Advertisement

Advertisement


Home > Politics - Opinion

'కాపు సీయం' నినాదం- పవన్ కి ఇబ్బందే

'కాపు సీయం' నినాదం- పవన్ కి ఇబ్బందే

పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే రాబోయే మూడు నాలుగు నెలలు ఆంధ్ర రాజకీయాల్లో ఊహాతీతమైన అంశాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. అవి చెప్పుకునే ముందు తెలంగాణాలో జరుగుతున్న తంతుని ఒక్కసారి చెప్పుకోవాలి. 

ప్రచారానికి ఐదు రోజులు మాత్రమే సమయమున్న నేపథ్యంలో భాజపా-జనసేన కూటిమిలో భాగంగా పవన్ కళ్యాణ్ తన ఎనిమిది మంది అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి రేపో మాపో సమాయత్తమవుతున్నాడు. 

అయితే రీహార్సిల్ టైపులో ముందుగా ఒక బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేసిపెట్టాడు. ఒక్క మాట కూడా ఓటర్ని ఆకట్టుకునేలా మాట్లాడలేదు. అసలా ఉద్దేశ్యమే లేనట్టుగా సాగింది ఆయన ప్రసంగం. కూటమికి ఒప్పుకున్నాక తప్పదు కదా అన్నట్టుగా నీరసంగా, నిట్టూరుస్తూ చేస్తున్నట్టుగా ఉంది ఆయన ప్రచారం.

ఓడిపోయే ఆటకి హైరాన పడి ఏం ప్రయోజనం అన్నట్టుగా ఉంది ఆయన ధోరణి. ఈ పర్ఫామెన్స్ బీజేపావాళ్లు చూస్తారన్న ఆలోచనకూడా లేనట్టుంది. 

ఇదిలా ఉంటే ఒకమాట మాత్రం కాస్త ఒత్తి పలికాడు. తెలంగాణాలో బీసీ సీయం ని చూడడం తన ధ్యేయమని అది బీజేపీతోనే సాధ్యమని...! 

అఫ్కోర్స్, బీజేపీ వాళ్లు తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అదే ముక్క పట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా నొక్కి వక్కాణిస్తున్నాడు. 

ఇక్కడ సీన్ ఇలా ఉంటే ఒక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. అదేంటంటే కూకట్పల్లిలో జనసేన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అక్కడి కమ్మ ఓటర్లేదని, గెలిపించుకోలేక పోతే ఆంధ్రాలో జనసేన సర్వశక్తులు ఒడ్డి తెదేపా తరపున నిలబడే అభ్యర్థులందర్నీ ఓడిస్తుందని హెచ్చరిక జారీ చేసాడు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్లా వరప్రసాద్. అంటే జనసేన అభ్యర్థికి కమ్మలు ఎక్కడ ఓటు వెయ్యరో అని అనుమానం కాపుల్లో ఉందన్నమాట. అయితే కూకట్పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేం కుమార్ కమ్మ వర్గీయుడే. కనీసం ఆ యాంగిల్లో అయినా ఓటు వేస్తారులే అని అనుకోకుండా ఇంత పెద్ద హెచ్చరిక జారీ చేసాడు సదరు కాపు నాయకుడు. 

అయినా కూకట్పల్లి అంటే కమ్మలొక్కరే ఉంటారా? ఏవిటో మరి! 

సరే..ఇప్పుడు ఆంధ్రా విషయానికొద్దాం. తెలంగాణాలో బీసీ ముఖ్యమంత్రిని చూడాలని ఉంది అన్న పవన్ కళ్యాణ్ కి ఆంధ్రాలో కాపుని సీయం గా చూడాలని కోరిక లేదా? 

జనసేన అంటే కాపుల పార్టీయే అని అందరికీ తెలుసు. 

కాదు... అది అందరిపార్టీ అని గట్టిగా చెప్పాలన్నా కాపు నాయకులే తమ లెటర్ హెడ్ మీద అధికారికంగా జనసేనని ఓన్ చేసుకుని నేరుగా కమ్మ వోటర్లకి, ఆపైన చంద్రబాబుకి అఫీషియల్ గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కదా! 

ఈ నేపథ్యంలో తెదేపా-జనసేన పొత్తు ఆంధ్రలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటే ఒక్కటి మాత్రం ఊహించవచ్చు. బీజేపీకి ఆంధ్రలో బలంలేదు. తెలంగాణాలో ఉన్న దానికంటే బలహీనంగా ఉందక్కడ. ప్రచారంలో వాడుకోవడానికి బలమైన పాయింటేమీ వాళ్లకి లేదు. తెలంగాణాలో కూడా అదే పరిస్థితి. కనుక "బీసీ సీయం" అనే పాయింటు పట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు...కేస్ట్ ఫీలింగ్ ఓట్లు కొన్నైనా చీలతాయని ఆలోచిస్తున్నారు!

సేం టు సేం ఫార్ములాని ఆంధ్రాలో కూడా వాడి "కాపు సీయం" నినాదంతో ముందుకెళ్లే అవకాశముంది బీజేపీకి.

