Advertisement

Advertisement


Home > Politics - Opinion

'అంతా జగన్ మహిమ' అనేసిన రామోజీ

'అంతా జగన్ మహిమ' అనేసిన రామోజీ

వై.ఎస్.ఆర్ బతికున్న రోజుల్లో ఉండవల్లి మొదలుపెట్టిన మార్గదర్శిపై యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూ కొలిక్కొస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లు కొనసాగటానికి గల కారణం వై.ఎస్.ఆర్ మరణం, రాష్ట్రం చీలడం, తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రావడం, అటు పిదప వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చాలా కాలంగా దీనిపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాల చేత ఉండవల్లి ఒంటరి పోరాటం కొండని ఢీకొడుతున్న పొట్టేలులాగ ఉండేది. 

అయితే సడన్ గా ఈమధ్య ఆ కొండ మీద డైనమైట్ పేలిన శబ్దం వినపడింది. అది జగన్ మోహన్ రెడ్డి పేల్చిన డైనమైట్. ఎప్పుడైతే ఆ.ప్ర ప్రభుత్వం మార్గదర్శి అవకతవకలపై సి.ఐ.డి విచారణ వేసిందో కొండ మీద ప్రకంపనలు మొదలయ్యాయి. అంత పెద్ద రామోజీరావు కాస్తా నడుముకి బెల్టు పెట్టుకుని మంచమెక్కి కూర్చునే సీ.ఐ.డి అధికారులతో మాట్లాడారు. 

అలా మాట్లాడుతూ, "ఈ పరిస్థితి నాకెప్పుడూ రాలేదు...బహుశా ఇది కాలమహిమో, జగన్ మహిమో కావొచ్చు" అని నిట్టూర్చారు. ఆ వీడియో వైరలవుతోంది. అంతే కాదు, తనకి ఒంట్లో బాలేదని, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని, కనుక విచారణకి సహకరించలేనని అధికారులకి చెప్పారు. "పర్లేదు సర్! టైం తీసుకోండి..కూర్చుంటాం" అనంటే, "డు యు వాంట్ టు కిల్ మీ. నాకు హార్ట్ పాల్పిటేషన్స్ వస్తున్నాయి" అన్నారు. ఇది హాస్యాస్పదంగా లేదు? రామోజీ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటా ఇది? "ఏం విచారిస్తారొ విచారించండి..." అని ధైర్యంగా అనొచ్చు కదా! 

జగన్ ప్రభుత్వం డైనమైట్ పేల్చడంతో ఉండవల్లికి జవసత్వాలు మరింత పెరిగాయి. రోజుకొక ప్రెస్మీటుతో, ప్రసంగంతో అరటిపండు ఒలిచి పెడుతున్నట్టు మార్గదర్శి కేసులోని లొసుగుల్ని ఆసక్తికరంగా చెప్తున్నారు. 

ఆశ్చర్యమేంటంటే చంద్రబాబు, జగన్, కమ్యూనిష్టులు, బీజేపీ వాళ్లు..ఇలా ఎవ్వరూ మార్గదర్శి ఇష్యూ గురించి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. పైగా నాగబాబు లాంటి కుహనామేధావి రామోజీ మీదకి సి.ఐ.డి పోలీసులు వెళ్లడం మహాపాపం అన్నట్టుగా పెద్ద ట్వీటు పెట్టాడు. అది జబర్దస్త్ కన్నా పెద్ద కామెడీ అయి కూర్చుంది. 

అసలీ వ్యవహారాన్ని కొందరి చూస్తున్నట్టు రామోజీపై యుద్ధం, కమ్మవాడిపై కత్తికట్టడం, తెదేపా రాజగురువుపై సమరశంఖం అన్న యాంగిల్లో చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఉండవల్లి పదే పదే చెప్తున్నది ఒక్కటే..తనకి రామోజీని జైలుకి పంపాలని ఏ మాత్రం లేదని, కేవలం ఆయన చేసింది తప్పని చెబితే చాలని, మళ్లీ ఇలాంటి ఆర్ధికనేరాలు మరొకరు చేయకుండా లీగల్ ప్రిసిడెన్స్ సెట్ చెయ్యాలన్నది ఆయన లక్ష్యమని చెప్తున్నారు. అందులో తప్పేముంది? 

మాజీ ఎంపీ అంటే సామాన్యుడే. ఒక సామాన్యుడి పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా వచ్చింది. ఉండవల్లికి, జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి రాజకీయసత్సంబంధాలూ లేవు. మొన్నటి వరకు జగన్ ని విబేధిస్తూ అనేకమైన ప్రెస్మీట్లు కూడా పెట్టాడీయన. అయినా, ఒక్క మార్గదర్శి కేసు విషయంలో మాత్రమే ఉండవల్లి, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మాట మీదున్నాయి. నిజానికి వీళ్లు తప్ప ప్రస్తుతం మార్గదర్శి విషయంలో తల పెట్టినవాళ్ళు ఎవ్వరూ లేరు. 

