మునివాక్యం: ఇంకేం చేయలేమా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని మనం చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క పరిపాలన వ్యవస్థ మన ప్రజాస్వామ్యం అని ఘనమైన నిర్వచనం చెప్పుకుంటాం.…

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని మనం చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క పరిపాలన వ్యవస్థ మన ప్రజాస్వామ్యం అని ఘనమైన నిర్వచనం చెప్పుకుంటాం. అయితే మన దేశంలో అత్యున్నత విధాన నిర్ణయక చట్టసభలకు సభ్యులను ఎన్నుకునే విషయంలో అపభ్రంశపు ధోరణులు పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి.

ప్రజాస్వామ్యంలో మెజారిటీ మాటకే విలువ దక్కుతుందనే మాట వాస్తవమే కానీ.. కొన్ని నియోజకవర్గాలలో కేవలం 30 -35% ఓట్లు సంపాదించిన వారు కూడా అధికారం చలాయిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు! అంటే సుమారుగా 65-70 శాతం ప్రజలు తిరస్కరించిన వ్యక్తి నాయకుడిగా గెలిచి.. ఆ వందశాతం మంది ప్రజల జీవితాల మంచి చెడులను నిర్దేశించే చట్టసభల్లో కొలువు తీరడం అనేది ప్రజాస్వామ్యానికి అపహాస్యం కాక మరేమిటి?!

ప్రజాస్వామ్యం నిజంగా మంచి తీరుగా నడవాలంటే ఓటింగ్ శాతం పెరగడం అనేది చాలా అవసరం. ప్రజలు పూర్తిస్థాయిలో ఓటింగులో విధిగా పాల్గొనేలా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన, అందుకు తగిన ఏర్పాటు చేయవలసిన అవసరం ఎన్నికల సంఘం మీద ఉంటుంది.

ఇందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే.. ఓటింగు పెరగడానికి ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చిన ఒక విధానం అభినందనీయమైన ముందడుగుగా పరిగణించాలి. 80ఏళ్లు దాటిన వృద్ధులు ఇకమీదట తమ ఇళ్ల నుంచే ఓటు వేయడానికి ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. అయితే ఇలా ఇంటి నుంచే ఓటు వేయడానికి ముందుగానే ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలియజేసి అనుమతి తీసుకోవాలి. దీనివలన వయోభారంతో పోలింగ్ కేంద్రానికి రావడానికి ఇష్టపడని వర్గంలో ఓటింగ్ శాతం పెరుగుతుంది.

మారుతున్న కాలమాన పరిస్థితులలో ప్రజలలో ఓటింగ్ శాతం పెరగడానికి ఎన్నికల సంఘం మరిన్ని ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతిక పోకడలను అందిపుచ్చుకోవడంతోపాటు, ఆధునిక జీవన సరళులు కూడా ఓటింగ్ శాతం మీద ప్రభావం చూపించకుండా ఉండేందుకు ఆన్లైన్లో ఓటు వేయడానికి అనుమతించే సదుపాయం కుదురుతుందేమో ఎన్నికల సంఘం పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఆన్లైన్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం అనే అంశం గురించి మాట్లాడే ముందు ప్రధానంగా రెండు సామాజిక పరిణామాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి.

ఒకటి- ఆధునిక తరంలో తమ తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం స్వస్థలాలను వీడి సుదూర ప్రాంతాలలో స్థిరపడుతున్న వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంటోంది.

రెండు- కోట్లకు కోట్ల రూపాయల లావాదేవీలు కూడా చిటికెలో మొబైల్ ఫోను ఆధారంగా జరిగిపోతున్నాయి. ఈ లావాదేవీలలో ఎలాంటి తేడా రాకుండా పటిష్టమైన మల్టీ లేయర్ సెక్యూరిటీ వ్యవస్థలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆన్ లైన్ ఓటింగ్ హక్కును తీసుకురావడం ఎందుకు సాధ్యం కాదు? ఎన్నికల సంఘం ఎందుకు ఆలోచించడం లేదు అనేది కీలకమైన ప్రశ్న.

