ఇండియా పరువు తీస్తున్న అమెరికా తెలుగువాళ్లు

అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్ అని అందరికీ తెలుసు. దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రతిభావంతులకి అవకాశాలిచ్చి పోషిస్తున్న దేశం ఇది. తొలి తరం తెలుగు వారు 1960-70ల్లో డాక్టర్లుగా అమెరికాకి చేరారు. చాలా హుందాగా,…

అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్ అని అందరికీ తెలుసు. దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రతిభావంతులకి అవకాశాలిచ్చి పోషిస్తున్న దేశం ఇది. తొలి తరం తెలుగు వారు 1960-70ల్లో డాక్టర్లుగా అమెరికాకి చేరారు. చాలా హుందాగా, గౌరవప్రదంగా, ప్రశాంతంగా బ్రతికేవారు. 

తరువాత 1985-95ల్లో ఇంజనీర్స్ రావడం మొదలుపెట్టారు. భయం భయంగా బతుకుతూ, ఎక్కడా గొడవలకి దిగకుండా, భవిష్యత్తు మీద, సంపాదన మీద ధ్యాస పెట్టి జాగ్రత్తగా బతికేవారు. సాధ్యమైనంత వరకు తమని తాము అండర్ ప్లే చేసుకుని లో ప్రొఫైల్ లో బ్రతికేవారు. 

ఇదే సమయంలో తెలుగు సంఘం ఏర్పడినా తొలుత ఒకటే ఉండేది. క్రమంగా తెలుగువారి జనాభా అమెరికాలో పెరగడం, గ్రూపులు కట్టడం మొదలై రకరకాల తెలుగు సంఘాలు పుట్టుకొచ్చాయి. పాలిటిక్సూ మొదలయ్యాయి. 

కాలం గడుస్తున్న కొద్దీ తెలుగువారి జనాభా పెరగడంతో అశాంతి, చిరాకు పెరుగుతున్నాయే తప్ప ఒకప్పటి హుందాతనం లోపిస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకి వచ్చి స్థిరపడ్డ తెలుగువాళ్లలో తొలి తరం వారు, ఆ తర్వాతి తరం వారు చెబుతున్నారు. 

ప్రధానంగా ఇప్పుడు అమెరికాలోని తెలుగువారిలో మునుపటి భయం తగ్గింది. కారణం రెండేసి ఉద్యోగాలు చేస్తూ ఎడా పెడా సంపాదిస్తుండడం, సమాంతరంగా రియలెస్టేట్ నుంచి గ్యాస్ స్టేషన్స్ వరకు రకరకాల వ్యాపారాలు చేసి మరింత సంపాదిస్తుండడం. 

ఇదివరకు గ్రీన్ కార్డ్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలనే భయభక్తులుండేవి. ఇప్పుడు డబ్బుమదంతో అవసరమైతే డబ్బుపారేసి ఈబీ5 కేటగరీలో ఫాస్ట్ ట్రాక్ లో గ్రీన్ కార్డు కొనేసుకోవచ్చు కదా అనుకుంటున్నారు ముఖ్యంగా ఒక వర్గం తెలుగువారు. 

ఎప్పుడైతే భయం తగ్గుతుందో మిగిలిన వికారాలు బయటపడడం మొదలుపెడతాయి. అందులో ప్రధానమైనది క్యాస్ట్ ఫీలింగ్. 1980-90ల్లో ఆంధ్రలో ఉన్న క్యాస్ట్ గొడవలు ఇప్పుడు అమెరికాలో విస్తృతమయ్యాయి. కులభోజనాలు, కులం గ్రూపులు ఎక్కువైపోయాయి. ఏ రేంజులో అంటే నీ కులం, నా కులం అనేది దాటిపోయి.. ఆయా కులాల వారు ప్రాంతాల వారీగా కూడా గ్రూపులు కడుతున్నారు.

అంటే ఒక కులానికి చెందిన గుంటూరు వారు ఒక గ్రూపైతే, అదే కులానికి చెందిన కర్నూలు వారు మరొక గ్రూప్ అన్నమాట. ఇదే కంటిన్యూ అయితే రేపు మండలం లెవెల్ కుల సంఘాలు, గ్రామ స్థాయి కులసమితులు కూడా రావొచ్చు. ఆ తర్వాత ఇక ఇంటిపేర్లతో కూడా గ్రూపులు కడతేరామో. అసహ్యానికే అసహ్యమేసేలా ఉంది తెలుగువారి సో కాల్డ్ ఐక్యత. 

