 

అయితే ఈ సిద్ధాంతం.. దేశవ్యాప్తంగా సార్వజనీనమైనది అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. నవీన్ పట్నాయక్ కేవలం వారసుడిగా మాత్రమే సీఎం పీఠం మీదికి వచ్చారు. కనీసం స్వరాష్ట్రంలోని సొంత ప్రజలతో, సొంత భాష ఒడియాలో అలవోకగా మాట్లాడేంత పట్టు కూడా లేకపోయినా.. తన అద్భుతమైన పరిపాలన సామర్థ్యంతో అసమానమైన ముఖ్యమంత్రిగా దూసుకుపోతున్నారు. ఆ మాటకొస్తే జార్ఖండ్ ముక్తిమోర్చా స్థాపకుడు శిబూసోరెన్ కొడుకు కావడం వల్ల మాత్రమే అధికార పీఠం మీదికి వచ్చినప్పటికీ హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రిగా పట్టును కొనసాగిస్తున్నారు. 

కేవలం ముఖ్యమంత్రుల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం గానీ.. అసమర్థుడైన కొడుకును.. పుత్రవాత్సల్యంతో తనను నమ్మిన ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నించి దారుణంగా భంగపడిన గొప్ప గొప్ప నాయకుల చరిత్రలు మనకు ఎన్నో ఉన్నాయి. తండ్రి ఒకదఫా వారసుడిని ప్రజల మీద రుద్దవచ్చు గానీ.. తర్వాత్తర్వాత వారి రాజకీయ జీవితాలు పూర్తిగా సమాధి అయిపోయిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటివి కోకొల్లలు.

చంద్రబాబు.. పాఠం నేర్పాడు.. పాఠం నేర్వాలి!!

చాప్టర్ ఉద్ధవ్ ఇప్పుడు ఈ రీతిగా ఉత్కంఠభరితంగా సాగడానికి.. చంద్రబాబునాయుడు రాజకీయ ప్రస్థానానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. చాలా తమాషా సంబంధం ఇది. ‘చాప్టర్ ఉద్ధవ్’ అనే రాజకీయ సంక్షోభం ఒక రీతిగా ఇప్పుడు సాగుతున్న తరహాకి చంద్రబాబునాయుడు స్ఫూర్తి ప్రదాత. ఆయన జీవితం నుంచి నేర్చుకున్న పాఠాల్ని అనుసరిస్తూనే.. ఏక్ నాధ్ శిందే ఇవాళ ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు. 

తాను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా సొంత నియోజకవర్గంలో గెలవకలేక పరాభవం పాలైనా సరే.. చేరదీసిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు! భారత రాజకీయాల్లోనే  ఎప్పటికీ అందరూ గుర్తుంచుకోదగిన ఒక చీకటి అధ్యాయాన్ని చంద్రబాబు ఆ వెన్నుపోటుతో రచించారు. 

అతి స్వల్పసంఖ్యలో ఎమ్మెల్యేలతో ఆయన వైస్రాయి ఎపిసోడ్ నడిపారు. పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా తొలుత ఆ శిబిరంలో లేరని కొందరు అంటారు. తెలుగుదేశం పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వెంట ఉన్నారనే విషప్రచారాన్ని తనకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రచారంలోకి పెట్టారు. తెలిసీ తెలియక.. నిజంగానే చాలా మంది చంద్రబాబుతో ఉన్నారేమో అనే భ్రమలో.. క్రాస్ చెక్ చేసుకునే వీలులేక.. చూసివద్దామని వైస్రాయి హోటల్ కు వెళ్లిన వారినందరినీ దాదాపుగా అక్కడ నిర్బంధించారు. ఆ రకంగా నెమ్మదిగా ఆ శిబిరం బలం పెరిగింది. తర్వాత.. రామారావును పదవీచ్యుతుడిని చేసి, చెప్పులు విసిరించి.. అత్యంత హీనమైన నీచమైన ఎపిసోడ్ ల మీదుగా ముఖ్యమంత్రి అయ్యారు. 

ఎమ్మెల్యేలను మాయ చేయడం, మభ్య పెట్టడం తక్కువేమో గానీ.. ఇంచుమించు ఏక్‌నాధ్ శిందే శిబిరం కూడా ఇలాగే వర్ధిల్లుతోంది. ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో కలిసి పాల్గొన్న శిందే.. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో అదృశ్యమై అజ్ఞాతంలోకి వెళ్లేసమయానికి ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య బహుస్వల్పం. అది నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. బాబునేర్పిన పాఠం చదువుకునే శిందే ఇంత సక్సెస్ ఫుల్ గా వెన్నుపోటు పొడవగలిగారని లేదా తిరుగుబాటును సఫలం చేయగలిగారని అనుకోవాలి. 

అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ చాప్టర్ ఉద్ధవ్ నుంచి కొన్ని పాఠాలు చదువుకోవాలి. అసమర్థుడైన కొడుకును బలవంతంగా పార్టీ మీద, ప్రజల మీద, రాష్ట్రమీద రుద్దాలని చూస్తే ఆ పరిణామాలు ఏదో ఒకనాటికి చేదుగా మారక తప్పదు. అది ఉద్ధవ్ నేర్పుతున్న పాఠం. నిజానికి మరీ లోకేష్ అంత స్థాయి పప్పు కింద ఉద్ధవ్ ను జమకట్టాల్సిన పనిలేదు. కానీ.. ఆయన సామర్థ్యం చాలలేదు. తాను అధికారంలో భాగంగా ఉంటూనే తండ్రిలాగా సింహాసనాన్ని మరొకరికి అప్పగించి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కానీ ఆయనే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ తో జట్టు కట్టారు. సీఎం అయ్యారు. ఆ వెంటనే తన వారసుడికి కూడా సీఎం బెర్తు ఖరారు చేసి ఉంచితే మంచిదనే చీప్ (చంద్రబాబు టైప్) వ్యూహంతో కొడుకును కూడా మంత్రిని చేశారు. అంతా తండ్రీ కొడుకులదే  హవా అన్నట్టుగా తయారైంది. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. 

