సినిమా హిట్ అయితే వందల కోట్లలో, ఫట్ అయినా.. పదుల కోట్లలో అయితే గ్యారెంటీ! ఏతావాతా.. సినిమా తారల పారితోషికాలు తారా స్థాయిలో కొనసాగుతున్నాయి. హిందీ సినిమా అని చూసినా, తమిళం, తెలుగు ఇలా చూసినా.. ఎటు చూసినా తారల రెమ్యూనిరేషన్లు అయితే తారా స్థాయిలోనే ఉన్నాయి.
రజనీకాంత్ కు సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. అయినప్పటికీ ఆ హీరో తన ఫ్లాప్ సినిమాలకు కూడా మంచి రెమ్యూనిరేషన్ పొందాడు. ఇక తాజాగా జైలర్ సూపర్ హిట్ కావడంతో రజనీకి లాభాల్లో వాటా కూడా లభించిందని తెలుస్తోంది. ముందుగా ఇచ్చిన పారితోషికం కాకుండా, లాభాల్లో వాటా అనే క్లాజు కింద జైలర్ కు గానూ రజనీకాంత్ కు వంద కోట్ల రూపాయల పై పారితోషికమే అందిందని ట్రేడ్ టాక్!
ఒక సినిమా హిట్ అయితే ఇప్పుడు రజనీకాంత్ కు దక్కిన రెమ్యూనిరేషన్ ఏకంగా వంద కోట్లట! ఇక చిరంజీవి పారితోషికం హిట్టూ, ఫ్లాప్ తో సంబంధం లేకుండా 50 నుంచి అరవై కోట్ల రూపాయల వరకూ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన చిరంజీవి సినిమా భోళా శంకర్ డిజాస్టర్ గా నిలిచినా.. ఆ సినిమాతో చిరంజీవి సుమారు 50 నుంచి అరవై కోట్ల రూపాయల వరకూ సంపాదించుకున్నారనే టాక్ ఉంది.
ఇక తను ఒక రోజు పని చేస్తే రెండు కోట్ల రూపాయలు సంపాదించుకుంటానంటూ పవన్ కల్యాణ్ రాజకీయ ప్రసంగంలో చెప్పుకొచ్చాడు. మరి ఐటీ శాఖ పవన్ మీద దృష్టి పెట్టాలి! రోజుకు రెండు కోట్ల రూపాయలు సంపాదించుకునే పవన్ ఆ మేరకు ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారో లేదో ఐటీ శాఖ చూడాలి!
ఇక హీరోల పారితోషికం వంద కోట్లు, యాభై కోట్లు అంటుంటే.. హీరోయిన్లు ఆ స్థాయిలో లేకపోయినా పెద్దగా చిన్నబోవడం లేదు. జవాన్ సినిమాకు గానూ నయనతార ఏకంగా 11 కోట్ల రూపాయల పారితోషికం పొందిందట. ఇలా టాప్ రేంజ్ రెమ్యూనిరేషన్ పొందుతున్న హీరోయిన్ల జాబితాలో నయనతార ముందు వరసలో ఉంది!
వీరు అనే కాదు.. ఏ సినిమా సంగతిని చూసుకున్నా.. ఇప్పుడు తార పారితోషికాలు అనేవి కళ్లు చెదిరే స్థాయిలో ఉన్నాయి. గ్లామరస్ అనుకుంటున్న ఐటీ ఉద్యోగాల్లో కట్టే ట్యాక్సులతో కలిపి.. ఒక ఉద్యోగి కోటి రూపాయల మొత్తాన్ని జమ చేయాలంటే.. కనీసం మూడు నాలుగు సంవత్సరాలకు పైనే వెచ్చించాలి. అయితే సినీ గ్లామర్ మాత్రం తిరుగులేని స్థాయిలో ఉంది. ఒక్క సినిమా సక్సెస్ అయితే హీరోలు రెండో సినిమాకు పది కోట్ల పారితోషికం, ఆ సినిమా హిట్ అయితే 15 కోట్లు.. ఇలా కోట్లకు కోట్ల మీద పెంచుకుంటూ పోతున్నారు!
మరి ఇంత చేసినా సినిమా రంగంలో సక్సెస్ రేటు కేవలం నాలుగైదు శాతమే! నూటికి నాలుగైదు సినిమాలు కూడా పెట్టిన డబ్బులకు మించిన వసూళ్లను సాధించవు. ఇది బహిరంగ రహస్యమే. నూటికి 95 సినిమాలు నిర్మాతలు, లేదా డిస్ట్రిబ్యూటర్లను నష్టాలనే మిగులుస్తున్నాయి. ఆఖరికి ఈ సినిమాలను కొన్న ఓటీటీ సంస్థలు కూడా దెబ్బతింటున్నాయి! అయినప్పటికీ సినీ వ్యాపారం మాత్రం వర్ధిల్లుతోంది.
నాలుగైదు శాతం సక్సెస్ రేటుతో కూడా ఎప్పటికప్పుడు తన స్థాయిన వందల కోట్ల మేర విస్తరించుకుంటూ ఉంది. తారల పారితోషికాలు వందల కోట్ల మార్కును అందుకుంటూ ఉన్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పరిస్థితి వచ్చినా కిక్కురుమనలేని స్థితిలో ఇండస్ట్రీని సెట్ చేసుకుని తమ ఇష్టానుసారం శాసిస్తున్నారు స్టార్ హీరోలు!
-హిమ