గోర్బచేవ్ చనిపోయాడు. ప్రపంచ చరిత్రను మార్చిన నాయకుడు అనామకంగా చనిపోయాడు. నిజానికి ఆయన ఎప్పుడో పోయాడు. పాతికేళ్ల పాటు ఎక్కడా కనపడని, వినపడని నాయకుడు చనిపోయినట్టే లెక్క. అందుకే రష్యా రాజకీయాలతో, కమ్యూనిస్టు పార్టీలతో బాగా పరిచయం ఉన్న వారికి కూడా గోర్బచేవ్ మృతి వార్త ఆశ్చర్యమనిపించింది. ఆయన ఇంకా బతికి ఉన్నాడా అనుకున్నారు. తెలుగు పేపర్లకి గురువారం సెలవు, వుంటే ఏం రాసేవో తెలియదు.
ఎందుకంటే తెలుగు వాళ్లకి కమ్యూనిస్టు రష్యాతో గాఢమైన పరిచయం. ఒకప్పుడు సుందరయ్య నాయకత్వంలో అధికారంలోకి వస్తుందేమో అన్నంత ఊపులో వుండేది. తర్వాత పార్టీ చీలిపోయింది. సీపీఐ రష్యాతో అనుబంధం కొనసాగించింది. అప్పట్లో ఎంతో మంది నాయకులు రష్యా వెళ్లి “కార్మిక స్వర్గం, పేదల పెన్నిధి” ఇలాంటి హెడ్డింగ్‌లతో వ్యాసాలు రాసేవాళ్లు. లెనిన్, స్టాలిన్ పేర్లు ఊళ్లలో వినపడేవి. బ్రెజ్నేవ్ వరకూ ఒక ఆకర్షణ వుండేది. ఇందిరాగాంధీ రష్యాకు అనుకూలంగా ఉండడంతో పాక్ యుద్ధంలో మనకి రష్యా సాయం ఉందని చెప్పుకునేవాళ్లు.
సీపీఐ తరపున విశాలాంధ్ర సంస్థ ఏర్పడడంతో తెలుగు సాహిత్యానికి జరిగిన మేలు అంతాఇంతా కాదు. గొప్పగొప్ప నవలలు తెలుగులోకి వచ్చాయి. రా.రా, నిడమర్తి ఇలా ఎందరో ఒక ఉద్యమంలా అనువాదాలు చేసి అందించారు. క్లాసిక్స్ మాత్రమే కాకుండా, సమకాలీన రచనలు కూడా ఎన్నో వచ్చాయి. విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో రష్యా పుస్తకాల కోసమే ఒక వింగ్ వుండేది.
గోర్బచేవ్ వచ్చాడు. రష్యా మారిపోయింది. మంచి జరిగిందో, చెడ్డ జరిగిందో తెలియదు. చరిత్రలో కొన్ని జరుగుతాయి. ఎవరూ ఆపలేరు. 85 నుంచి 91 వరకూ అధ్యక్షుడిగా ఉన్నాడు. సోవియట్ రిపబ్లిక్‌లో ఏకపార్టీ వ్యవస్థ రద్దయింది. ఆయుధాల పోటీ ఆగిపోయింది. రష్యన్లు స్వేచ్ఛ వచ్చిందనుకున్నారు. కోల్డ్‌వార్ ముగిసింది. రిపబ్లిక్ దేశాలన్నీ విడిపోయాయి. పాతవైభవాన్ని తీసుకు రావాలని పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. 6 నెలలుగా ఏం సాధించాడో తెలియదు. మనకు మాత్రం ధరలు పెరిగాయి.
రష్యా కూలిపోతే అమెరికాకి ఆనందం. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వాళ్లకే నోబుల్ శాంతి బహుమతి వస్తుంది. గోర్బచేవ్‌కి కూడా వచ్చింది. పార్టీకి అత్యంత విధేయుడైన ఆయన హయాంలోనే రష్యా ముక్కచెక్కలు కావడం విచిత్రం. అయితే చాలా ఏళ్లు ఒకే పార్టీ అధికారంలో వుంటే దానికి పిడివాద లక్షణాలు , నియంత పోకడలు వస్తాయి. అక్కడ అదే జరిగింది. పార్టీని ప్రక్షాళన చేయాలని గోర్బచేవ్ ప్రయత్నించారు. మరమ్మతుకి సాధ్యం కాని భవనం కూలిపోతుంది.
అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్, సీనియర్ బుష్‌తో స్నేహంగా వుండడం ఆయన ప్రత్యేకత. అంతకు మునుపు రెండు దేశాల మధ్య ఘర్షణ వైఖరి వుండేది. బెర్లిన్ గోడ కూల్చివేత వెనుక కూడా గోర్బచేవ్ కృషి వుంది. పరిస్థితులు చేయి దాటినప్పుడు పోలీసులు ,గూఢాచారి వ్యవస్థల మీద ఆధారపడి గట్టెక్కాలనుకోవడం పాలకుల ప్రత్యేకత. గోర్బచేవ్ కూడా KGBని నమ్మాడు. సంస్కరణలని అమలు చేయడానికి గూఢాచారుల్ని నమ్మాడు. నమ్మిన వాళ్ల చేతిలో మునిగిపోవడమే రాజకీయం. వాళ్ల చేతిలోనే ఒకసారి కుట్ర జరిగింది. అది విఫలమైనా ఆయన పతనం ఆగలేదు.
ఆయన మరణాన్ని ఎందుకు స్మరించుకోవాలంటే రిపబ్లిక్ విడిపోతున్నప్పుడు దారుణమైన హింసకి అవకాశం వుంది. మిలటరీ జోక్యం నివారించి కొన్ని లక్షల ప్రాణాలు కాపాడాడు. 1991 ఆగస్టు తర్వాత హౌస్ అరెస్ట్ చేశారు.
గోర్బచేవ్ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడు జర్మనీ ఆక్రమణని అనుభవించాడు. రెడ్ ఆర్మీ సైనికుల శవాల గుట్టల్ని చూశాడు. యుద్ధాన్ని వ్యతిరేకించే లక్షణం అప్పుడే ఏర్పడి వుంటుంది. నోబుల్ శాంతికి అర్హుడే.
ప్రపంచానికి గుర్తున్నా లేకపోయినా రష్యా రిపబ్లిక్ దేశాలకి ఎప్పుటికీ గుర్తుంటాడు. మంచివాడిగా, లేదా చెడ్డవాడిగా.
జీఆర్ మహర్షి