ఈ అసహ్యమంతా సినిమాలు విడుదలైనప్పుడు మరింత కంపుకొడుతున్నాయి. వీరసింహారెడ్డి విడుదలప్పుడు ఒక వర్గం తెలుగువాళ్లు ఎంత అసహ్యాన్ని సృష్టించారో తెలుసు. కార్ల ర్యాలీలు పెట్టి నానా హడావిడి చేయడం, సినిమా హాల్స్ లో పేపర్స్ విసిరి రభస సృష్టించడం అందరూ చూసారు. వీళ్లని చూసి కాంపిటీషన్ ఫీలయ్యి ఎంతో కొంత తాము కూడా చెయ్యాలని చిరంజీవి వర్గం వారు కూడా కార్ ర్యాలీలు చేసారు. అయితే వీరసింహారెడ్డి వర్గం 80-90 కార్లతో వీరంగం చేస్తే, వాల్తేర్ వీరయ్య బ్యాచ్ 10 కార్లతో చేసుండొచ్చు. అదొక్కటే తేడా. చేసిన రచ్చ మాత్రం అదే. తాము చేయడమే కాకుండా పక్క వర్గాన్ని కూడా రెచ్చగొట్టి దరిద్రాలు చేయించే ఘనత వీరసింహారెడ్డిని మోసిన బ్యాచ్ ది.

ఇదిలా ఉంటే రెండు కులాల మధ్య గొడవలు తెచ్చి న్యూ ఇయర్ రోజు తన్నుకు చచ్చారు కొందరు మన తెలుగు వాళ్లు. ఆ గొడవలో ఒక వర్గానికి చెందిన వాడిని అరెస్ట్ చేసి లోపలేసారు కూడా. అదే వర్గానికి చెందిన మరికొందరు వ్యభిచారం కేసులో అరెస్టయ్యి జైల్లో కూర్చున్నారు ప్రస్తుతం. మరొక తెలుగువాడు పోంజీ స్కీములతో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసి పేపర్లకెక్కాడు. క్రైం కి కులం, మతం ఉండవు. కానీ యాదృచ్చికమా, స్వయంకృతమా, మరేదన్నా జాడ్యమా తెలియదు కానీ తెలుగు వాళ్లే ఎక్కువగా క్రిమినల్స్ కావడం బాధాకరం. 

వీళ్లంతా అమెరికాలోని తెలుగువాళ్లందరికీ అసహ్యకరమైన ఇమేజ్ ని తెచ్చిపెడుతున్నారు. ఈ కంపు అమెరికాలోని ఇతర దేశీయులకే కాకుండా, ఇతర భారతీయులకి కూడా తెలిసిపోతోంది. “తెలుగువాడంటే జాగ్రత్తగా ఉండాలి” అనే ఇంప్రెషన్ కలిగిస్తున్నారు. వాళ్లకి మన కులాల గొడవ తెలియదు. అందర్నీ ఒకే గాటన కట్టేసి చీదరించుకుంటారు. 

ఇదే ఏవగింపు మరింత పెరిగితే మొన్నీమధ్య చైనీస్ న్యూ ఇయర్ రోజున మాస్ ఫైరింగ్ చేసినట్టు భారతీయుల ఉత్సవాల్లోకి కూడా రేసిస్ట్ సైకోలు చొరబడి హింస సృష్టించవచ్చు. ఆ పరిస్థితి రావడానికి మూలం తెలుగువాళ్లేనని అప్పుడు మన దేశీయులంతా వేలెత్తి చూపి అసహ్యించుకోవచ్చు. ఆ దుస్థితి రాకముందే బుద్ధిని చక్కబెట్టుకోవాలి. 

ఈ ఆర్టికల్ ఇంగ్లీషులో కాకుండా తెలుగులో రాసిన ఉద్దేశ్యమే మన తెలుగుజాతి పరువు అంతర్జాతీయంగా పోకూడదని…ఈ వివరం, ఇందులోని సందేశం తెలుగువారికి మాత్రమే చేరాలని. ఇకనైనా నిజంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే జాతనుకునేవాళ్లు తమని తాము నియంత్రించుకుని పద్ధతిగా బతికి తన్నులు, తిట్లు తినకుండా, శిక్షలు పడకుండా నడచుకుంటారని ఆకాంక్ష. పద్ధతి మార్చుకోకపోతే మరిన్ని అనర్ధాలు తప్పేలా లేవు. 

హరగోపాల్ సూరపనేని