ఎలాగూ తెదేపా-జనసేన పొత్తులో ఉన్నారు కనుక ఆ పార్టీల్లో ఏ ఒక్కదాన్ని కూడా తమతో కలుపుకోకుండా ఒంటరి పోరాటంలో "కాపు సీయం" పాయింటుని పట్టుకుని ప్రచారం చేయొచ్చు. అప్పుడు కాపు ఓట్లు గణనీయంగా చీలడం ఖాయం. 

ఎందుకంటే తెదేపా-జనసేన కూటమికి ఓటేస్తే కాపు సీయం అవ్వడని కాపులకి తెలుసు. ఆ కూటమికి ఓటేసి మళ్లీ కమ్మవాడైన చంద్రబాబుకి బలాన్నిచ్చే కన్నా "కాపు సీయం" సెంటిమెంటుకి బీజాన్ని నాటిన బీజేపీకి ఓటేయొచ్చు. దానివల్ల కాపు ఓట్లు చీలతాయి. అలా జరిగితే వైకాపాకి అడ్వాంటేజ్ అవుతుంది. 

తెలంగాణాలో బీసీల్లో అగ్రశాతం ప్రజలకి బీసీ ముఖ్యమంత్రిని చూడాలనుందో లేదో తెలీదు కానీ, ఆంధ్రలో అధికశాతం కాపులకి మాత్రం కాపు సీయం ని చూడాలని ఉంది. కనుక ఈ క్యాస్ట్ సెంటిమెంట్ ఫార్ములా అక్కడ బాగా పని చేస్తుంది. 

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద బాబుని వదిలి బీజేపీతో పొత్తు పెట్టుకోమని కాపుల ఒత్తిడి పెరుగుతుంది. 

అలాగని చంద్రబాబు తమ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ ని సీయం చేయడం ఖాయమని చెప్తాడా? తన ఈగోని చంపుకుని అలా చెప్పే ధైర్యం ఉంటుందా? ఒకవేళ అలా చెప్తే కమ్మవారి మనోభావాలు గంగలో కలిసినట్టే కదా! వాళ్లు అలా అననిస్తారా చంద్రబాబుని? ఒకవేళ రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు మనసు చంపుకుని చెప్పినా కాపులు విశ్వసిస్తారా? అన్నమాట నిలబెట్టుకుంటాడన్న ట్రాక్ రికార్డే లేదు చంద్రబాబుకి. 

ఇదే జరిగితే ఈ గందరగోళంలో అటు కమ్మలు, ఇటు కాపుల మధ్య పవన్ కళ్యాణ్ అడకత్తెరలో పోకచెక్కలాగ నలిగిపోవాల్సిందే. 

బాబుని వదిలి పవన్ భాజపాతో కలిస్తే ఏమౌతుంది? 

కాపుల మనోభావాల్ని గౌరవించినట్టు అవుతుంది. 

అయితే కాపు ఓట్లు చీల్చి తెదేపాకి పెద్ద దెబ్బగొట్టినవాడౌతాడు. 

కాపుల్ని కాదని చంద్రబాబుతోనే కలిసుంటే ఏం జరుగుతుంది? 'ప్యాకేజీ స్టార్" అనే పేరు శాశ్వతమైపోతుంది. 

అప్పుడు కూడా భాజపా మరియు తెదేపా-జనసేన కూటమి మధ్యన కాపు ఓట్లు చీలడం వల్ల తెదేపాకి నెగెటివ్ అవుతాడు. 

ఏ ఆప్షన్లో అయినా కాపు ఓట్లు చీలడం మాత్రం కామన్. 

దీనిని బట్టి ఏమి అర్థమవుతోంది? 

బీజేపీ కనుక ఈ "కాపు సీయం" నినాదం ఎత్తుకుంటే ఏ ఈక్వేషన్లో అయినా తెదేపాకి చావుదెబ్బే. 

ఇప్పటికీ తెదేపా సానుభూతిపరులకి, పవన్ కి ఒక కోరిక ఉండి ఉండొచ్చు. అదే తెదేపా-జనసేన-భాజపా త్రికూటమి. అది జరిగితే తప్ప ఈ ఉపద్రవం నుంచి బయట పడడం అటు చంద్రబాబుకి, ఇటు పవన్ కి కుదరదని అనుకోవచ్చు. అయితే అది జరిగే సూచనలు ఎక్కడా లేవు. 

ఒకవేళ త్రికూటమి జరిగితే మాత్రం జగన్ మోహన్ రెడ్డి నెత్తిమీద పాలు పోసినట్టే. ఆ కూటమిలో తెదేపా, జనసేన అగ్రకుల పార్టీలుగా ముద్రేసుకున్నాయి. వాటికి భాజపాకూడా కలిస్తే మైనారిటీ ఓట్లు, బీసీ ఓట్లు ఏమాత్రం చీలిక లేకుండా గంపగుత్తగా వైకాపాకే పడతాయి. ఇప్పుడున్న సీన్ అలా ఉంది. ఇదే విషయాన్ని సీపీయం నారాయణ కూడా చెప్పాడు. 

ప్రస్తుతానికి ఊహించగలిగేది ఇదే. రానున్న మూడు నెలల్లో ఇక్కడ చెప్పుకున్న సన్నివేశాలు చూస్తామా? లేక వేరే రకమైన పరిస్థితులు చూస్తామా అనేది వేచి చూద్దాం!

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?