Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఫెయిల్యూర్‌లకు కేరాఫ్ అడ్రస్: ఆత్మ లేని సినిమా

ఫెయిల్యూర్‌లకు కేరాఫ్ అడ్రస్: ఆత్మ లేని సినిమా

ఒక సినిమా ఘన విజయం సాధించాలంటే, గొప్ప సినిమాగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా స్థానం నిలబెట్టుకోవాలంటే అందుకు ఏం కావాలి? అత్యంత ఆధునిక సాంకేతిక హంగు ఆర్భాటాలు, అతిపెద్ద రెమ్యూనరేషన్ తీసుకునే నటులు, దర్శకులు సరిపోతాయా? వీటన్నింటితో పాటు ఒక మంచి కథ కూడా ఉండాలి! 

ఇంతవరకు సరిపోతుందా.. అంటే కుదరదు. ఆ కథలో ఉండే ‘ఆత్మ’ చెడిపోకుండా దానిని వెండితెర మాధ్యమంలో చెప్పగలగాలి. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లోపం అదే. సినిమాలోని ఆత్మను మిస్ చేస్తున్నారు. ఇతర హంగు ఆర్భాటాల మీదనే దృష్టి పెడుతున్నారు. ఇది పరిశ్రమ పతనానికి కాక మరెక్కడికి దారితీస్తుంది? 

అన్ని పరిశ్రమలకు వర్తించేదే అయినా, టాలీవుడ్‌లో ప్రబలంగా కనిపిస్తున్న పోకడ ఇది. గ్రేటెస్ట్ ఫెయిల్యూర్స్, అన్ ప్రిడిక్టబుల్ గ్రేటెస్ట్ హిట్స్‌ను జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే సంగతి ఇది. సినిమా ఇండస్ట్రీలో మారవలసిన పోకడల గురించి ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఆత్మ లేని సినిమా’!

సినిమా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు చాలా తరచుగా ఒక మాట చెబుతూ ఉండేవారు. ‘కథ చూసి- ఈ సినిమా హిట్టవుతుంది, ఈ సినిమా ఫ్లాపవుతుంది.. అని తేల్చి చెప్పగల మేధావులు, జ్యోతిష్యులు ఎవరైనా ఉంటే వారికే నాలుగైదు కోట్లు ఇచ్చేద్దాం.. ఆ ఫలితమైతే గ్యారంటీ కదా’ అంటుండేవాళ్లు. 

ఆ మాట నిజమే. ఒక సినిమా సక్సెస్ అవుతుందా లేదా? అనే సంగతి ఏ దశలో చెప్పడం సాధ్యం అవుతుంది? ఈ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. స్క్రిప్టు చూసి, కథ లైను విని ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పడం కేవలం ఒక ఆశ మాత్రమే. 

ఎందుకంటే.. సినిమా అనేది ఒక టీమ్ వర్క్. 24 క్రాఫ్ట్ లను సరైన తూకంతో మేళవిస్తేనే అది సినిమా అనిపించుకుంటుంది. కథ– స్క్రిప్టు బాగుండడం అనేది కేవలం ఒక క్రాఫ్టు మాత్రమే. మిగిలిన అన్నీ అంతే చక్కగా కుదరాలి. కుదిరితేనే అది సక్సెస్ అయ్యే సినిమా. సినిమా కథ అనుకున్న తర్వాత అన్నీ బాగున్నాయి అని డిసైడైన తర్వాతే ప్రారంభిస్తారు. కానీ మేకింగ్ ప్రయాణం మార్గమధ్యంలో గాడితప్పుతుంది. అందుకు నిర్దిష్టమైన కారణాలను పేర్కొనడం అసాధ్యం. ఆ 24 క్రాఫ్టుల్లో ఎంతో కీలకం అయిన ఎవరో ఒకరికి ఆ ప్రాజెక్టు మీద శ్రద్ధ పోతుంది. చాలు ఆ సినిమాలోని ఆత్మ చచ్చిపోవడానికి. నెమ్మదిగా ఆ సినిమా పతనం వైపు జారిపోతుంది. 

హీరో గోపీచంద్ రీసెంట్ గా కూడా ఒక మాట చెప్పారు. సినిమా మేకింగ్ లో ఉండగానే.. దాని ఫలితం ఆ టీమ్ కు అర్థమైపోతుంది. కానీ అప్పటికి వాళ్లు ఇక ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. అంతదూరం వచ్చేస్తారు. ఒకరకంగా ప్రతిసినిమా కూడా ఒక రకమైన పులిసవారీ లాంటిదే. మొదలెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే. మధ్యలో తప్పుకోవడానికి వీలుండని స్థితి. అలా టీమ్ లోని వాళ్లు ప్రాజెక్టుతో మమేకం కాకుండా చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడం అసాధ్యం. 

పెద్ద చిన్న వర్గీకరణలు కరెక్టు కాదు

భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు అనే కొలబద్ధ కేవలం తయారీకి ఎంత ఖర్చు పెడుతున్నారనదానికి మాత్రమే పరిమితం. పెట్టిన ఖర్చుకు తగ్గట్టుగానే వాటి సక్సెస్ ఎప్పటికీ ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. 

ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు సాధిస్తున్న పరాజయాలను గమనిస్తే.. ఆ సినిమా మేకర్స్ మీద అసహ్యం, నిర్మాతల మీద జాలి జమిలిగా కలుగుతాయి! సినిమా బడ్జెట్ ఎందుకు పెరుగుతుందో తెలియదు. భారీ బడ్జెట్ తీస్తేనే తాము మంచి దర్శకులం అవుతామనే భ్రమలో చాలా మంది బతుకుతుండడం ఇందుకు ఒక కారణం. 

పదుల, వందల కోట్ల బడ్జెట్ అని చెప్పుకోవడం కోసమే అవసరంతో నిమిత్తం లేకుండా, కథ న్యాయం చేసే జడ్జిమెంట్ తో కాకుండద సినిమాలు చేస్తున్న ఒక వర్గం తయారవుతున్నారు. అదే సమయంలో, మరో వర్గం అసలు ఎలాంటి బడ్జెట్ లేకపోయినా.. వాస్తవ జీవిత చిత్రణలే ప్రధానంగా ఎంచుకుంటూ.. అదే బాటలో ఉంటూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. కానీ ఆ విజయాలు ఎవ్వరికీ కనిపించవు. వారి మార్గాన్ని ఎవ్వరూ అనుసరించరు. 

ఎందుకంటే పెద్ద బడ్జెట్‌తో తీస్తే తప్ప తాము పెద్ద దర్శకులు అనిపించుకోలేం అనే భ్రమ. అదే సమయంలో ఇంకో చిన్న బడ్జెట్ తో మంచి సినిమాలు చేసిన దర్శకులు కూడా రెండో ప్రయత్నం వచ్చేసరికి తమ పంథా మార్చుకోవడం. పెద్ద బడ్జెట్ కోసం వెంపర్లాడడం. అలా అయితే మాత్రమే తమకు కూడా ‘గొప్ప’ గుర్తింపు వస్తుందనే భ్రమలో కొట్టుమిట్టాడడం.

వాతలు పెట్టుకుంటున్న నక్కలు

పులిని చూసి వాతలు పెట్టుకునే నక్క ఎంత కాలం ఆ ఇమేజిని కాపాడుకోగలుగుతుంది. గట్టిగా ఒక దెబ్బ తగిలిందంటే కుయ్యో మని అరవాల్సిందే తప్ప, గాండ్రించడం సాధ్యం కాదు. సినిమా ఇండస్ట్రీలో కూడా పులిని చూసి వాతలు పెట్టుకునే నక్కలు మనకు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ అనేది సక్సెస్ వెనకంబడి పరుగెత్తుతూ ఉంటుంది. 

ఉదాహరణకు ఇతర భాషల్లో ఏదైనా సినిమా హిట్ కొడితే దాని హక్కులు కొనడానికి కోట్లు పెట్టి ఎగబడే నిర్మాతలు, సొంతంగా సినిమా చేయడానికి సంవత్సరాల తరబడి మేధోమధనం చేస్తారు. ఒక దెయ్యాల సినిమా హిట్ అయిందంటే.. ఆ వరుసలో పదీఇరవై దెయ్యాల సినిమాలు తయారవుతాయి. దెయ్యాల సినిమాలు ఆడుతాయి.. అనే నమ్మకంతో తీస్తారు తప్పితే.. ఆ కథలో ఏముందో పట్టించుకోరు. 

