చంద్రబాబు-వైఎస్‌లు ఇద్దరూ బద్ధ శతృవులు అని అనుకుంటారు ఈ జనరేషన్ జనాలు. కానీ వారిద్దరూ మంచి మిత్రులని అప్పటి తరం రాజకీయ నాయకులు అందరికీ తెలుసు.
యూత్ కాంగ్రెస్‌లో ఇద్దరూ కలిసి మెలిసి వుండేవారని, ఇద్దరికి మధ్య రాజకీయ బంధాలు వున్నాయని, ఒక వ్యాపార బంధం కూడా వుండేదని అంటారు. ఈ సంగతి ఎలా వున్నా, భిన్న ధృవాలుగా మారిన ఇద్దరి స్నేహితుల జీవితాలు అన్నది మాంచి కమర్షియల్ పాయింట్. ఈ పాయింట్ ఆధారంగానే దర్శకుడు దేవా కట్టా మాంచి కథ అల్లుకున్నారు. ఇది ఈనాటి సంగతి కాదు ఏనాటిదో.
ఎప్పటికైనా దీన్ని సినిమా గా తీయాలనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త మాధ్యమాలు వచ్చాయి కనుక దృష్టి అటు పెట్టారు. వెబ్ సిరీస్ గా తీయబోతున్నారు. సోనీ లివ్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ను ప్రసారం చేస్తుంది. అయితే కీలకమైన రెండు పాత్రలకు మాంచి నటులు కావాలి. చంద్రబాబు పాత్ర తాను చేస్తాను కానీ, తనకు సమ ఉజ్జీగా సరైన నటుడు వైఎస్ పాత్ర చేయాలి అని హీరో రానా చెప్పినట్లు తెలుస్తోంది. అలా దొరక్క ఆ చాన్స్ వదులుకున్నారు.
ప్రస్తుతం రెండు పాత్రల్లో ఓ పాత్రకు ఆది పినిశెట్టిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో పాత్ర కోసం సత్యదేవ్ ను అడిగారు కానీ ఒకె అనలేదని తెలస్తోంది. అన్వేషణ సాగుతోంది. ఈ సినిమాకు దేవాకట్టా అనుకున్న టైటిల్ ఇంద్ర ప్రస్థ. కానీ ఆ టైటిల్ విష్ణు ఇందూరి దగ్గర వుంది. కానీ ఆయన ఇస్తారో ఇవ్వరో తెలియదు. అందువల్ల వేరే టైటిల్ పెట్టే అవకాశం వుంది.
రిపబ్లిక్ సినిమా తరువాత దేవా కట్టా ఇంకా ఇప్పటి వరకు మరో సినిమా అందించలేదు.