ఇతర ప్రాంతాలలో స్థిరపడుతున్న వారు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు కేవలం ఓటు వేయడం కోసం తమ ఉద్యోగాలకు సెలవు పెట్టుకుని, వేల కొద్ది రూపాయలు ఖర్చుపెట్టుకుని తమ సొంత ప్రాంతాలకు వచ్చి వేస్తారనుకోవడం భ్రమ. ఇలాంటి పరిస్థితుల్లో ఓటు వేయడానికి వచ్చే వ్యక్తులు కూడా, కనీసం తమకు కాగల ఖర్చులను అభ్యర్థి చెల్లిస్తే బాగుంటుంది కదా అని ఆశించడం, ఓటును అమ్మకానికి పెట్టుకోవడం వింత కాదు. అలాంటి వాతావరణం ఉన్నది కనుకనే ఒక్కొక్కరికి వేల రూపాయలు ముందుగానే ముట్ట చెబుతూ ఓట్లను కొనుగోలు చేయడం జరుగుతుంటుంది.. ఆన్లైన్ లో ఓటు వేసే విధానం అందుబాటులోకి వస్తే గనుక ఎవరికి వారు తాము నివాసం ఉంటున్న ఇతర ప్రాంతాల నుంచే ఓటింగ్ లో పాల్గొని అవకాశం ఉంటుంది.

ఇలాంటి పద్ధతి తీసుకురావడం వలన ఓట్లు అమ్ముకోవడం పెరుగుతుందనే వాదన ఒకటి ప్రబలంగా వినిపిస్తుంది. ఓట్ల అమ్మకాలను ఇప్పుడు ఎన్నికల సంఘం నియంత్రించగల స్థితిలో ఉన్నదా? అనేది పెద్ద ప్రశ్న. నిజానికి ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది కోసం.. ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు ఉంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ లో పార్టీలకు అమ్ముడుపోవడం అనేది ఇటీవలి కాలంలో చాలా తరచుగా జరుగుతున్న పరిణామం.

ఒక్కో ఓటుకు సుమారుగా రెండువేల రూపాయలు చెల్లించి.. ఆ పోస్టల్ బ్యాలెట్లను తీసుకుని తమకు అనుకూలంగా వేసేసుకోవడం పార్టీలకు అలవాటుగా మారింది. ఇప్పుడు 80 ఏళ్లు దాటిన వారు ఇంటినుంచే ఓటు వేసే పద్ధతి వచ్చినా కూడా.. ఆ ఓట్లు అమ్మకానికి గురికావనే నమ్మకం లేదు. ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను తీసుకువచ్చినా కూడా అదే జరుగుతుంది.

ఉదాహరణను గమనిస్తే, గుంటూరు నియోజకవర్గానికి చెందిన ఓ వెయ్యిమంది యువతీయువకులు హైదరాబాదు నగరంలో వివిధ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారని అనుకుందాం. ఇలాంటి వారి జాబితాలను తయారుచేసి.. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు వీరికోసం ఎన్నికలపోలింగ్ సమయానికి ప్రత్యేకంగా బస్సు సర్వీసులు ఏర్పాటుచేస్తుంటారు. వారు ఆన్ లైన్ లో హైదరాబాదునుంచే గుంటూరు నియోజకవర్గం ఎమ్మెల్యేకు ఓటు వేసే ఏర్పాటు ఉండాలి. ఈ ఏర్పాటు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొత్త ఆలోచనలు చేయవచ్చు. నియోజకవర్గంలో ఉంటున్న వారికి ఆన్ లైన్ ఓటింగ్ ఏర్పాటు లేకుండా కట్టడి చేయవచ్చు. ఐపీ అడ్రస్ ద్వారా.. నియోజకవర్గం వదలి ఇతర ప్రాంతాల్లోనివసించే వారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. అలాంటప్పుడు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా అక్కడినుంచే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాం గనుక.. ఆన్ లైన్ అనుమతి కావాలని ప్రజలు దరఖాస్తు చేసుకునే ఏర్పాటుండాలి. ఇందుకు సంబంధించి సాంకేతికంగా పటిష్టమైన మల్టీలేయర్ భద్రత వ్యవస్థలను నియోగించవచ్చు. ఏ ఐపీ అడ్రస్ నుంచి దరఖాస్తు చేసుకుంటారో.. అదే ఐపీ నుంచి మాత్రమే.. ఓటు హక్కు వేయడానికి అవకాశం కల్పించాలి. లాగిన్ కావడానికే వారి పర్సనల్ మొబైల్ కు ఓటీపీ పండం, నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆన్ లైన్ ఓటింగ్ పోర్టల్ తెరిచి ఉంచడం వంటి ఏర్పాట్లు చేయవచ్చు. ప్రధానంగా.. ఇలాంటి ఏర్పాటును తీసుకురావాలనే కోరిక ఎన్నికల సంఘానికి ఉన్నట్లయితే గనుక.. అందుకు ఎన్ని ఏర్పాట్లు చేయడమైనా సాధ్యమవుతుంది.