ఎందుకంటే.. బేసిగ్గా మన నిర్మాతల్లో చాలా మందికి కథను, దర్శకుడి సామర్థ్యాన్ని, మేకింగ్ తీరును ‘జడ్జ్’ చేయగల శక్తి ఉండదు. వారికి సినిమాను అంచనా వేయడం చేతకాదు. చాలా మంది సీరియస్ నిర్మాతలు కారు. కొంతమందైతే ఎవరివో డబ్బులకు బినామీలుగా వ్యవహరించేవారు, అయాచితంగా వచ్చిన సొమ్ములతో ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుని సినీ నిర్మాణంలోకి వచ్చేవారు ఉంటారు. వాళ్లందరూ కూడా గుడ్డిగా ఫాలో అవుతారే తప్ప.. సరైన సినిమా ఎప్పటికీ చేయలేరు. గాలివాటుగా వారికి కూడా కొన్ని విజయాలు దక్కుతాయి. కానీ ఆ విజయాలకు నిలకడ ఉండదు గాక ఉండదు. 

సీక్వెల్, టూ పార్ట్స్ దారుణాలు

సీక్వెల్ రూపంలో చేసే సినిమాలది కూడా ఇలాంటి గొడవే. ఎవరో ఒక సినిమాను రెండు భాగాలుగా చేసి సక్సెస్ సాధించాడని తెలియగానే.. ఇక ఆ ఊపులో తమ వద్ద ఉండే కథలను రెండు సినిమాలుగా మార్చి రాసుకోవడానికి ఉత్సాహపడే వంకరబుద్ధుల దర్శకులు కూడా తయారవుతుండడం ఇక్కడ గమనించాలి. ఒక సినిమా సక్సెస్ అయితే ఆ క్రేజ్ ను మళ్లీ క్యాష్ చేసుకోవడానికి సీక్వెల్ చేయడం నిన్నటి పద్ధతి. ఇలాంటి ప్రయోగాలు కూడా అరుదుగా తప్ప విజయం సాధించలేదు. 

చంద్రముఖి లాంటి హిట్ తర్వాత నాగవల్లి లాంటి పేలవమైన సినిమా సీక్వెల్ గా వచ్చి ప్రేక్షకులను బురిడీ కొట్టించిన సంగతి అందరికీ గుర్తుంటుంది.

ఇవాళ్టి తరంలో దర్శకులు ట్రెండ్ మార్చారు. ఒక సినిమా సక్సెస్ సాధించిన తర్వాత.. దానికి సీక్వెల్ రూపంలో బురిడీకొట్టించేంత ఓపిక వారికి ఉండడం లేదు. ఒక సినిమాకు భారీగా హైప్ క్రియేట్ చేసి, దానినే రెండు భాగాలుగా మార్చి వండడం వారికి సులువుగా కనిపిస్తోంది. కథను పొందికగా చెప్పడం అనేది ఒక పద్ధతి. అందులో ఒక అందం ఉంటుంది. అది ప్రేక్షకులను రంజింపజేస్తుంది. అలాకాకుండా అనవసరమైన పార్ట్ టూలకు వెళ్లే వాళ్లు తయారవుతున్నారు. 

ఎగ్జాంపుల్ కోసం ఓ ముచ్చట చెప్పుకుందాం..  ఓ దర్శకుడు ఉన్నాడు. పెద్ద హీరోతో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఫర్ సప్పోజ్ వంద కోట్ల బడ్జెట్ చెప్పాడు.. నిర్మాత ఒప్పుకున్నాడు. తీరా తీత మొదలెట్టిన తర్వాత.. బడ్జెట్ 300 కోట్లదాకా వెళ్లిపోయింది.. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఎందుకంటే.. షూటింగ్ మీద అతనికి కంట్రోల్ ఉండదు. దీనిని రెండు భాగాలుగా మార్చేద్దాం అని దర్శకుడు నిర్మాతకు సలహా ఇచ్చాడు. ఇంకో వంద కోట్లు తగలేస్తే నాలుగొందలకు రెండు సినిమాలు అనే భ్రమలో పెట్టాడు. 

నిర్మాతను సహజంగా ఆశ నడిపిస్తుంది గనుక.. ఒప్పుకున్నాడు. అలాంటి సినిమా చేస్తే ఆర్థికంగా లాభపడ్డాడా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ ఆ సినిమా పొందికగా ఉంటుందా.. సాగతీతగా ఉంటుందా? అనేది ముఖ్యం. రెండు గంటల కథను తయారుచేసుకుని, బడ్జెట్ ను అదుపులో ఉంచుకోవడం చేతకాక దానిని అయిదుగంటలకు సరిపడా రెండు సినిమాలుగా కొన్ని జోడింపు సీన్లతో వండి వార్చడం అనేది అసహ్యమైన విద్య. ఇప్పుడు చాలా మంది ఆశ్రయిస్తున్న మార్గం. ఒకటిగా ప్రకటించి.. మొదలెట్టి.. ఆ తర్వాత మార్గమధ్యంలో రెండు భాగాలుగా మారిపోతున్న దరిద్రాలు చాలానే ఉంటున్నాయి. 

వంచనాత్మకమైన సినిమాలు

సినిమా పరిశ్రమ అంటేనే అక్కడ చాలా రకాల అబద్ధాలు రాజ్యమేలుతుంటాయి. కథలో ఉండే కొత్తదనం గురించి, సినిమా బడ్జెట్ గురించి, అది పూర్తయిన నాణ్యత గురించి చెప్పేవాటిలో 90శాతం అబద్ధాలు. సినిమా ప్రిరిలీజ్ వేడుకల్లో ఒకరిగురించి మరొకరు చేసుకునే భజనల్లో దాదాపు నూరుశాతం అబద్ధాలే. ప్రేక్షకులను మోసగించడానికి చెప్పే అబద్ధాలు ఇవన్నీ! బడ్జెట్ గురించి చెప్పే అబద్ధాలన్నీ బయ్యర్ల ను మోసం చేయడానికి!

ఈ అబద్ధాలన్నీ ఒక ఎత్తు అయితే సినిమా సర్వనాశనం అయిపోవడంలో రెండు రకాల వంచనలు కీలక భూమిక పోషిస్తుంటాయి. ఒకటి దర్శకుడు నిర్మాతను వంచించడం. రెండోది దర్శకుడు, నిర్మాత కలిసి ప్రేక్షకులను వంచించడం. కథను నిర్మాతకు చెప్పినప్పుడు దర్శకుడు పదికోట్ల బడ్జెట్ చెప్పాడనుకుందాం. దానిని ఇరవైకోట్ల వరకు పెంచినా పర్లేదు. కొన్ని ఖర్చులు దిగిన తర్వాత గానీ తెలియవని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఆ బడ్జెట్ ను యాభై కోట్లకు వందకోట్లకు పెంచేస్తే ఏం అనుకోవాలి. కేవలం దర్శకుడి అసమర్థతి అని జాలిపడ్డానికి వీల్లేదు. కేవలం అది మరింత మెరుగైన ప్రాడక్ట్ తీసుకురావడానికి దర్శకుడి తపన అని ఆత్మవంచన చేసుకోవడానికి కూడా వీల్లేదు. అది ఖచ్చితంగా నిర్మాతను వంచించడం మాత్రమే. 

ఇక దర్శకుడు, నిర్మాత ఇద్దరూ కలిసి ప్రేక్షకులను వంచించడం అనేది రెండో సంగతి. కథలో ఏదో జరిగిపోతున్నట్టుగా విదేశీ షూటింగుల పేరుతో నడిపించడం బడ్జెట్ వందల కోట్లలోకి పెరిగిపోయినట్టుగా టముకు వేసుకోవడం. చిల్లరగా అత్యంత స్వల్ప ఖర్చుతో గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ తో సగం సినిమాను నడిపించేయడం.. కంప్యూటరులో కొన్ని చవకబారు గ్రాఫిక్స్ అతికించి.. వందల కోట్లు ఖర్చు అయినట్టుగా అబద్ధాలు చెప్పి ప్రేక్షకులను వంచించి.. మొదటిరోజు టికెట్ కొనేలా ప్రేరేపించడం.

ఇలాంటి వంచనలు మొదటిరోజుకు మాత్రమే పనిచేస్తాయి. తరవాత తుస్సుమంటాయి. పేర్లు చెప్పుకోకపోయినా ఇలాంటి వంచనలకు ఉదాహరణలుగా నిలిచేసినిమాలు మనకు తటాల్న మనసులో మెదలుతాయి. ఇంకా ఘోరం ఏంటంటే.. అత్యంత హేయమైన గ్రాఫిక్స్ పనితనంతో సినిమాలు చేస్తూ.. తాము మహాద్భుతాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వాలను కూడా వంచించి బురిడీ కొట్టించి.. టికెట్ విక్రయాలకు రాయితీలు సంపాదించడం. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా సినిమాలోని ఆత్మను చంపేస్తాయి. 

‘ప్రేక్షకుడిని మనం మోసం చేయగలం’ అనే ధీమా దర్శకుడికి ఏర్పడితే అది అతడి సర్వనాశనానికి పునాది. మోసం ఒకసారి నడుస్తుంది. మళ్లీ మళ్లీ అదే మోసం చేస్తే జనం ఛీత్కరించుకుంటారు.

సినిమాలో ఆత్మ అంటే ఏమిటి..

పెద్దఖర్చు గానీ, వంచన గానీ లేకుండానే కొన్ని సినిమాలు అత్యద్భుతంగా ఆడుతున్నాయి. ఎలా? నిన్న- కేరాఫ్ కంచెరపాళెం ఎలా ఆడింది? ఇవాళ బలగం ఎలా అందరినీ రంజింపజేస్తోంది. ఖర్చు ఓ మోస్తరు ఉన్నప్పటికీ విరూపాక్ష కూడా ఎలా సక్సెస్ కాగలిగింది? ఇవన్నీ లోతుగా పరిశీలించాల్సిన అంశాలు. 

‘సినిమా అంటే ఎమోషన్’ అనే సంగతిని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఖర్మం ఏంటంటే.. ఈ సంగతి తెలియకుండా ‘సినిమా అంటే ఫార్ములా’ అని నమ్మే అపరిపక్వ అజ్ఞానులు టాలీవుడ్‌లో మేకర్లుగా కూడా చెలామణీ అయిపోతున్నారు. సినిమా అంటే ఫార్ములా అని నమ్మే వాళ్లు కథను వంట వండినట్టే వండడం ప్రారంభిస్తారు. కామెడీని, యాక్షన్, సెంటిమెంట్లను ఉప్పూ మసాలా కలిపినట్టుగా కలుపుతారు. ఎప్పుడైనా క్లిక్ కావొచ్చు. కానీ ఆ వంట చాలా సందర్భాలలో సినిమా పతనానికి దారితీస్తూ ఉంటుంది. 

సినిమా అంటే ఎమోషన్ అని నమ్మడం ముఖ్యం. ఎమోషన్ అంటే ఏడిపించడం అనుకుంటే భ్రమ. అది కేవలం ఒక భావోద్వేగం. నవరసాల్లో ఏదైనా సరే సినిమాను కీలకంగా నడిపించే ఎమోషన్ కావొచ్చు. 

దర్శకుడు ముందు ఆ ఎమోషన్ ను నమ్మాలి. కథలోని ప్రతి సన్నివేశాన్ని ఆ ఎమోషన్ చుట్టూతానే వండుకోవాలి. బలగం లాంటి చిన్న సినిమా.. అత్యంత చిన్న సింపుల్ పాయింట్ ను చర్చించి ఇవాళ అందరిచేత వేనోళ్ల పొగిడించుకుంటున్నదంటే కారణం అదే. కామెడీ, యాక్షన్ సినిమాలు కూడా కావొచ్చు గాక.. కానీ.. ఎమోషన్ ను సస్టెయిన్ చేసే సినిమాలుగా రూపుదిద్దాలి. 

ఆ ఎమోషన్ అనేది సినిమాకు ఆత్మ. ఆ ఆత్మను కాపాడే ఓపిక ఇప్పుడు దర్శకులకు ఉండడం లేదు. ఆత్మను చంపేసే ప్రయత్నాలతో దూసుకుపోయేవాళ్లే అంతా! ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు.. బహుశా సినిమాలు అనవసరమైన బడ్జెట్ ఎత్తులకు వెళ్లవు. అదొక్కటే కాదు.. ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను రంజింపజేసే విధంగానే సాగుతుంది. 

..ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?