అచ్చంగా చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారు. తాను వెన్నుపోటు ద్వారా దక్కించుకున్న పార్టీకి.. తన రెక్కల కష్టం కాకుండా దోచుకున్న పార్టీకి తన కొడుకును వారసుడిని చేయాలని, కొడుకును తన తర్వాత ముఖ్యమంత్రిని చేయాలని కలగంటున్నారు. ఈ పుత్ర వాత్సల్యమే తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద శాపం. లోకేష్ అంతటి పప్పు నాయకుడు సమకాలీన తెలుగు రాజకీయాల్లో మరొకరు లేరు.

కానీ.. చంద్రబాబుకు మాత్రం లోకేష్ మీద వాత్సల్యం మసకబారలేదు. అదే పార్టీ వినాశనానికి బాటలు తీరుస్తోంది. ఉద్ధవ్ తరహాలోనే చంద్రబాబు ఎక్కడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని తన కొడుకును దొడ్డిదారిలో మంత్రిని చేశారు. అధికారానికి వారసుడిగా పార్టీ మొత్తం ఆమోదించవలసిన తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తూ వస్తున్నారు. కానీ ఈ ‘చాప్టర్ ఉద్ధవ్’తో ఆయన పాఠం నేర్చుకోవాలి. బలవంతంగా తన కొడుకును రుద్దితే.. ఏదో ఒక నాటికి పార్టీ మొత్తం సమాధి అయిపోతుంది. 

తెలంగాణ సంగతి ఏమిటి?

ఇంచుమించుగా ఇదే పుత్రవాత్సల్య పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీకి ఇంకా మొదటి తరమే నడుస్తోంది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే అపురూపమైన వాగ్దానం ద్వారా.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. జనం దృష్టిని చాలా గొప్పగానే ఆకర్షించారు. అలాంటి పనిచేసి ఉంటే గనుక.. పదవీలాలసత లేని ఒక పెరియార్ లాగా ఆయన చరిత్రలో నిలిచినపోయి ఉండేవారు. కానీ.. కేసీఆర్ లో అధికార కాంక్ష… రాష్ట్రం రాగానే ఆయనను నిలువనివ్వలేదు. ప్రజల ఆకాంక్ష పేరిట పగ్గాలు తీనే అందుకున్నారు. అప్పటినుంచి ఇప్పటిదాకా తన కొడుకును వారసుడిగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికే శతథా వ్యూహరచన చేస్తున్నారు. 

ఈ పరిణామాల భవితవ్యం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పనలవి కాని సంగతి. కేటీఆర్ మరీ పప్పు నాయకుడు కాకపోవడం ఆ పార్టీకి ఒక ఎడ్వాంటేజీ. అదే సమయంలో.. ఆయనకు అప్పగిస్తున్న నాయకత్వం సమర్థంగా రుద్దబడుతున్నది కాదు. అంతమాత్రాన.. అచ్చంగా సింహాసనమే ఆయనకు దక్కితే గనుక.. ఏదో ఒక నాటికి ఆ పార్టీలో ముసలం పుట్టకూడదనే గ్యారంటీ కూడా లేదు. 

అందుకే జగన్ సేఫ్..

ఏపీ రాజకీయాలను కూడా ప్రత్యేకంగా ఈ ‘ఛాప్టర్ ఉద్ధవ్’ కింద ప్రస్తావించుకోవాల్సిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, జననేత వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడే గానీ.. అధికారాన్ని కేవలం వారసత్వం ద్వారా దక్కించుకున్న నాయకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వైఎస్ఆర్ కు ఉన్న అపురూపమైన జనాదరణ కొంతవరకు జగన్‌కు ఎడ్వాంటేజీ అయి ఉండొచ్చు. కానీ.. ఆ ఆదరణ వల్లనే సీఎం అయ్యారని అంటే తప్పు. 

ఎందుకంటే.. కేవలం ఆ ఆదరణే ఆయనను సీఎం చేసేట్లయితే గనుక.. 2014లోనే అయి ఉండాలి. అలా జరగలేదు. పైగా వైఎస్ఆర్ జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు రాష్ట్ర నాయకుడు. జగన్ సొంతంగా తానే ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి.. తండ్రి ద్వారా దక్కిన ఆదరణకు తన రెక్కల కష్టాన్ని జోడించి.. ఒక వైఫల్యం తర్వాత.. ప్రజల నమ్మకాన్ని చూరగొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి. అందుకే.. ఈ ‘చాప్టర్ ఉద్ధవ్’ సిద్ధాంతం జగన్ కు వర్తించదు. ఆయన పరిస్థితి సేఫ్ గానే కనిపిస్తుంది. 

వెన్నుపోటు అనే ఒకే ఒక్క పదంతో అన్ని వైఫల్యాలను కప్పెట్టుకోవడం అంత ఈజీ కాదు. చంద్రబాబుకంటె ముందు నాదెండ్ల వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా అందుకు అనుగుణంగా రామారావు పాలనలో ప్రదర్శించిన నిర్లక్ష్యం, అపరిపక్వత కారణాలనే వాదన కూడా ఉంది. వారసత్వం అనేది కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. కానీ దక్కిన దానిని నిలబెట్టుకోవడం అనేది కేవలం.. సమర్థత వలన మాత్రమే సాధ్యమవుతుంది. అదే ‘చాప్టర్ ఉద్ధవ్’ మౌలిక నీతి!!

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?