ఎ.పి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం తమరు చేసింది తప్పు కదా అని కోర్టు అడిగితే, ఆ యాక్ట్ కి తమకు సంబంధం లేదని చెప్పారట రామోజీ. అదేంటి అంటే తాము చిట్ ఫండ్ వ్యాపారాన్ని కంపెనీస్ యాక్ట్ కి లోబడి చేస్తున్నామని చెప్పారట. కంపెనీ యాక్ట్ తో చిట్ ఫండ్ వ్యాపారం చేయడమేంటని అడిగితే అదంతే అంటున్నారు. మరి ఈ విషయంలో దేశ ప్రజలకి క్లారిటీ రావాలా వద్దా? అలా కూడా చేయొచ్చంటే అది అందరికీ వర్తిస్తుందా లేక రామోజీరావుకొక్కడికేనా అనేది ఉండవల్లి ప్రశ్న. 

అసలిది కమ్యూనిష్టుల సబ్జెక్ట్. వాళ్లు నోరెత్తాలి. కానీ ఎత్తరు. ఎందుకు? పేరుకే కమ్యూనిష్టులు తప్ప వాళ్లు క్యాపిటలిష్టులైపోయి చాలా కాలమయ్యింది. 

ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టారు ఉండవల్లి. 2012 లో సుప్రీం కోర్టులో ఒక అఫిడఫిట్ వేసారట రామోజీ వర్గం లాయర్లు. అందులో ఉన్నదేంటంటే 3000 కోట్లు డిపాజిటర్లకు వెనక్కి చెల్లించేసామని ఉందట. 

మళ్లీ 2018లో హైకోర్టులో మరొక అఫిడవిట్ వేసారట. అందులో 2500 కోట్లు చెల్లించామని ఉందట. 

అంటే ఆ బ్యాలెన్స్ రూ 500 కోట్లు ఏమైనట్టు? 

అప్పుడొక లెక్క, తర్వాతొక లెక్క చెబితే ఏది నిజమనుకోవాలి? 

కోర్టుకి ఏదైనా సమర్పిస్తున్నపుడు చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు లాయర్లు కూడా చెక్ చేస్తారు. గతంలో కోర్టుకు చెప్పిందాంతో క్లాష్ అవకూడదని జాగ్రత్త పడతారు. కానీ లాయర్లు కూడా దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదంటే న్యాయస్థానం కంటే రామోజీరావు పలుకుబడి మీదే వాళ్లకి నమ్మకం ఎక్కువనుకోవాలి. రామోజీ కేసంటే వివరాలేవీ అవసరంలేకుండానే పాజిటివ్ గా తీర్పొచ్చేస్తుందన్న విశ్వాసం బలంగా ఉండుండాలి. లేకపోతే ఇలా సిల్లీ మిస్టేక్ చెయ్యరు కదా!

ఇప్పుడా తప్పులే రామోజీని కార్నర్ చేస్తున్నాయి. అసలే చేసింది తప్పు. దానికి తోడు లాయర్ల విషయాన్ని లైట్ గా తీసుకున్న నిర్వాకం. మరొక పక్కన బిగుస్కుంటున్న ఉండవల్లి, జగన్ మోహన్ రెడ్డిల పెడికిళ్లు. అందుకే రామోజీలో బెదురు బాగా కనిపిస్తోంది. తనకు 87 ఏళ్లని, ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదని, అంతా జగన్ మహిమ అని చెప్తున్నాడంటే "ఆయ్యో" అనాలో.."హహహా" అని నవ్వాలో అర్ధం కాని పరిస్థితి. 

ఎందుకంటే తాజాగా ఉండవల్లి మరొక విషయాన్ని వెల్లడించారు. అప్పుడెప్పుడో ఒకసారి రామోజీరావుని అనధికారిక చిట్ ఫండ్ వ్యాపారం నడుపుతున్న కారణంగా నాలుగు రోజులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లాకప్పులో వేసారట. ఆ తర్వాతే మార్గదర్శిని రిజిష్టర్ చేసారని, అటు పిమ్మట ఈనాడు పేపర్ పెట్టారని చరిత్ర రాయని ఒక విషయాన్ని చెప్పారు. 

అంటే మరి రామోజీ పెర్కున్న "ఈ పరిస్థితి" అప్పుడెప్పుడో ఒకసారి వచ్చినట్టేగా...పోలీసుల్ని, లాకప్పుని చూసిన అనుభవం ఆయనకున్నట్టేగా! 

సరే ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా ఒక వర్గానికి నచ్చదు. అందుకే ముక్తాయింపుగా ఒకటే మాట-  న్యాయం గెలవాలి. అది ఎవరి వైపున ఉన్నాసరే. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?