Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఖలిస్తాన్ ఉద్యమం: మోదీ మీద మరో సర్జెకల్ స్ట్రైక్

ఖలిస్తాన్ ఉద్యమం: మోదీ మీద మరో సర్జెకల్ స్ట్రైక్

ఎప్పుడో ముగిసిపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ ఊపిరిపోసుకుంది. అయితే ఇది ఉఫ్ అని ఊదితే ఆరిపోయేదేనా లేక మరింత రాజుకుని పెనుజ్వాలగా మారుతుందా అనేది అప్పుడే చెప్పలేం. 

ఇంతకీ ఏవిటీ ఖలిస్తాన్ ఉద్యమం? 

సిక్కులంటే మనకి పంజాబ్ రాష్ట్రానికి పరిమితమైన ఒక మైనారిటీ మతస్థులుగా మాత్రమే మనకు తెలుసు. రక్షణ దళాళ్లోనూ, ఆటల్లోనూ వీరు ఎక్కువగా కనిపిస్తుంటారు. ప్రతి సిక్కు ఇంటిలోనూ అయితే జవాన్, లేకుంటే కిసాన్ ఉంటాడని ఆ రోజుల్లో ప్రతీతి. కాలక్రమంలో వాళ్లు కూడా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. 

18 వ శతాబ్దంలో ఆంగ్లేయుల హస్తాలకు చిక్కేవరకు సిఖ్ సామ్రాజ్యం చాలా పెద్దది. పంజాబ్ అంటే మనకి మన దేశంలోని చిన్న రాష్ట్రంగా మాత్రమే తెలుసు కానీ వాస్తవానికి మన దేశంలో ఉన్న పంజాబ్ అసలు పంజాబ్ రాష్ట్రంలో ఆరోవంతు ఉండొచ్చు. మిగతాదంతా పాకిస్తాన్లో ఉంది. అక్కడ కూడా అది పంజాబ్ రాష్ట్రంగానే ఉంది. నిజానికి ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్, భారతదేశంలోని పంజాబ్ తో పాటు మరికొంత భూభాగం కలిపితే ఒకనాటి సిఖ్ ఎంపైర్ అన్నమాట. 

ఆంగ్లేయులు 1947లో స్వాతంత్రమిచ్చే సమయంలో హిందువులకి ఇండియా, ముస్లిములకి పాకిస్తాన్ ఇచ్చేసారు. "మరి మాకేంటి?" అని అడిగారు సిక్కులు. తమకు సిక్కిస్తాన్ ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ జనాభా ప్రాతిపదికన మాత్రమే దేశాలు ఇవ్వడం జరుగుతుందని ఆ సిక్కిస్తాన్ డిమాండ్ ని తోసిపుచ్చారు. 

ఆ సమయంలో పాకిస్తాన్లో తమ భూభాగం, తమ గురుద్వారాలు, పవిత్రస్థలాలూ ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువమంది సిక్కులు భారతదేశంలోని పంజాబుకు వచ్చారు. ఆ సమయంలో సరిహద్దు మతఘర్షణల్లో బలైంది ఎక్కువగా సిక్కులే.

ఇంచుమించు ఆ సమయానికి కాస్త అటు ఇటుగా ఒకానొక సందర్భంలో ప్రధాని నెహ్రూ సిక్కులకి స్వయం ప్రతిపత్తితో కూడిన స్వరాష్ట్రం ఇస్తానని ఒక ప్రమాణం చేసాడు. కానీ కాలక్రమంలో దానిని విస్మరించడంతో నెహ్రూ తమను మోసం చేసాడని భావించారు సిక్కులు.

క్రమంగా 1956లో భాషాప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన జరిగింది. అదే ఊపులో తమకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేయమని కోరారు సిక్కులు. కానీ ఇండియా సెక్యులర్ దేశం కావడం వల్ల మతపరంగా భూభాగాలు పంచడం కుదరదని మరొక సారి వాళ్ల కోరికను పక్కకి తోసారు. నెహ్రూ చేతుల్లో పూర్తిగా మోసపోయామనుకున్న సిక్కులు ఖలిస్తాన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 

అప్పటి నుంచి 1984 వరకు అడపా దడపా సాగుతూనే ఉంది. ఉద్యమం స్థాయి దాటి తీవ్రవాద స్థాయికి చేరిపోయింది ఆ పోరాటం. అనేకమంది సామాన్యులు చనిపోతుండేవారు. 1984లో ఇందిరాగాంధి ఏలుబడిలో కొందరు ఖలిస్తాన్ తీవ్రవాదులు స్వర్ణదేవాలయంలో తలదాచుకున్నారని తెలిసింది. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో ఆర్మీ జవాన్లు ఆ దేవాలయంలోకి చొరబడి కాల్పులు జరిపి ఎందరినో చంపేసారు. వారిలో అనేకమంది సామాన్య సిక్కులు కూడా పోయారు. మొత్తం 492 మంది సిక్కులు మరణించారు. ఎదురు కాల్పుల్లో 136 మంది జవాన్లు కూడా పోయారు. ఆ దమనకాండను జీర్ణించుకోలేని సిక్కులు ఇందిరాగాంధికి అంగరక్షకులుగా ఉన్న సిక్కులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగులను బ్రెయిన్ వాష్ చేసి...వారినే తీవ్రవాదులుగా మార్చి ఇందిరాగాంధిని చంపేలా చేసారు. 

సిక్కు మతం హిందూమతం నుంచి పుట్టినదే అయినా, సిక్కులు హిందువులతో ఎప్పుడూ సామరస్యంగా ఉన్నా వారిలో ఈ సంఘటనల తాలూకు గాయాలు మాత్రం పూర్తిగా మానలేదు. 

అయితే ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలయ్యింది. రెండు తరాలు గడిచిపోయాయి. అంతా శాంతియుతంగా మారింది. ఇప్పటి సిక్కుల్లో ఆ వేర్పాటు వాదం ఆరిపోయింది అనుకున్న తరుణంలో ఉన్నపళంగా ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ తెరమీదికొచ్చింది. అమృత్పాల్ సింగ్ అనే ఉద్యమనాయకుడి చుట్టూ హైడ్రామా నడుస్తోంది పంజాబులో. అక్కడ అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. 

ఎందుకిదంతా? ప్రస్తుతం సిక్కుల్లో ఇంతటి మతోన్మాదం ఉత్పన్నం కావడానికి ఈ మధ్యన ఆపరేషన్ బ్లూస్టార్ లాంటి భయంకర సంఘటనలు జరిగాయా? ఏమీ లేవు కదా? మరి ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే పలు అనుమానాలొస్తున్నాయి. 

ప్రత్యేక సిక్కుదేశం కావాలన్న డిమాండ్ పంజాబులో. కానీ కెనడాలోనూ, బ్రిటన్లోనూ, అమెరికాలోనూ, ఆష్ట్రేలియాలోనూ ఉన్న సిక్కులు అక్కడి హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద దాడులు చేయడమేంటి? అక్కడి ఇండియన్ కాన్సులేట్ల మీద రాళ్లు రువ్వి విధ్వంసం చేయడమేంటి? అలా చేస్తే ఇండియాలోని సిక్కులు కూడా రెచ్చిపోవాలనా? 

వాళ్లకి నిజంగా ప్రత్యేక పంజాబ్ దేశం కావాలనుకుంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబుని కూడా డిమాండ్ చెయ్యాలిగా! పాకిస్తాన్ ఎంబసీల మీద, పాకిస్తానీయుల మీద కూడా దాడులు చెయ్యాలిగా! ఆ పని చేయట్లేదే? నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ అన్ని రకాలుగా బలహీనంగా ఉంది. గట్టిగా ఉద్యమిస్తే చేతులెత్తేసినా ఎత్తేయొచ్చు. 

అంటే ఇది నిజంగా తన్నుకొచ్చిన ఉద్యమస్ఫూర్తి కాదు. ఎవరో స్పాన్సర్ చేస్తే రాజుకున్నదే. ఒకసారి రాజుకున్నాక ఎంతో కొంత మండుతుంది. అది వేరే విషయం. 

ఆ మధ్యన బ్రిటన్ వారి సౌజన్యంతో మోదీ మీద ఒక డాక్యుమెంటరీ తయారైంది. అది నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. మోదీ తన అధికారాన్ని వాడి అది స్ట్రీం అవ్వకుండా ఆపగలిగాడు. ఇప్పుడు అటువంటి ఏంటి-మోదీ గ్రూపులు (ఇండియాలోని కాంగ్రెస్ పార్టీ, సెక్యులరిష్టుల మిత్రులు) ఈ ఉద్యమానికి ఊపిరులూదుతున్నాయని అనుకోవాలి. ఎందుకంటే ఏయే దేశాల్లోని సిక్కులు అల్లర్లు చేస్తున్నారో ఆయా దేశాల్లోనే ఆయా ఏంటి-మోదీ గ్రూపులు ఎక్కువ. 

ఏదో రకంగా భారతదేశాన్ని దెబ్బ తీయాలి... ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి... అదానిని రోడ్డు మీదకి లాగి స్టాక్ మార్కెట్ ని కూలదోయాలి... మత కల్లోలాలు సృష్టించి దేశాన్ని ఆర్ధికంగా కృంగదీయాలి...ఇవే ఎజెండాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

అదలా ఉంటే ప్రస్తుతం భారతదేశం బలహీనంగా లేదు. మోదీ ప్రభుత్వం కూడా వీక్ గా లేదు. హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే పెరిగేది హిందుత్వ సెంటిమెంటే. దానివల్ల కలిసొచ్చేది బీజేపీకే. హిందువులకి, దేవాలయాలకి రక్షణ ఉండాలంటే బీజేపీని గెలిపించుకోక తప్పదని న్యూట్రల్ హిందూ ఓటర్లంతా ఒక్కటైతే ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ ఊపిరొదిలేయొచ్చు. 

సరిగ్గా ఎన్నికలకి ఏడాది ముందు ఖలిస్తాన్ ఉద్యమంతో దేశాన్ని అల్లకల్లోలం చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడి సిక్కులు కూడా ఇప్పుడీ ఉద్యమం అవసరమా అనుకుంటారు. సెంటిమెంటు అస్సలు లేదు. అవసరం లేని ఇలాంటి ఉద్యమాల్ని ఊది ఆర్పేసే శక్తి భాజపా ప్రభుత్వానికి ఉందని దేశంలో చాలామంది నమ్ముతున్నారు. మరి ఆ నమ్మకాన్ని భాజపా ప్రభుత్వం నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. 

ఇది ఆరిపోతే మళ్లీ మరొకటి తెర మీదకు రావడం ఖాయం. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు ఇవన్నీ మోదీ మీద సీరియల్ సర్జెకల్ ఎటాక్స్ అని అర్ధమైపోతూనే ఉంది. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?