తెలుగుదేశం పార్టీ చినబాబు నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభం కాబోతోంది. చంద్రబాబునాయుడు అరెస్టు సాకు చూపి సుదీర్ఘకాలం విరామం తీసుకున్న నారా లోకేష్.. నవంబరు 27 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.
చంద్రబాబును అరెస్టు చేసిన సమయానికి రాజోలు వరకు చేరుకున్న పాదయాత్రకు అక్కడే విరామం ప్రకటించి వచ్చేశారు. సుమారు రెండున్నర నెలల విరామం తర్వాత తిరిగి, అక్కడినుంచే పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే రెండో ఇన్నింగ్స్ గా కొనసాగనున్న పాదయాత్రలో చిన్న మార్పులు ఉన్నాయి.
విశాఖ పట్నం చేరుకున్న తర్వాత పాదయాత్రను విరమిస్తారు. తొలుత కుప్పంనుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలనేది లోకేష్ ప్లాన్. అయితే ఇప్పుడు తండ్రి అరెస్టు కారణంగా వచ్చిన గ్యాప్ వలన, ఇచ్ఛాపురం దాకా పాదయాత్ర చేయడం సాధ్యం కాదని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి గనుక.. ముగించాలని అనుకుంటున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే అసలు సీక్రెట్ వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడానికి నారా లోకేష్ జడుసుకుంటున్నారనేది వారి అంచనా. ఎందుకంటే.. మూడు రాజధానుల రూపంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని తెలుగుదేశం పార్టీ ఘోరంగా వ్యతిరేకిస్తోంది. ఆ మేరకు విశాఖపట్నంతోపాటు, యావత్తు ఉత్తరాంధ్రలో తెలుగుదేశానికి ప్రతికూలత ఉంది. ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. తమ ప్రాంతం బాగుపడే ఆలోచన జగన్ చేస్తోంటే.. తెదేపా అడ్డుకుంటోందని ప్రజలు కోపగించుకుంటున్నాురు. ఈ నేపథ్యంలోప్రజలనుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతోనే నారా లోకేష్ తన పాదయాత్రను విశాఖపట్నంతో నిలిపివేయాలని భావిస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.
గతంలో ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా.. అమరావతి రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన పాదయాత్ర అరసవెల్లి వరకు ప్లాన్ చేసినది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ప్రజల నుంచి ప్రతిఘటన రావడంతోపాటు, పోలీసులు రైతుల ఐడీ ప్రూఫ్ లు అడగడంతో ఆ ముసుగులో యాత్ర చేస్తున్న జూనియర్ ఆర్టిస్టులు జారుకున్నారు.
అలాంటి ప్రజా ప్రతిఘటన ఇప్పుడు కూడా తప్పదని, నారా లోకేష్ పాదయాత్ర చేస్తే.. ఉత్తరాంధ్రలో శాంతి భద్రతల సమస్యలు ప్రతిరోజూ తలెత్తుతాయని ఆ పార్టీనే భయపడుతోంది. ఆ ప్రాంతంలో తమ పార్టీని అసహ్యించుకుంటున్నారనే సంగతి ఎన్నికలకు ముందుగా బయటపడితే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది గనుక.. వ్యూహాత్మకంగా విశాఖలోనే పాదయాత్ర ఆపేస్తున్నట్టు తెలుస్తోంది.