ఓటింగ్ శాతం పెరగడానికి ఇలాంటి ప్రయత్నాలు దోహదం చేస్తాయి. సాధారణంగా సంపన్న వర్గాల ఓటర్లు కూడా ఓటింగుకు గైర్హాజరవుతూ ఉంటారనేది ఒక అంచనా. ఈ వర్గంలో కూడా ఇలాంటి ఏర్పాటు వలన కొంత ప్రయోజనం ఉండవచ్చు. నియోజకవర్గంలోనే ఉంటూ ఆన్ లైన్ ఓటు కోరుకునే వారికి (ఐపీ అడ్రస్ ద్వారా తెలుస్తుంది గనుక) కొంత రుసుము కూడా విధించవచ్చు.

ఓట్లు అమ్ముకుంటారనే మాట ఒక్కటే ఈసీ చెప్పగలిగేది. ఇప్పుడైనా సరే.. ధన ప్రమేయం లేకుండా చాలా స్వచ్ఛంగా ఎన్నికలు జరుగుతున్నాయని అనుకోగలమా? అది హాస్యాస్పదం అవుతుంది. ఫోను ద్వారా నగదు చెల్లింపులకు సులువైన వ్యవస్థలు వచ్చేసిన తర్వాత.. పార్టీలు నియోజకవర్గాల్లో ప్రతి ఇరవై, యాభై ఇళ్లకు పార్టీ తరఫున ఒక కార్యకర్తను నియమించి.. వారిద్వారా నిత్యం ఆ యాభై ఇళ్లప్రజలతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ ఉండే ఏర్పాటులు చేసుకున్న తరువాత.. ఓట్లకు డబ్బు చెల్లింపు అనేది చాలా సులువుగా మారిపోతోంది.

పైగా ఈ రకంగా ఓట్ల కొనుగోలు వ్యవహారాలను నియంత్రించగల పటిష్టమైన వ్యవస్థ ఎన్నికలసంఘం వద్ద లేదు. నగదురూపంలో కోట్లు తరలిస్తూ ఉంటే పట్టుకునే సందర్భాలు మనకు వార్తల్లో కనిపిస్తాయి గానీ, యూపీఐ చెల్లింపుల ద్వారా ఓట్లను కొంటూ ఉంటే ఏం చేయగలరు? ఎలా నియంత్రించగలరు? కాబట్టి.. ఆన్ లైన్ ఓటింగ్ విధానం పట్ల విముఖత చూపించకుండా, అందులో లోపాల ప్రస్తావనతో ఆలోచననే చంపేయకుండా, ఆ పద్ధతి తీసుకువచ్చి.. కొన్ని సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా జోడించవచ్చు. చిన్న చిన్న లోపాలుగా కొన్ని ఓట్ల అమ్మకాలు జరగవచ్చు గానీ.. ప్రధానంగా ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుందని మనం అందరమూ ఒప్పుకోవాలి.

ప్రపంచంంలో కొమ్ములు తిరిగిన పెద్దదేశాలు అనుకునే అనేక దేశాల్లో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ప్రజల తీర్పును కోరుతున్నారు. భారతదేశంలో మాత్రం.. ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు విప్లవాత్మక పోకడలను తీసుకువచ్చాయి. ఈ విషయంలో ప్రపంచంలోని అనేక దేశాలకు భారత్ మార్గదర్శిగా నిలిచింది. ఓటింగ్ విధానంలో కూడా అలాంటి మెరుగైన మార్పులు తీసుకువచ్చినట్లయితే ప్రజాస్వామ్యానికి గొప్ప మేలు చేసినట్టు అవుతుంది.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె